breaking news
Kazuo Ishiguro
-
బ్రిటన్ దేహంలో జపాన్ ఆత్మ
జపాన్‌తో బలీయమైన భావోద్వేగ బంధనాలు ఉన్న కారణంగా, వెనక్కి తిరిగి వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది అనే విషయం ఆయన్ని ఒక నీడలా వెన్నాడుతూ ఉంటుంది. సరస్సు స్థిర ఉపరితలం చూసి దాని అడుగున అల్లకల్లోలాల్ని అంచనా వేయలేనట్టుగా ఆయన రచనలు ఉంటాయి. హరూకీ మురకామీ(జపాన్), గూగీ వా థియోంగ్(కెన్యా) లాంటివారిని వెనక్కు నెట్టి, జపాన్ మూలాలున్న బ్రిటన్ రచయిత కజువో ఇషిగురోను ఈ యేడు నోబెల్ వరించింది. బాగా అమ్ముడుపోయే పుస్తకాలు రాసి వాటికి పురస్కారాల్ని సైతం పొందే రచయితలు కొద్ది మందే ఉంటారు. అలాంటివారిలో కజువో ఇషిగురో ఒకరు. 1986, 1989, 2000, 2005లలో నాలుగు సార్లు బుకర్ ప్రైజ్ గెలుచుకున్న 62 ఏళ్ల కజువో ఇషిగురో ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు బాధిత నగరమైన జపాన్‌లోని నాగసాకిలో జన్మించాడు (8 నవంబరు 1954). ఇషిగురో అంటే శిల లేదా నలుపు అని అర్థం. ఆయన తండ్రి షిజువో ఇషిగురో సముద్ర విజ్ఞానంలో ప్రవీణుడు. అణుబాంబు విధ్వంసాన్ని యుక్త వయస్సులో తట్టుకుని బ్రతికింది తల్లి షిజుకో. తన ప్రావీణ్యత మీద నమ్మకంతో ఇషిగురో తండ్రి జపాన్ను వదిలి, మరో ఇద్దరు కుమార్తెలతో బాటు, 5 ఏళ్ల పసివాడైన కజువోను వెంటబెట్టుకుని, 1960లో దక్షిణ ఇంగ్లాండ్‌లో ఒక చిన్న పట్టణమైన గిల్డ్ ఫోర్డ్ సర్రేకు వలస వచ్చాడు. తాత్కాలిక ఉద్యోగమే అయినా, పొడిగింపులతో సాగడంతో వారి కుటుంబం అక్కడే స్థిరపడింది. 9–10 ఏళ్ల వయస్సులో స్థానిక గ్రంథాలయంలో ఇష్టంగా చదువుకున్న షెర్లాక్ హోమ్స్ పుస్తకాలే ఇషిగురోకు సాహిత్యంలో అభిరుచికి కారణమైనాయి. 1970 నాటికి నిరాశ్రయులకు గృహ నిర్మాణ హక్కుల కోసం ఆదర్శ సామాజిక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 15వ సంవత్సరం నుండీ ఒక హాబీగా మొదలైన పాటలు రాయడం నవలా ప్రక్రియకు బాగా పనికొచ్చిందని ఇషిగురో నమ్మకం. ఉత్తమ పురుషలో శ్రోతలను ఉద్దేశించి పాడటాన్ని నవలల్లో సైతం కొనసాగించాడు. ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ ఆయన తొలి నవల. ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న ఒక మధ్య వయస్కురాలైన జపానీ వితంతువు, నాగసాకీలోని తన జీవితం, కుటుంబపు ఆలోచనలతో నెమ్మదిగా తన కూతురు ఆత్మహత్య తెలుసుకునే వరకూ సాగే నవల. సర్వసమ్మతంగా అందరి ప్రశంసలు పొందింది. 27 సంవత్సరాల వయస్సులో ప్రచురించబడ్డ ఈ మొదటి నవలకు వచ్చిన ఆదరణ ఫలితంగా గ్రాంటా సంస్థ 1983లో అప్పటి యువ బ్రిటిష్ రచయితలతో తెచ్చిన ప్రత్యేక కథల సంకలనంలో కజువో ఇషిగురోను కూడా చేర్చింది. జులియన్ బార్నెస్, పాట్ బార్కర్, సల్మాన్ రష్ది లాంటి వారి రచనలు అందులో ఉండటం ఇషిగురో సాహిత్య ప్రయాణానికి ఎంతగానో పనికొచ్చింది. అప్పటినుండీ ఏర్పడిన అనుబంధంతో ఇషిగురోకు నోబెల్ ప్రకటించిన వెంటనే అభినందనలు తెలిపిన వారిలో సల్మాన్ రష్దీ ముందున్నారు. అది మొదలు ప్రతీ అయిదేళ్లకు ఇషిగురో పుస్తకాలు రావడం మొదలయింది. రెండవ నవల 1986లో వచ్చిన ‘ఏన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్‌లోని ఒక వయస్సు మళ్ళిన చిత్రకారుడు తన పూర్వ అతిక్రమణల మూలంగా కుమార్తె వివాహంలో పడుతున్న కష్టాల్ని వివరించడం అందులోని వృత్తాంతం. నాగసాకి నేపథ్యంతో వచ్చిన మొదటి రెండు నవలలూ తన జ్ఞాపకాల నుండి అందులోని విషయాలు చెరగిపోకముందే రాశానని ఆయనే చెప్పుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టు అవి తమ జీవిత చరిత్రలు కావనీ, తాను తూర్పు పడమరల వారధిగా చెప్పుకునే డాంబికుడ్ని కాదనీ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ నవల విడుదలయిన ఏడాదే తనతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పనిచేసిన లోర్నా మక్డొగల్ను పెళ్లి చేసుకున్నాడు. వారికొక కూతురు. నవోమీ. 32 ఏళ్ల వయస్సులో కేవలం నాలుగు వారాల్లో పూర్తి చేసిన నవల ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ ఇషిగురోకు బుకర్ ప్రైజ్‌తో పాటు అత్యంత పేరు ప్రతిష్టల్ని తెచ్చి పెట్టింది. అదే పేరుతో అద్భుతమైన చలనచిత్రంగా కూడా 1993లో రూపొందింది. ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో బట్లర్ గా పనిచేసిన స్టీవెన్స్ తన అనుభవాల్ని వివరించిన కథనం అది. పదిలక్షల కాపీలకు పైగా అమ్ముడుపోవడం నవల పాఠకాదరణను తెలియజేస్తుంది. కలలా సాగే అధివాస్తవిక నవల ‘ద అన్ కన్సోల్డ్’ను 1995లో రాశాడు. యూరప్‌లో పేరు చెప్పని ఒక నగరంలో ఒక వారాంతంలో పియానో వాయించే వ్యక్తి వృత్తాంతం ఇది. 500 పేజీలకు మించిన, చైతన్యస్రవంతిలో సాగిన అసాధారణ కథ. అలాగే 20వ శతాబ్దం ప్ర«థమార్థంలో షాంఘైలో మొదలై ప్రాంతాలు, కాలాలు మారుతూ సాగే ఒక ప్రయోగాత్మక డిటెక్టివ్ నవల 2000 సంవత్సరంలో వచ్చిన ‘వెన్ వియ్ వెర్ ఆర్ఫన్స్’. 1990 ప్రాంతపు ఇంగ్లాండ్‌లోని స్థానభ్రంశం చెందిన వసతి విద్యాలయంలోని ప్రేమికుల విషాద స్థితుల్ని సైన్స్ ఫిక్షన్ రూపంలో రాసిన నవల 2005లో వచ్చిన ‘నెవర్ లెట్ మీ గో’. ఇది కూడా చలనచిత్రంగా రూపొందింది. 1923 నుండి 2005 వరకూ వచ్చిన వంద గొప్ప ఆంగ్ల నవలల్లో ఇదీ ఒకటిగా పేరు తెచ్చుకుంది. 2008లో టైమ్స్ పత్రిక 1945 నుండీ ఎన్నుకున్న 50 మంది బ్రిటిష్ మహా రచయితల్లో 32వ రచయితగా ఇషిగురోను గుర్తించింది. తెరమరుగన్నది ఎలా ఇప్పటివరకూ చరిత్ర, కల్పన, వాస్తవాలను జోడించుకుంటూ సాగుతుందో తెలియజెప్పే నవల 2015లో వచ్చిన ‘ద బరీడ్ జెయింట్’. తప్పిపోయిన కొడుకు కోసం తమ గ్రామాన్ని వదిలి, ఆశగా వెతుకుతూ వెళ్లే వృద్ధ దంపతుల ఫాంటసీ కథ ఇది. ఇషిగురో రచనలు మనుషుల్లో అంతర్లీనంగా ఉన్న ఊహలను అద్భుతమైన భావోద్వేగాల సమ్మిశ్రమంతో వెల్లడి చేస్తాయని నోబెల్ బహుమతి ప్రదాతలు కొనియాడారు. ఉద్వేగాలు ఉండటం బలహీనత కాదు, ఉద్వేగాల్ని నియంత్రించుకునే సామర్థ్యం ఉండటం గౌరవంగానూ, లక్షణమైనదిగానూ బ్రిటిష్ జపాన్ సమాజాలు భావిస్తాయని ఆయనే వెల్లడించారు. సరస్సు స్థిర ఉపరితలం చూసి దాని అడుగున అల్లకల్లోలాల్ని అంచనా వేయలేనట్టుగా ఆయన రచనలు ఉంటాయి. అమెరికా ప్రసిద్ధ జాజ్ గాయకురాలు స్టాసీ కెంట్కు ఆయన గీతాలు రాసిచ్చేవారు. గిటార్ వాయించే నేర్పు కూడా ఉంది. వారి భాగస్వామ్యంలో వచ్చిన ‘బ్రేక్ ఫాస్ట్ ఆన్ ద మార్నింగ్ ట్రామ్’ అన్న ఆల్బమ్ ఫ్రాన్స్‌లో కూడా విశేషంగా అమ్ముడుపోయింది. 