breaking news
Joint Collector Preeti Meena
-
నిరుపేద దళిత కుటుంబాలకే భూ పంపిణీ
గోపాలపురం (నిడమనూరు) :భూమిలేని నిరుపేలైన దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రభుత్వం అందజేస్తుందని జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు ధర్మాపురం ఆవాసం గోపాలపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. భూమిలేకపోవడం వల్ల స్థిరం లేని మనుగడ సాగిస్తున్న దళితులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట, ప్రైవేటు భూముల అమ్మకంలో సహకరించాలని కోరారు. గోపాలపురంలో 25 మంది దళిత కుటుంబాలకు గాను 13మందిని మొదటి కేటగిరీలో, ఐదుగురిని రెండవ కేటగిరీలో, ఇద్దరిని మూడవ కేటగిరీలో అర్హులుగా నిర్ణయించారు. మొదటి కేటగిరీలో ఉన్న 13కుటుంబాలకు 39ఎకరాలు ఇవ్వా ల్సి ఉండగా అక్కడ ఎలాంటి ప్రభుత్వ భూమీ అందుబాటులో లేదు. దీంతో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధర్మాపురం గ్రామానికి చెందిన చింతరెడ్డి సైదిరెడ్డి వారి కుటుంబసభ్యుల 15ఎకరాల భూమిని జేసీ ప్రీతీమీనా పరిశీలించారు. గ్రామానికి దూరంగా ఉన్న భూముల వద్దకు రాళ్లబాటలో నడిచి వెళ్లారు. భూముల వద్ద విక్రయదారులతో జేసీ, ఆర్డీవో కిషన్‌రావు చర్చలు జరిపారు. వారు ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇవ్వలేమని, కొంతసమయం ఇవ్వాలని కోరారు. కాగా, రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్డీఓను జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీపీ నర్సింహ, జెడ్పీటీసీ సభ్యురాలు అంకతిరుక్మిణి, మల్లయ్య పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయం
రాంగనర్ :జిల్లాలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతానని నూతన జేసీ ప్రీతి మీనా అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా దృష్టి సారిస్తానని తెలిపారు. పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు కావాలంటే ప్రజలందరి సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దళితులకు మూడు ఎకరాలు భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాపై తనకు పూర్తి స్థాయి అవగాహన లేనప్పటికీ ప్రతి ఒక్కరి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. అదే విధంగా రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సకాలంలో నిత్యావసర సరుకులు అందేలా చూస్తానన్నారు. జేసీకి ఉద్యోగ సంఘాల నేతల అభినందనలు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రీతి మీనాకు ఏజేసీతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేత లు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. జేసీకి అభినందనలు తెలి పిన వారిలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి, తెలంగాణ వీఆర్ఓల సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న, శ్రీధర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు.