breaking news
Kharif paddy season
-
ఖరీఫ్ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్లో 5.18 కోట్ల మెట్రిక్ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో జూన్లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది. సాగు తగ్గిన ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
ఏ‘కరువు’!
వరుస కరువుతో కుదేలవుతున్న వ్యవసాయం ఈ ఏడాది కరుణించని వరుణుడు ప్రభుత్వ సాయం కోసం రైతన్నల ఎదురుచూపులు వనపర్తి: మూడేళ్లుగా వరుస కరువుతో అల్లాడుతున్న రైతన్నలకు చేయూతనందించే వారే కరువయ్యారు. ఖరీఫ్ ఆరంభంలో మురిపించి, ఆ తర్వాత ముఖం చాటేస్తున్న వర్షాల కారణంగా ఏటా పెట్టుబడులు పెట్టడం తప్పా.. ఆశించిన మేరకు దిగుబడులు సాధించుకున్న వారే లేరు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలు నమ్మిన అన్నదాతపై మరోసారి కోలుకోలేని దెబ్బపడింది. వేసిన పంటల్లో ఇప్పటికే 60శాతం ఎండిపోయాయి. వనపర్తి నియోజకవర్గంలో 35రోజులుగా చుక్క వర్షం లేకపోవడంతో మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయింది. నాడుమడులు వట్టిపోతున్నాయి. ఆగస్టులో కరుణించని వరుణుడు వర్షంపై ఆధారడి వ్యవసాయం చేసుకునే రైతులు రెండేళ్ల కరువులో చేసిన అప్పులు తీర్చుకుందామని ఎంతో ఆశతో మొదట్లో కురిసిన వర్షాలకు మొక్క, జొన్న, కంది పంటలను సాగు చేశారు. బోర్లలో కాసిన్ని నీరున్న రైతులు వర్షాలు పడకపోతాయా.. బోర్లు నిండా నీరు రాకపోతుందా అని వాతావరణ శాఖపై నమ్మకం ఉంచి వేసిన నారుమడులు ప్రస్తుతం పశుగ్రాసంగా మారిపోయాయి. ఖరీఫ్ ఆరంభంలో జూన్ మాసంలో వనపర్తి నియోజకవర్గంలో సగటు వర్షపాతం 67.8మిల్లీమీటర్లు కాగా 127.2 మి.మీ. వర్షం కురిసింది. జూలైలో 163.0మి.మీ.లకు 171.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ ఆగస్టులో వరుణుడు మొఖం చాటేడయంతో పంటలకు భారీ నష్టం జరిగింది. ఈ మాసంలో 143మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 41.4మి.మీ. మాత్రమే కురిసింది. 101.6మి.మీ వర్షం లోటు ఉండటంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. చెరువుల్లో కనిపించని జలకళ ప్రభుత్వం భూగర్భజలాలను పెంపొందించాలని రూ.కోట్లు వెచ్చించి మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేసినా, వర్షం రాని కారణంగా చెరువు నేల నెర్రెలతో దర్శనమిస్తోంది. రోజుకో బోరులో నీరు అడుగంటిపోతోంది. నిండా పొట్టదశలో ఉన్న మక్కపంట ఎండిపోతోంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయే గానీ పంట చేతికొచ్చే ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోని బీమా కంపెనీలు.. వరుస కరువుతో పల్లెల్లో అన్నదాతలు అల్లాడుతున్నా.. ప్రీమియం కట్టించుకున్న బీమా కంపెనీలు రూపాయి సాయం చేయడం లేదు. పెట్టుబడితో పాటు ప్రీమియం చెల్లించేందుకు వెచ్చించిన డబ్బులు వృథా అయ్యాయనే వేదనలో రైతులున్నారు. బీమా కోసం ప్రీమియం చెల్లించిన రశీదులతో నిత్యం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. (వనపర్తి, పెబ్బేరు, గోపాల్పేట, ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాల్లో ఈ ఏడాది పంటల వివరాలు హెక్టార్లలో..) పంట సాధారణ విస్తీర్ణం సాగు విస్తీర్ణం నష్టం అంచనా ఆముదం 4,527 2,195 850 కందులు 1,996 1,887 750 మొక్కజొన్న 16,524 14,196 12,000 జొన్న 2,111 1,799 850 పత్తి 3,441 868 450 వరి 11,226 4,200 2,500 ఎండిన పంటను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు వరుస కరువుతో అల్లాడుతున్న మమ్మల్ని ఆదుకునే వారే లేరా. ప్రభుత్వం రైతుల కష్టాలపై ఎందుకు స్పందించడం లేదు. వేలకువేల పెట్టుబడులతో వ్యవసాయం చేసే బదులు అడ్డమీది కూలీగా పనికి వెళ్లినా అప్పులు, వడ్డీల బాధలు తప్పేవి. ఎండిన పంటలను చూస్తే కన్నీళ్లు ఆగటం లేదు. – కుమ్మరి వెంకటయ్య, రైతు, చిట్యాల, వనపర్తి ఒక్క అధికారి రాలేదు.. పంటలకు బీమా వర్తించాలంటే ఇంతకంటే కరువు రావాలా? ప్రీమియం కట్టించుకునేప్పుడు ఉప కథలు చెప్పే అధికారులు, తీరా పంటలు ఎండాయంటే తిరిగి మళ్లీ చూడటం లేదు. ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత కనీసం ఒక్క వ్యవసాయ అధికారి కూడా పంటలను చూడటానికి ఊర్లోకి రాలేదు. – భాస్కర్, రైతు, చిట్యాల