2016లో నోబెల్ బహుమతి వరించిన బాన్ డిలాన్ను ఈ రంగంలో తన హీరోగా చెప్పుకుంటాడు. తన అనుభవాలను ఎక్కువగా పాటల్లోనే నిక్షిప్తం చేస్తాడు. ప్రదర్శన సమయాల్లో పదాలు, సంగీతం మధ్య సంబంధాల సజీవత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేడు. సినిమాలకూ, టీవీకీ స్క్రిప్ట్ రచయిత కూడా. మనసంతా నిండి ఉన్న అవే భావాలతో ఆయన నవలలు ఉంటాయని ఒక విమర్శ ఉంది. జ్ఞాపకాల భ్రమ, మృత్యువు, కాలపు చెమర్చే స్వభావం ఇవన్నీ పునరావృతమవుతూనే ఉంటాయి. ఆయన రచనలు జేన్ ఆస్టిన్, ఫ్రాంజ్ కాఫ్కాల మిశ్రమం అనీ, దానికి మార్సెల్ ప్రూస్ట్‌ను కొద్దిగా అద్దాలనీ నోబెల్ ప్రదాతలు వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ వాస్తవంలోకి ఆయన పాఠకుడిని తీసుకుపోతాడు. అది భవిష్యత్తు కావచ్చు, వర్తమానం కావచ్చు, లేదా గతం కావచ్చు, ఆ ప్రాంతం సమస్తం పాఠకులు నిజం అనుకుంటారు. అవి వింతైనవి అయినా సరదాగా గడిపేవీ కావు, ఉండేవీ కావు, వేటికో జోడించుకునేవీ కావు, అయినా అందులోని పాత్రలతో అమితంగా మమేకమవుతారు. అస్సామీ చాయ్ అంటే ఇషిగురోకు అమితమైన ఇష్టం. జపాన్‌తో బలీయమైన భావోద్వేగ బంధనాలు ఉన్న కారణంగా, వెనక్కి తిరిగి వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది అనే విషయం ఆయన్ని ఒక నీడలా వెన్నాడుతూ ఉంటుంది. తల్లి ఇప్పటికీ పాతకాలపు జపాన్ స్త్రీలానే ఉంటుంది. ఇంటిలో ఉన్న వాతావరణం మూలంగా జపాన్ను తల్లిదండ్రుల కళ్లతో ఎప్పుడూ చూడగలుగుతుంటాడు. - ముకుంద రామారావు 9908347273 -
చరిత్ర సారాంశంతో సంభాషణ
చరిత్ర గమనంలో ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి. భూగోళం మీద అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని తొలిసారి చూసిన నేల నాగసాకిలో ఆయన పుట్టి పెరి గారు. ఈ సంవత్సరం నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కానీ ఆయన తన రచనలలో అణుబాంబు విస్ఫోటనం గురించి చెప్పరు. బాహ్య ప్రపంచానికీ, దాని మీద అంతరంగంలో మనిషి చేసే ఆలోచనలకీ మధ్య ఉన్న అగాధాన్ని ఆవిష్కరిస్తారు. ఆయనే కజువో ఇషిగురో. పోటీలో ఉన్న గూగీ వా థియాంగ్ (‘మట్టికాళ్ల మహారాక్షసి’ నవలాకారుడు), మార్గరెట్ అట్వుడ్ (కెనడా రచయిత్రి), హరుకీ మురాకమి (జపాన్ కవి)లను కాదని ఈ ఏటి పురస్కారం ఇషిగురోను వరించింది. పాశ్చాత్య సాహితీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే మ్యాన్ బుకర్‌ను 4 సార్లు స్వీకరిం చారు ఇషిగురో. జేన్ ఆస్టిన్, ఫ్రాంజ్ కాఫ్కాల సృజన శైలులను కలిపి, దానికి మార్సెల్ ప్రాస్ట్ను అద్దితే అదే ఇషిగురో రచన అవుతుందని అంటారు. దోస్త్యేవ్స్కీ ప్రభావం కూడా ఆయన మీద ఉంది. ఇష్ ఉత్తమ పురుషలో నవల చెప్పడంలో అఖండుడని ఖ్యాతి. ‘ఏ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’, ‘ది అన్‌కన్సోల్డ్’, ‘నెవర్ లెట్ మి గో’, ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్’, ‘వెన్ వియ్ వర్ ఆర్ఫన్స్’వంటి నవలలన్నింటిని ఆయన ఉత్తమ పురుషులోనే రాశారు. చివరి నవల ‘ది బరీడ్ జెయింట్’(2015) మాత్రం ఇందుకు భిన్నం. ‘ది ఫ్యామిలీ సప్పర్’, ‘ది సమ్మర్ ఆఫ్టర్ ది వార్’మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. ఆయన గీత రచయిత కూడా. ఉత్తమ పురుషలో నవలను అమోఘంగా నడిపించగల ఇషిగురో రాసినదే–‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’. సమకాలీన సమాజంతో, దాని పోకడలతో మనసు చేసే పోరాటాన్నీ, వాటితో రాజీపడే తీరునీ ఇందులో ఎంతో సమర్థంగా అక్షరబద్ధం చేశారు ఇషిగురో. లార్డ్ డార్లింగ్టన్ హాలులో మూడున్నర దశాబ్దాల పాటు బట్లర్‌గా పనిచేసిన స్టీవెన్స్ అనుకోకుండా చేసిన ఆరురోజుల యాత్రలో తన అనుభవాలను గుర్తు చేసుకునే క్రమం ఈ నవలలో ఇతివృత్తం. 1950లలో జరిగే కథాకాలానికి ఆ హాలు డార్లింగ్టన్ అధీనంలో లేదు. ఫారడే అనే అమెరికన్ ధనవంతుడు దానిని కొనుగోలు చేశాడు. తన వైవాహిక జీవితం సజావుగా లేదంటూ మిస్ కెంటన్ రాసిన ఉత్తరం అందిన తరువాత ఆమె నివాసం ఉంటున్న కార్న్‌వాల్‌కు బయలుదేరతాడు స్టీవెన్స్. మిస్ కెంటన్ గతంలో డార్లింగ్టన్ హాలులోనే పనిచేసేది. స్టీవెన్స్ కలల రాణి. కానీ ఈ విషయం ఏనాడూ వ్యక్తం చేయకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుని వెళ్లిపోయింది. స్టీవెన్స్ ఏదో ఆశించి వెళతాడు. ఆ ఉత్తరం అలాంటి ఆశలు రేపింది. కానీ నిరాశకు గురై తిరుగు ప్రయాణమవుతాడు. ఇదే ఇతివృత్తం. కానీ ఆ బట్లర్ జ్ఞాపకాలలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య చరిత్ర, ఇంగ్లిష్ సమాజంలోని వైరుధ్యాలు, అపోహలు, భ్రమలు, చారిత్రక తప్పిదాలు.. వంటింట్లో నుంచి పదార్థాల కంటే ముందే వచ్చే ఘాటు వాసనల్లా పాఠకులకు తగులుతూ ఉంటాయి. పాత యజమాని డార్లింగ్టన్కి, కొత్త యజమాని ఫారడేకి కూడా స్టీవెన్స్ మానసికంగా సుదూరంగా ఉండిపోయాడు. పాత యజమాని కాలంలో విన్స్టన్ చర్చిల్‌కి, జర్మనీ నుంచి వచ్చిన నాజీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జాచిమ్ వాన్ రిబ్బెన్ట్రాప్కీ కూడా ఆ ఇంట్లో వడ్డించాడు. బ్రిటిష్ యూనియన్ ఆఫ్ ఫాసిస్ట్ బృందం నాయకుడు సర్ ఆస్వాల్డ్ మోస్లే (లేబర్ పార్టీ)కు కూడా వడ్డించాడు. డార్లింగ్టన్ ఫాసిజం మీద సానుభూతి కలిగి ఉండడం స్టీవెన్‌ను బాధిస్తూ ఉంటుంది. అయినా అదే వినయంతో సేవిస్తూ ఉంటాడు. కొత్త యజమాని వ్యంగ్యోక్తులు కూడా రుచించవు. అయినా స్టీవెన్స్ ఏనాడైనా తన ప్రాణం కంటే తన విధినే ఎక్కువ ప్రేమించాడు. నిజానికి మిస్ కెంటన్ మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేయకపోవడానికి