breaking news
kamatam ram reddy
-
ముగిసిన ‘కమతం’ రాజకీయ శకం
సాక్షి, గండేడ్ (మహబూబ్‌నగర్): మారుమూల పల్లెలో పుట్టి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉండి పరిగి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రవేసుకున్న నాయకుడు కమతం రాంరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లో మృతిచెందగా మధ్యాహ్నం స్వగ్రామానికి తీసుకొచ్చారు. రంగనాయకమ్మ లక్ష్మారెడ్డి దంపతులకు 1938లో జన్మించిన ఆయన న్యాయశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే మహ్మదాబాద్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికై రాజకీయ గురువు, మహ్మదాబాద్‌కు చెందిన జగన్మోహన్రెడ్డి అండతో 1968లో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా, 1977లో వెంగళ్రావు మంత్రివర్గంలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి అభినందనలు తెలుపుతున్న కమతం రాంరెడ్డి(ఫైల్) 1976లో పరిగి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 1980లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రిగా, 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. చివరకు కొప్పుల మహేశ్‌రెడ్డికి సహకరించేందుకు టీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూమంత్రిగా పనిచేసే సమయంలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. -
రూ.10 వేలు కూడా ఖర్చుకాలే..! : కమతం
‘నాడు విలువలతో కూడిన రాజకీయం చేసే వారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ అలాగే ఉండేవారు. 1980 వరకు ఆ పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజకీయాలు మారుతూ వచ్చాయి. నేడు విలువల గురించి చెప్పే వారు లేరు.. చెప్పినా వినేవారు లేరు.. పాటించే వారు అంతకన్నా లేరు’ అని మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అన్నారు. డబ్బులు లేకుండా రాజకీయమంటే నేడు వింతగా చూసే పరిస్థితి వచ్చిందని, డబ్బుతోనే అంతా ముడిపడి ఉందని అన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆయనను పలకరించగా.. రాజకీయాల్లో, ప్రజల్లో వచ్చిన మార్పులను.. తన అనుభవాలను వివరించారు. సాక్షి, పరిగి: నేడు రాజకీయాలను, డబ్బును వేర్వేరుగా చూడలేము. ఇప్పుడు డబ్బు లేకుండా రాజకీయాల్లోకి రావటాన్ని కనీసం ఊహించలేం. ఎమ్మెల్యేగా గెలవాలంటే కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ చెబుతున్న రూ.28 లక్షలు కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికల్లో కూడా వెచ్చిస్తున్నారు. ఇలా ఎన్నికల్లో ఓట్ల కోసం వెచ్చిస్తున్న డబ్బులు మళ్లీ వారి నుంచే సంపాదించాలిగా.. నేడు నేతలెవరైనా ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేస్తున్నారా.. అప్పట్లో రాజకీయాలన్నీ కాస్ట్ లెస్.. కరప్షన్ లెస్ అన్న తరహాలో ఉండేవి. ఇప్పుడు కనీసం అది ఊహల్లోనైనా జరుగుతుందా. నేను మొదటి సారిగా 1967లో ఎమ్మెల్యేగా పోటీచేశాను. అప్పట్లో కేవలం రూ.10 వేల లోపే ఖర్చు చేశాను. అవి కూడా డబ్బుల రూపంలో నయా పైసా కూడా ఎవరికీ ఇవ్వలేదు. గోడల మీద రాతలు, బ్యానర్లు, గుర్తు చూపించేందుకు బ్యాలెట్ పేపర్లు తదితర వాటికి ఖర్చు చేశాం. 1980 సంవత్సరం వరకు టీ తాపటం వరకే ఖర్చులుండేవి. నేడు వ్యక్తిగత కోర్కెలే.. ఆ రోజుల్లో ప్రచారానికి గ్రామంలోకి వెళ్లగానే ఎంతో ఆప్యాయతతో ప్రజలు పలకరించేవారు. గ్రామ నాయకులు ఎదురు వచ్చి స్వాగతం పలికేవారు. ఒక్కరు కూడా వ్యక్తిగతంగా నాకిది కావాలని అడిగేవారు కాదు. గ్రామంలో స్కూల్, కరంటు, మంచి నీల్లు, రోడ్డు కావాలని ఇలా సామాజిక సమస్యలే అడిగేవారు. ఒకరిద్దరికి కలిసి వచ్చేవాళ్లం. వారే గ్రామంలో అందరికి చెప్పి ఓట్లు వేయించే వారు. ఇప్పుడు నేతలు, కార్యకర్తలు ఇలా ఎవరు చూసినా వ్యక్తిగత కోర్కెలతో ఓ పార్టీని విడిచి మరో పార్టీలో చేరుతున్నారు. రాయితీ ట్రాక్టర్ కోసం ఒకరు.. నామినేటెడ్ పదవి కోసం మరొకరు..ఆర్థిక లాభాల కోసం ఒకరు చర్చలు జరిపి పార్టీలు మారుతున్నారు. భోజనాలు గ్రామ నాయకులే ఏర్పాటు చేసేవారు.. మా రోజుల్లో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా.. గెలిచాక గ్రామానికి అభివద్ధి పనుల పర్యవేక్షణకు వెళ్లినా ఆ గ్రామంలో ఉండే నాయకులే భోజనాలు ప్రేమతో ఇళ్లలో వండి పెట్టేవారు. నేడు వెంట తిరిగే కార్యకర్తల కోసం నాయకులు రోజూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. బీరు.. బిర్యాని అంటూ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రచారంలో పాల్గొనే వారికి రోజు కూలీ కూడా ఇస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు నా హయాంలోనే ఇచ్చాం.. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు భూమి హ క్కులకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు అందజేశాం. 