breaking news
keshpalli ganga reddy
-
హ్యాట్రిక్ వీరులు ముగ్గురే..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీలుగా ఎని మిది మంది విజయం సాధించగా అందులో హ్యాట్రిక్ సాధించిన వారు ముగ్గురే ఉన్నారు. ఈ స్థానానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 17వ ఎన్నికల జరుగనుంది. తొలి ఎంపీగా విజయం సాధించిన హరీశ్చంద్ర హెడా మూడుసార్లు ఎంపీగా ఎంపికై రికార్డును సృష్టించారు. 1952, 1957,1962లలో పార్లమెంట్ ఎన్నికలు జరుగగా హరీశ్చంద్ర హెడా వరుసగా ఎంపీగా గెలుపొందారు. ఆయన తరువాత ఎం.రాంగోపాల్‌రెడ్డి 1971, 1977, 1980లలో వరుసగా విజయం సాధించి హరీశ్చంద్ర హెడా రికార్డును చేరుకున్నారు. 1991లో కేశ్‌పల్లి గంగారెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈయన 1998, 1999లలో కూడా ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ ఎంపీగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హ్యాట్రిక్ సాధించిన ఎంపీలలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా కేశ్‌పల్లి గంగారెడ్డి టీడీపీ తరపున బరిలో నిలిచి ఎంపీ అయ్యారు. తాడూరి బాలాగౌడ్, మధుయాష్కిగౌడ్‌లు మాత్రం రెండుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. మధుయాష్కి గౌడ్ 2014లోనూ పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఆశించినా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ కవిత చేతిలో ఓటమిపాలై హ్యాట్రిక్ రికార్డును చేరుకోలేక పోయారు. నారాయణరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డిలు ఒకేసారి ఎంపీలుగా తమ బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కవిత రెండోసారి పోటీ చేస్తుండగా మధుయాష్కిగౌడ్ నాలుగోసారి, ధర్మపురి అర్వింద్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా స్వతంత్రులుగా రైతులు 178 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో ఎవరికి ఎలాంటి రికార్డు లభిస్తుందో వేచి చూడాలి. -
సౌరశక్తితో ‘కోత’లకు విముక్తి
నవీపేట, న్యూస్‌లైన్: దేవుడు ప్రసాదించిన సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. సౌరశక్తితో విద్యుత్ కోతలను అధిగమించవచ్చన్నారు. గురువారం నవీపేట శివారులో గల దాస్ గెస్ట్ హౌస్ వద్ద గల పంట పొలాల్లో అమర్చిన సౌరశక్తితో 5 హెచ్‌పీ మోటార్‌ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్యుత్ సమస్యతో రైతులతో పాటు పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఉత్తత్పి పెరగకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. సౌరశక్తితో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చన్నారు. సౌరశక్తి ద్వారా 7 నుంచి 8 గంటల వరకు అందించే విద్యుత్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందజేస్తున్న సౌరశక్తి విద్యుత్ తయారీ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో గల 20 లక్షల వ్యవసాయ బోరు కనెక్షన్లకు సౌరశక్తి విద్యుత్‌ను వాడుకునేందుకు రైతులను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సౌరశక్తి విద్యుత్‌తో కోతలు,లో వోల్టేజి,మోటార్ కాలిపోవడం,అధిక బిల్లులు తదితర సమస్యల నుంచి గట్టెక్కవచ్చన్నారు. పంట పొలాల్లో సౌరశక్తిని వినియోగించడంతో పారిశ్రామికరంగానికి ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చన్నారు. సౌరశక్తిని వినియోగిస్తున్న రైతులు స్మార్ట్ మీటరింగ్ ద్వారా మిగతా విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు అమ్ముకోవచ్చని, ఈ పద్ధతి త్వరలోనే అమలవుతుందని పేర్కొన్నారు. సౌరశక్తి వినియోగానికి ముందుకు వచ్చిన భవంతి దేవదాస్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, డీసీసీ చీఫ్ తాహెర్‌బిన్ హందాన్, కాంగ్రెస్ నాయకులు మోస్రా సాయరెడ్డి, డాంగె శ్రీనివాస్, రాంకిషన్రావ్, పాండురంగారెడ్డి, సూరిబాబు, టైటాన్ టెక్నో క్రాట్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధి మురళీ కృష్ణ,డీలర్ కృష్ణ గౌడ్ రైతులు పాల్గొన్నారు.