జగదూర్తి శ్రీమంతుడు
                  
	- సొంతూరులో పర్యటించిన తమిళనాడు ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ మధుసుదన్ రెడ్డి
	- ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
	-  వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
	
	డోన్ టౌన్ : జగదూర్తి గ్రామంలో పుట్టిపెరిగిన ఆ యువకుడు 2011లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు.  ప్రస్తుతం తమిళనాడు ల్యాండ్ రెవెన్యూ  కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలని భావించి శనివారం  గ్రామానికి వచ్చాడు మధుసూదన్‌రెడ్డి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందంతో అతడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మధుసూదన్‌రెడ్డి మండల అధికారులను వెంటబెట్టుకొని ఊరంతా కలియ తిరిగాడు.  గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అక్కడే అధికారులతో సమీక్ష జరిపారు.
	
	 శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యత
	భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామసమీపంలోని వంకలో రెండు పెద్ద చెక్ డ్యాంల నిర్మాణం, బలహీనంగా ఉన్న చెరువుకట్టను పటిష్ట పరిచి, అందులోని  పూడిక తొలగింపుపై దృష్టిసారించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐఏఎస్ మధుసుదన్ రెడ్డి స్థానిక అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ సూచనల మేరకే  గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై  క్షేత్రస్థాయి పర్యటన జరుపుతున్నట్లు  వెల్లడించారు. గ్రామంలో మంచినీరు, సీసీరోడ్లతో పాటు 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఊరికి  రోడ్డు వేయడం తన ముందున్న లక్ష్యమన్నారు.  ఇందుకు అధికారులు,  గ్రామస్తుల సహకారం కావాలని కోరారు.
	
	 ఆయన వెంట జిల్లా భూగర్భ జల శాఖ ఏడీ రవీంద్రరావు, తహసీల్దార్ మునికృష్ణయ్య, ఎంపీడీఓ క్యాథరిన్, ఈఓఆర్డీ మణిమంజరి, ఏపీడీ పద్మావతి, ఏపీఓ మద్దేశ్వరి, మైనర్ ఇరిగేషన్ ఏఈ నారాయణ, పీఆర్ఏఈ నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివకుమార్, గ్రామసర్పంచ్ సుంకులమ్మ , గ్రామ పెద్దలు ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, రంగారెడ్డి, మనోహర్ రెడ్డి  తదితరులు ఉన్నారు.