1992లోనే పాసుపుస్తకాలు ముద్రించటం పూర్తయిన ప్పటికీ ఎన్నికల కోడ్ అంటూ చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ఇవ్వకుండా అడ్డుకున్నా డు. మళ్లీ ఎన్నికలయ్యాక 1994లో మేమే ఇచ్చాం. ఆ తరువాత చాలా రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించి ఇచ్చాయి. ఒక్కటి తప్ప అన్నీ చేశాను.. రాష్ట్రంలోనే అట్టడుగున ఉన్న పరిగి నియోజకవర్గా న్ని ముందువరుసలో నిలబెట్టాను. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ని యోజకర్గానికి చేసినంత.. ఆయన సొంత నియోజకవర్గానికి కూడా చేసుకోలేదు. లఖ్నాపూర్, సాలార్‌నగర్ సాగు నీటి ప్రాజెక్టులు.. అంతారం, ఇప్పాయిపల్లి చెరవులు నా హయాంలోనే నిర్మించాం. పరిగిలో బస్‌డిపో, వ్యవసాయ మార్కెట్, పాలశీతలీకరణ కేంద్రం, కుల్కచర్లలో డిగ్రీ కళాశాల, ఇలా పెద్ద పెద్ద పనులన్నీ నేనే చేయించాను. నియోజకవర్గంలో ప్రతి తండాకు కరంటు, ప్రతి గ్రామానికి రోడ్లు వే యించాను. కోయిల్‌సాగర్ నుంచి గానీ కృష్ణా నది నుంచి నేరుగా గానీ సాగు నీరు తేవాలని అనుకున్నాను. కానీ, అదొక్కటి చేయలేకపోయాను. వైఎస్ డైనమిక్ లీడర్.. వాజ్‌పేయి ఇష్టమైన నాయకుడు ఇప్పుడు అనుకోని పరిస్థితిలో బీజేపీలో ఉన్నాను. కానీ, నేను మొదట్నుంచి కాంగ్రెస్ వాదినే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి మనసున్న డైనమిక్ లీడర్. పీవీ నర్సింహారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలు మంచి నాయకులు. కాంగ్రెస్ వాదినైనప్పటికీ జాతీయ రాజకీయాల్లో నాకు వ్యక్తిగతంగా వాజ్‌పేయి అంటే బాగా నచ్చుతుంది. కేసీఆర్ తెచ్చిన రైతు బంధు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు బీమా పథకాలు బాగున్నాయి. -
తంతు ముగిసింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభిప్రాయ సేకరణకు తెరపడింది. అభ్యర్థుల ఖరారుపై మూడు రోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ దూత నిర్వహించిన కసరత్తు మంగళవారం ముగిసింది. ఆశావహుల బలప్రదర్శన.. అనుచరుల హంగామా నడుమ ఏఐసీసీ పరిశీలకుడు కోలివాడ్ అభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. చివరి రోజు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం సహా పరిగి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు.. దూత ముందు బారులు తీరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గాంధీభవన్‌లో ప్రత్యేకంగా పరిశీలకుడితో భేటీ కాగా, మరో మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పరిగి స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. పార్లమెంటు సీటును సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డికే ఇవ్వాలని సూచించారు. టికెట్ తనకు ఇవ్వని పక్షంలో కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. 2009లో చివరి నిమిషంలో టికెట్ లభించకపోవడంతో రెబల్‌గా బరిలో దిగి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన టి.రామ్మోహన్‌రెడ్డి కూడా పరిశీలకుడిని కలిసి తన అంతరంగాన్ని వెలిబుచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనకు మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు పరిశీలకుడి దృష్టికి తె చ్చారు. తనయుడు కార్తీక్‌కు చేవెళ్ల పార్లమెంటరీ సీటును కేటాయించాలని నివేదించారు. కొసమెరుపు.. ఆశావహులు కొందరు తమ సీటుకు సీనియర్లు ఎసరు పెట్టకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంపీ సీటు విషయానికి వచ్చే సరికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేరును సిఫార్సు చేస్తూ పరిశీలకుడికి దరఖాస్తులు సమర్పించారు. జాతీయ విపత్తు నిర్వహణ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు, పీసీసీ కార్యద ర్శి ఆదిత్య పరిశీలకుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒకరిద్దరు సీనియర్ నేతలతో హోటల్లో పరిశీలకుడిని కలుసుకున్న ఆయన.. చేవెళ్ల లోక్‌సభ సీటుకు తన ను ఖరారు చేయాలని విన్నవించారు. పరిగి అసెంబ్లీ సెగ్మెంట్‌కు టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్‌రెడ్డి అనుచరులు మాజీ మంత్రి కమతం రాంరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశీలకుడిని కలిసేందుకు డీసీసీ కార్యాలయానికి వెళ్తున్న రాంరెడ్డిని చూసిన వైరివర్గం.. కమతం డౌన్ డౌన్ అంటూ నినదించింది. ఈ నియోజకవర్గం నుంచి తమ పేర్లను పరిశీలించాలని పీసీసీ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, సీనియర్ నాయకులు కంకల్ వెంకటేశ్, మాజీ ఎంపీపీ భగవన్‌దాస్ ఏఐసీసీ వేగుకు విజ్ఞాపనలు సమర్పించారు. సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి భారీగా మద్దతుదారులతో తరలివచ్చారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి తన పేరును పరిశీలించాలని కోరారు. ఇటీవల తాను చేపట్టిన పాదయాత్ర వివరాలను పరిశీలకుడి దృష్టికి తెచ్చారు.