breaking news
Judge arrest
-
Hyderabad: రూ.10 లక్షల మోసం.. ఉప్పల్లో నకిలీ జడ్జి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో నకిలీ జడ్జిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి అవతారమెత్తి వివాదాస్పద భూములను పరిష్కరిస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను మల్కాజిగిర ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఉప్పల్ పీఎస్లో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ డిగ్రీ చదవి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి రామంతాపూర్లో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో గతంలో దొంగతనాలు, బైక్ చోరీలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చాడు. అతనిపై పోలీసులు పీడీ చట్టం కూడా ఉపయోగించారు. తరువాత హైకోర్టులో వివాదాస్పద భూముల కేసులు త్వరగా పరిష్కరిస్తామనిఫేస్బుక్లో ఓ పేజ్ రూపొందించాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గార్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి దగ్గర పదిలక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు. కేసు పరిష్కారం కాకపోవడంతో బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు.. నకిలీ జడ్జి నామాలా నరేందర్తోపాటు అతని వెంట గన్మెన్గా తిరుగుతూ నిందితుడికి సహకరిస్తున్న చిక్కం మధుసూదన రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. నిందితుల వద్ద అనుమతి లేని ఓ పిస్టల్ , అయిదు రౌండ్ల బుల్లెట్లు, ఒక కారు, ఫేక్ జడ్జి ఐడి కార్డు , రూ. 7500 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
తాగి కోర్టుకు బయలుదేరిన మహిళా జడ్జి!
రోచెస్టర్ (న్యూయార్క్): ఆమె న్యాయాన్యాయాలను విచారించి.. తీర్పు ఇవ్వాల్సిన న్యాయమూర్తి. నేరస్తులను శిక్షించే ఉన్నతమైన అధికారం ఆమెది. కానీ ఆ మహిళా జడ్జి తాగి వాహనం నడుపుతూ ఏకంగా కోర్టుకు వెళ్లింది. దారిలో ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్లో జరిగింది. మహిళా న్యాయమూర్తి అయిన లెటిషియా అస్టాషియోను శనివారం ఉదయం న్యూయార్క్ స్టేట్ ట్రూపర్స్ అరెస్టు చేశారు. 2014లో జడ్జిగా నియమితురాలైన ఆమె తాగి వాహనం నడుపుతూ కోర్టుకు బయలుదేరింది. క్రిమినల్ కోర్టులో ఆమె వాదనలు వినాల్సి ఉంది. తాగి వాహనం నడిపిన కేసులో నిందితురాలిగా ఆమె వచ్చే నెల కోర్టుకు హాజరుకానున్నారని మాన్రో కౌంటీ జిల్లా అటార్నీ అయిన సాండ్ర డూర్లే తెలిపారు. అస్టాషియో అరెస్టు కావడంతో ఆమె స్థానంలో కొత్త న్యాయమూర్తిని నియమించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై నిందితురాలైన అస్టాషియో కానీ, న్యూయార్క్ రాష్ట న్యాయస్థాన విభాగంకానీ ఇంతవరకు స్పందించలేదు.