ఐఫోన్ యూజర్ల డేటాకు ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే, ఆపిల్ ఐఫోన్లు భద్రతాలో కాస్త మెరుగని, ఇవి త్వరగా హ్యాకింగ్ కు గురికావని, సురక్షితమైన ఫోన్లగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆపిల్ ఐఫోన్లకు కూడా ఇటీవల భద్రత కరువైంది. ఇటీవలే లక్షల కొద్దీ ఐఫోన్ల డేటా దొంగతనానికి గురై, వీటి భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఆపిల్ ఇంటర్నల్ సర్వర్ నుంచి ఐఫోన్ యూజర్ల డేటాను విక్రయిస్తున్న 22 మందిని చైనీస్ అథారిటీలు అరెస్టు చేశారు. 7.36 మిలియన్ డాలర్లకు అంటే 47కోట్లకు పైగా మొత్తంలో ఐఫోన్ యూజర్ల డేటాను వీరు విక్రయిస్తున్నట్టు మీడియా రిపోర్టులు వెల్లడించాయి. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం డేటా ట్రేడింగ్ నెట్ వర్క్ నిర్వహిస్తున్న ఆపిల్ సప్లయిర్స్, వెండర్స్ కు చెందిన 22 మంది ఉద్యోగులను జెజియాంగ్ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
అయితే దీనిలో 20 మంది సంస్థలో పనిచేసే ఆపిల్ సప్లయిర్స్ కాదని పేర్కొంది. వారు ఐఫోన్ యూజర్ల డేటాను అంటే పేర్లు, మొబైల్ నెంబర్లు, ఆపిల్ ఐడీలను, ఇతర సమాచారాన్ని దొంగతనం చేసి, 10 నుంచి 180 యువాన్ల(95 రూపాయల నుంచి 1705 రూపాయలు) మధ్యలో అమ్ముతున్నట్టు తెలిపింది. దీంతో మొత్తంగా 7.36 మిలియన్ డాలర్లను ఆర్జించినట్టు పేర్కొంది. ఆపిల్ డేటా బ్లాక్ మార్కెట్లో అమ్మకానికి వచ్చిందని తెలుసుకున్న చైనీస్ పోలీసులు జనవరిలోనే దీనిపై విచారణ ప్రారంభించారు. అనంతరం ఈ విక్రయానికి పాల్పడుతున్న వారిని మే 3న అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆపిల్ మాత్రం తమ సర్వర్లు దొంగతనానికి గురికాలేదని చెబుతోంది. వారు సంపాదించిన సమాచారం ముందస్తుదని పేర్కొంటోంది.