కారణం కూడా అదే. మిస్ కెంటన్ను కలుసుకున్నాక ఆమె, ‘నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం ఇంతకంటే ఎంతో బాగుండేది’ అని అంటుంది. కానీ తన భర్తను వదిలి రాదు. తీవ్ర నిరాశతో తిరుగు ప్రయాణమవుతాడు స్టీవెన్స్. అంతా నిర్వేదమే. మళ్లీ ఆ నిర్వేదం మధ్యలోనే కొత్త యజమానికి మరింత విశ్వాసంతో పని చేసి మెప్పు పొందాలని తీర్మానించుకుంటాడు. నిజమే, చరిత్ర గమనంలో మనకు ఎదురయ్యే ఘటనలలో మన మనసుకు నచ్చేవి ఉంటాయి. అనిష్టమైనవీ ఉంటాయి. కానీ రెంటినీ మానవాళే పోషిస్తూ ఉంటుంది. చాలా మలుపులలో వారి ఇష్టాయిష్టాలు అప్రస్తుతమైపోతాయి. ఇషిగురో ఐదో ఏటనే ఇంగ్లండ్ వచ్చాడు. అందుకే తన స్వదేశం అంటే అతడికి ఒక సుదూర జ్ఞాపకం. అయినా అతడు తుడిచిపెట్టలేదు. ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్’ నవల రెండో ప్రపంచ యుద్ధానంతరం జపాన్‌లో బతికిన ఒక కళాకారుడి మథనను చిత్రించింది. ‘ది బరీడ్ జెయింట్’ నవలలో ఒక వృద్ధజంట ప్రయాణంతో గతానుభవాలను వర్ణిస్తాడు. వర్తమానానికీ చరి త్రకీ మధ్య విడదీయలేని ఒక బంధం ఉందని ఆయన నిర్ధారిస్తారు. ఇషిగురో తన పాత్రలకు, నిజానికి నవలలకు కూడా ప్రత్యేకమైన ముగింపును ఇవ్వరు. జనం స్మృతిపథం నుంచి పోతున్న కొన్ని వాస్తవాలను చెప్పించడానికే ఆయన వాటిని సృష్టిస్తారని విశ్లేషకులు చెబుతారు. అందుకే ఆయన ప్రతి నవల చరిత్ర చెక్కిలి మీద కన్నీటి చారికను గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఆయన పూర్తిగా చరిత్రనే అంటిపెట్టుకోలేదు. ‘నెవర్ లెట్ మి గో’ నవల అందుకు సాక్ష్యం. శరీరాంగాలను తీసి అమ్మడానికి ఉద్దేశించిన పిల్లలను సృష్టించే ఒక రాక్షస యుగం వస్తుందని ఈ నవలలో చెబుతారు. ఇది సైన్స్ ఫిక్షన్. ఫ్యూచరిస్టిక్ శైలి కలిగినది కూడా. ‘ది రిమెయిన్స్ ఆఫ్ ది డే’ కంటే ఇదే గొప్ప నవలని చాలామంది భావిస్తారు. – సత్యగిరీశ్ గోపరాజు కజువో ఇషిగురో -
సాహితీ దిగ్గజానికి నోబెల్ గౌరవం
సాహితీ దిగ్గజం కజౌ ఇషిగురో(62)ను సాహిత్య నోబెల్- 2017 వరించింది. అమెరికా విసిరిన అణుబాంబును తన గుండెలపై భరించిన జపాన్‌లోని నాగసాకిలో ఇషిగురో 1954 నవంబర్ 8న జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసున్న సమయంలో కుటుంబం యూకేకు వచ్చేయడంతో అక్కడే స్థిరపడ్డారు. ఇషిగురో ఇప్పటివరకూ ఎనిమిది పుస్తకాలు రచించారు. చిత్రాలకు, టీవీ కార్యక్రమాలకు స్క్రిప్టులను కూడా అందించారు. ఇషిగురో రచనల్లో 'ద రిమెయిన్స్ ఆఫ్ ది డే' ప్రసిద్ధి చెందింది. దీన్ని 1989లో ఆయన రచించారు. 1993లో 'ద రిమెయిన్స్ ఆఫ్ ది డే' చిత్రంగా కూడా విడుదలై ఘన విజయం సాధించింది. ది రిమెయిన్స్ ఆఫ్ ది డే నవలే 2017 సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైంది. Watch the very moment the 2017 #NobelPrize in Literature is announced! pic.twitter.com/7IcRm5Bb2f — The Nobel Prize (@NobelPrize) October 5, 2017