breaking news
Korra Meenu
-
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
సాక్షి, హైదరాబాద్: చేప ప్రియులు లొట్టలేసుకొని తినే కొరమీనుకు కరీంనగర్ కేంద్రం కాబోతోంది. కొరమీను చేపలతో రాష్ట్రం కళ కళలాడేలా మత్స్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలను నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దగ్గరే వాటిని ఎక్కువగా పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. కరీంనగర్ కేంద్రంగా జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను కలిసి క్లస్టర్ ఏర్పాటు చేయాలని, ఇక్కడే కొరమీను చేపలను పెంచాలని భావిస్తోంది. మత్స్య శాఖ ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదిస్తే కొరమీనుకు మన దగ్గర కొదువే ఉండదు. ధరల భారం లేకుండా వాస్తవానికి తెలంగాణలో డిమాండ్‌కు సరిపోను కొరమీను చేపలు అందుబాటులో లేవు. ఏపీతోపాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెచ్చి మన మార్కెట్లలో అమ్ముతుంటారు. ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, సరిహద్దు ట్యాక్స్‌లతో పాటు కమీషన్లు కలిపి ఎక్కువ ధరకు వీటి విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తు తం చేపల మార్కెట్లో కొరమీను కిలో రూ.300–500 వరకు ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు కొరమీనులను చేప ప్రియులకు అందుబాటులోకి తెచ్చేలా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటోంది. నీటి వనరులే కీలకం కొరమీను చేపల పెంపకానికి నీటి వనరులు ఎక్కువ అవసరం. ముఖ్యంగా నీటి చలన, ప్రవాహం ఉన్న వనరుల్లో ఇవి త్వరగా, బలిష్టంగా పెరుగుతాయి. నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మత్స్యశాఖ కొరమీను చేపల పెంపకానికి ఎంపిక చేసింది. దీంతోపాటు ఉండ్రుమట్టి ఎక్కువగా ఉంటే, అందులో ఉన్న నాచు కారణంగా కొరమీనుచేపలు మరింత బలంగా పెరిగే అవకాశముంటుంది. అందుకే ఒండ్రుమట్టి లభ్యత ఉన్న ఆ నాలుగు జిల్లాల్లో కొరమీను పెంచాలని నిర్ణయించింది. -
సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను సాగు
బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేసిన షేక్ సలీం ఇంటికి తిరిగి వచ్చి, వినూత్న పద్ధతిలో చేపల సాగు చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సలీం ఇంటర్ ఎంపీసీ విద్యనభ్యసించారు. 23 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లి రియాద్ నగరంలో పనిచేశారు. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో అతని స్నేహితుడు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండేవాడు. ప్రతి శుక్రవారం సెలవు రోజు అతని దగ్గరకు వెళ్లి వారి సాగు పద్ధతులను పరిశీలిస్తూ ఉండేవారు. సిమెంటు ట్యాంకుల్లో చేపల పెంపకం, పురుగులను మేతగా వేయటం అక్కడే నేర్చుకున్నారు సలీం. 6 ట్యాంకుల్లో కొర్రమీను ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే చేపల సాగు చేపట్టి మంచి ఆదాయం గడించవచ్చనే తలంపుతో ఏడాది క్రితం నుంచి తండ్రి సహాయంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చారు. దేవరుప్పులలో 15 గుంటల (20 గుంటలు = అరెకరం) స్థలంలో 20 అడుగుల చుట్టుకొలత, 5 అడుగుల లోతు ఉండే గుండ్రని ఆరు సిమెంటు ట్యాంకులను నిర్మించారు. 3 ట్యాంకుల్లో 3 నెలలుగా కొర్రమీను (బొమ్మ చేపల) పెంపకం చేపట్టారు. మూడు నెలల్లో కొర్రమీను చేపలు 200 గ్రాముల బరువుకు పెరిగాయని, ఏడాదికి కిలో బరువు పెరుగుతాయని సలీం తెలిపారు. కిలోన్నర మేత మేపితే కిలో బరువుకు పెరుగుతాయన్నారు. 15 రోజుల క్రితం మరో మూడు ట్యాంకుల్లో కూడా కొర్రమీను సాగు ప్రారంభించారు. మొత్తం 6 ట్యాంకుల్లో 36,000 కొర్రమీను పిల్లలను వదిలారు. కొర్రమీను చేప పిల్లలకు మేపుతున్న పురుగులను చూపుతున్న రైతు సలీం చేపలకు పురుగుల ఆహారం బురద నీటిలో పెరిగే కొర్రమీను (బొమ్మ చేపల)కు మంచి గిరాకీ ఉండటంతో వీటిని సిమెంటు ట్యాంకుల్లో పెంచుతున్నారు సలీం. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పురుగులను ఆహారంగా వేస్తూ పెంచుతున్నారు. పల్లి చెక్క, తౌడును కలిపి తగిన తేమతో వారం రోజులు ట్రేలలో ఉంచితే.. పురుగులు తయారవుతున్నాయి. వీటిని బొమ్మ చేపలకు మేతగా వేస్తే రెండు నెలల్లో రెండు వందల గ్రాముల బరువు పెరిగాయని సలీం తెలిపారు. మొదటి నెల వరకు పురుగులను మాత్రమే రోజూ మేతగా వేశారు. ఆ తర్వాత నుంచి పురుగులతోపాటు కొనుగోలు చేసిన బలపాల (పెల్లెట్ల) మేతను కూడా కలిపి వేస్తున్నారు. ఇందుకోసం షెడ్లో 10 వరకు ట్రేలను ఏర్పాటు చేసి, ప్రతి రోజూ కొన్ని ట్రేలలో పల్లి చెక్క, తవుడు కలిపి పెడుతున్నారు. ముందే పెట్టిన ట్రేలలో సిద్ధమైన పురుగులను తీసి చేపలకు వేస్తున్నారు. రోజుకు 300–400 గ్రాముల పురుగులను వేస్తున్నారు. మరో 26 ట్యాంకులు ప్రస్తుతం కొర్రమీను చేపలు సాగు అవుతున్న 6 ట్యాంకులకు తోడు మరో 26 సిమెంటు ట్యాంకులను నిర్మించారు. 12“12 అడుగుల కొలతలో చతురస్త్రాకారంలో ఈ ట్యాంకులను నిర్మించారు. వీటిపైన 6“6 అడుగుల మేరకు సిమెంటు శ్లాబ్ ఏర్పాటు చేశారు. ట్యాంకు పై కప్పు సగం మూసి ఉంటే, ట్యాంకులో నీటి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచటం వీలవుతుందని ఆయన చెబుతున్నారు. దానితోపాటు ట్యాంకు పై కప్పు మీద ఆక్వాపోనిక్స్, రీసర్క్యులేటరీ పద్ధతిలో చేపల ట్యాంకులో నీటితోనే అజొల్లాను సాగు చేసి చేపలకు ఆహారంగా వేస్తానన్నారు. ఈ నీటితోనే కూరగాయలు సాగు చేయాలని కూడా ఆలోచిస్తున్నానని సలీం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 50 వేల కొర్రమీను చేప అతిచిన్న పిల్లల(ఒకటిన్నర అంగుళం)ను తీసుకు వచ్చి.. రెండు నెలలు సిమెంటు ట్యాంకుల్లో 8–10 అంగుళాల సైజు వరకు పెంచిన తర్వాత రైతులకు మట్టి చెరువుల్లో పెంపకానికి అమ్ముతానని సలీం తెలిపారు. తనతో పాటు తోటి రైతులు కూడా కొర్రమీను చేపలు పెంచి మంచి ఆదాయం గడించాలన్నదే తన అభిమతమని ఆయన తెలిపారు. – నల్ల లక్ష్మీపతి, సాక్షి, దేవరుప్పుల, జనగాం జిల్లా సిమెంటు ట్యాంకుల్లో చేపలు పెరగవన్నారు! సౌదీ మూడేళ్ల కిందట సిమెంటు ట్యాంకుల్లో పురుగుల మేతతో చేపలు, కూరగాయల పెంపకాన్ని చూసినప్పుడు నాలో ఆసక్తి కలిగింది. స్వగ్రామంలోనే 15 గుంటల్లో 32 సిమెంటు ట్యాంకులు నిర్మించా. సుమారు 65 లక్షల ఖర్చయ్యింది. తండ్రి ఇమామ్ తోడ్పాటుతో ఎడాది క్రితం నుంచి పనులు చేయిస్తున్నారు. సహజ పద్ధతిలో పురుగుల మేత, పెల్లెట్ల మేతలతో కొర్రమీను సాగు చేస్తున్నా. ఏడాదిలో కిలో సైజుకు పెంచి బతికున్న చేపలనే అమ్మితే మంచి ఆదాయం వస్తుంది. సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను పెరగదని అందరూ అన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా పెంచి చూపిస్తున్నా. కొర్రమీను పిల్లలను 2 నెలలు పెంచి రైతులకు అమ్ముతా. మట్టి చెరువుల్లో జాగ్రత్తలు తీసుకొని పెద్ద పిల్లలను పెంచితే 8 నెలల్లో వారికీ మంచి ఆదాయం వస్తుంది. కొర్రమీనుకు ఏ కాలంలో అయినా ఏ ఊళ్లో అయినా మంచి గిరాకీ ఉంటుంది. –షేక్ సలీం (93110 47909), దేవరుప్పుల, జనగామ జిల్లా -
తెలంగాణ రాష్ట్ర చేపగా కొరమీను
హైదరాబాద్: కొరమీనును రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు రాష్ట్రానికి కొరమీనును గుర్తించడం జరిగింది. కొరమీను తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా లభించడంతోపాటు ప్రజలు ఇష్టంగా తినే కొరమీనును రాష్ట్ర చేపగా గుర్తించాలని మత్స్యశాఖ రెండు నెలల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన చేసింది. కాగా ప్రతి రాష్ర్టానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తారు. అలా గుర్తించిన చేపను కాపాడుకోవటమే కాకుండా, దాని సంతతిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అంతేకాకుండా ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరుస్తారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాల చేపలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు, రాష్ట్ర పువ్వుగా తంగేడును ప్రకటించిన విషయం తెలిసిందే.