breaking news
International Naval Review
-
‘విశ్వ’రూప విశాఖ
కడలితీరం కదనరంగంగా మారింది.. దాన్ని అనుకొని ఉన్న బీచ్‌రోడ్డు అంతర్జాతీయ దళాల కదన కుతూహలాన్ని చాటే కవాతుకు వేదికగా.. కళాక్షేత్రంగా భాసిల్లింది. సుమారు రెండు గంటలపాటు సుమారు 2 లక్షల మందిని ప్రత్యక్షంగా.. మరికొన్ని వేలమందిని పరోక్షంగా తమ అద్భుత విన్యాసాలు, ప్రదర్శనలతో నావికాదళం కట్టిపడేసింది. సరిగ్గా సాయంత్రం 4.35 గంటలు.. అలల హోరు.. సందర్శకుల కేరింతలతో సందడిగా ఉండే సాగర తీరంలో ఒక్కసారిగా అలజడి.. ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్ల చక్కర్లు.. వాటిలోంచి సర్రున నీటిపై వాలిన పారాట్రూపర్లు.. కమెండోలు.. అంతలోనే తుపాకుల మోతలు.. బాంబుల వర్షం.. మరోపక్క ఆయిల్ రిగ్ పేల్చివేత.. ఇలా వరుస విన్యాసాలతో యుద్ధంలో కనిపించే దృశ్యాలను కళ్లుదుట ఆవిష్కరిస్తూ.. లక్షలాది ప్రజలను గగుర్పాటుకు గురి చేశారు. ఇక చీకట్లు ముసురుకుంటున్న వేళ.. సుమారు 24 దేశాల నావికాదళాల కవాతు కనువిందు చేసింది. ఒక్కో దేశానికి చెందిన దళం ముఖ్యఅతిథి ప్రధానమంత్రి సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతుంటే.. ఆ దేశానికే చెందిన కళాకారులు తమ సంప్రదాయ వేషధారణతో అనుసరించారు. వాటితోపాటు పలు ప్రభుత్వ శాఖల శకటాలుతో కూడిన కార్నివాల్ వేడుకను శోభాయమానం చేసింది. అంతకుముందు ప్రధాన వేదిక వద్ద భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయం నృత్యప్రదర్శన అదరహో అనిపించింది. తీరంలో కొలువుదీరిన యుద్ధనౌకల నుంచి ఆకాశంలోకి సంధించిన బాణసంచా వెలుగులు.. వాటికి పోటీగా లేజర్ కిరణాల జిలుగులు కార్యక్రమానికి అద్భుతమైన ముగింపునిచ్చాయి. మొత్తంగా అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో కీలకమైన సిటీ పరేడ్, విన్యాసాల ఘట్టం.. ‘విశ్వ’రూపం సంతరించుకొంది.. విశాఖ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. -విశాఖ సిటీడెస్క్ -
విశాఖకు ఖండాంతర ఖ్యాతి
ఐఎఫ్ఆర్తో అంతర్జాతీయ బ్రాండ్‌గా నగరం తూర్పు నావికాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ సోనీ విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్ఆర్)కు వేదిక అయిన తూర్పు తీరంలోని విశాఖ ఖ్యాతి అంతర్జాతీయంగా ఇనుమడిస్తుందని తూర్పు నావికాదళ చీఫ్ ైవె స్ అడ్మిరల్ సతీష్ సోనీ అభిప్రాయపడ్డారు. ఐఎఫ్ఆర్తో విశాఖ నగరం ప్రపంచ దేశాలకు పరిచయమై ఒక బ్రాండ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎఫ్ఆర్లో భాగంగా రాష్ట్రపతి నిర్వహించనున్న యుద్ధనౌకల సమీక్ష (ప్రెసిడె న్షియల్ ఫ్లీట్ రివ్యూ) రిహార్సల్స్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సుమిత్రలో సతీష్ సోనీ మీడియాతో మాట్లాడుతూ ఐఎఫ్ఆర్ విశేషాలను వివరించారు. ఐఎఫ్ఆర్లో 90 యుద్ధ నౌకలు పాల్గొంటాయని, వాటిలో 24 విదేశాలకు చెందినవని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని దేశంలో నిర్వహించడం ఇది రెండోసారి అని వివరించారు. 15 ఏళ్ల క్రితం పశ్చిమ తీరంలో నిర్వహించగా ఇప్పుడు తూర్పుతీరంలో నిర్వహిస్తున్నామన్నారు. 24 దేశాలకు చెందిన నౌకలు రివ్యూలో పాల్గొనేందుకు సిద్ధం కాగా రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో 80కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొం టారని సోనీ చెప్పారు. ఐఎఫ్ఆర్ లోగోలోనే విశాఖ పేరు చేర్చడం తో ఈ నగరం పేరు గ్లోబలైజ్ అవుతుందని, దానివల్ల టూరిజం, వ్యాపారావకాశా లు పెరుగుతాయన్నారు. విన్యాసాల్లో భాగంగా యుద్ధనౌకలు తీరానికి దగ్గరగా రావడంతో విశాఖ వాసులకు బీచ్ నుంచే వీక్షించే అవకాశం లభిస్తుందన్నారు. అలాగే ప్రజలు వీక్షించేం దుకు నగరంలోని పలు చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా ఐఎఫ్ఆర్ భారత నావికాదళ శక్తిని ప్రదర్శించే వేదిక కాదన్నారు. ఉత్కంఠ రేపిన రిహార్సల్స్.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈనెల ఆరో తేదీన రాష్ట్రపతి నిర్వహించే యుద్ధనౌకల సమీక్ష రిహార్సల్స్‌ను విశాఖలో మంగళవారం సముద్రం లోపల నిర్వహించారు. ఈ నమూనా విన్యాసాల్లో 24 విదేశీ యుద్ధ నౌకలతో పాటు భారత నావికా దళానికి చెందిన యుద్ధనౌకలు, విమానాలు పాల్గొన్నాయి. అత్యంత సమీపం నుంచి దూసుకుపోయిన హాక్ యుద్ధ విమానాల విన్యాసాలు గగుర్పాటు కలిగించాయి. ఐఎన్ఎస్ సుమిత్ర రాజసంగా ముందుకు కదులుతుండగా కుడి, ఎడమ వైపుల్లో విదేశీ, స్వదేశీ యుద్ధ నౌకలు దాన్ని అనుసరిస్తూ గౌరవవందనం సమర్పించాయి. పరేడ్ సెయిల్స్తో హెలోబాటిక్స్, మెరైన్ కమెండోలు వాటర్ స్కూటర్లపై జరిపిన దాడి సన్నివేశాలు అసక్తి కలిగించాయి. ఫ్లైపాస్ట్‌లో చేతక్, రక్షక్, సీ కింగ్, హార్పన్స్ విమానాలు, ఆధునిక హెలికాప్టర్లు ధృవ్, కమోవ్, మీడియం రేంజ్ డోర్నియర్స్, తీరరక్షక దళ ఈగల్స్, సీ డ్రాగన్స్, షార్ట్ టేకాఫ్తోనే గగనతలంలోకి దూసుకుపోగల వైట్ టైగర్స్, జెట్ ట్రైనర్స్ హాక్‌లు విన్యాసాలు ప్రదర్శించాయి. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, విరాట్లతో పాటు విక్రమాదిత్య రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి.