breaking news
International Billiards
-
బిలియర్డ్స్ రాజు మళ్లీ అతడే
భారత ‘క్యూ’స్పోర్ట్ కింగ్ పంకజ్ అద్వానీ మళ్లీ ప్రపంచ రారాజు అయ్యాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌లో ఏ ఫార్మాట్ ఎదురైనా తను మాత్రమే చాంపియన్ అని మరోసారి ఘనంగా చాటాడు. అద్భుతమైన ప్రదర్శనతో కెరీర్లో 22వ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గాడు. అతని జోరు చూస్తుంటే టైటిళ్ల రజతోత్సవం (25) జరుపుకున్నా ఆశ్చర్యం లేదు. మండాలే (మయన్మార్): క్యూ స్పోర్ట్స్‌కే వన్నె తెచ్చిన భారత చాంపియన్ ఆటగాడు పంకజ్ అద్వానీ మళ్లీ విశ్వవిజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో పంకజ్ గెలుపొందాడు. తాజాగా 150–అప్ ఫార్మాట్లో టైటిల్ సాధించాడు. అతని కెరీర్లో ఇది 22వ ఐబీఎస్ఎఫ్ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. 150–అప్ అనేది బిలియర్డ్స్‌లో పొట్టి ఫార్మాట్ కాగా... ఇందులో గత ఆరేళ్లలో పంకజ్ అద్వానీ ఐదు టైటిల్స్ సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో 6–2 ఫ్రేమ్‌లతో స్థానిక మయన్మార్ ఆటగాడు నే త్వే వూపై విజయం సాధించాడు. గతేడాది జరిగిన ఫైనల్లోనూ వీళ్లిద్దరే తలపడ్డారు. ఆదివారం గత ఫైనల్‌కు రిపీట్‌గా జరిగిన పోరులో చిత్రంగా అదే ఫ్రేమ్‌ల (6–2) తేడాతో పంకజ్ గెలుపొందడం విశేషం. మ్యాచ్ అర్ధభాగం ముగిసేసరికి 145–4, 89–66, 127–50 స్కోరుతో 3–0 ఫ్రేమ్‌లతో పంకజ్ జోరుమీదుండగా... ప్రత్యర్థి తేరుకోలేకపోయాడు. విరామానంతరం కూడా అద్వానీ 63–0, 62–50 స్కోరుతో దూసుకెళ్లడంతో నే త్వే వూ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. చివరకు 50–69, 64–105తో ప్రత్యర్థి రెండు ఫ్రేమ్‌లు గెలిచాడు. ఆఖరి ఫ్రేమ్‌ను 74–63తో గెలవడంతో పంకజ్ ప్రపంచ విజేతగా నిలిచాడు. 2003లో తొలిసారి చాంపియన్‌షిప్ అందుకున్న అద్వానీ తదనంతరం టైమ్ ఫార్మాట్లో 8 సార్లు, పాయింట్స్ ఫార్మాట్లో 6 సార్లు ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ సాధించాడు. స్నూకర్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత క్యూ స్టార్ ప్రపంచ టీమ్ బిలియర్డ్స్, టీమ్ స్నూకర్‌లో ఒక్కోసారి విజయం సాధించాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ప్రతీసారి నాకో విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ మెగా టోరీ్నలో రాణించాలనే కసి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందువల్లే ఆటలో నా దూకుడు, టైటిళ్ల ఆకలి కొనసాగుతూ ఉంది’ అని పంకజ్ అన్నాడు. -
భారత్ ‘డబుల్’ ధమాకా
- ప్రపంచ టీమ్ బిలియర్డ్స్‌లో స్వర్ణ, రజతాలు - టైటిల్స్‌లో పంకజ్ అద్వానీ రికార్డు గ్లాస్గో: అంతర్జాతీయ బిలియర్డ్స్‌లో భారత్ మరోసారి సత్తా చాటింది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, రజత పతకంతో మెరుపులు మెరిపించింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 5-4తో భారత్ ‘ఎ’ జట్టును ఓడించింది. తాజా విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్‌ను గెలవలేదు. భారత్ ‘ఎ’ తరఫున అలోక్ కుమార్, భాస్కర్, సౌరవ్ కొఠారీ, ధ్రువ్ సిత్వాలా; భారత్ ‘బి’ తరఫున పంకజ్ అద్వానీ, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్యాలు ప్రాతినిధ్యం వహించారు. గంటపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మూడు రౌండ్లలో భారత్ ‘ఎ’ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మూడు రౌండ్లలో ‘బి’ జట్టు 2-1తో నెగ్గి స్కోరును సమం చేసింది. చివరి మూడు రౌండ్లలో భారత్ ‘బి’ ఆటగాళ్లు పంకజ్ 613-116తో కొఠారీని; రూపేశ్ షా 379-90తో అలోక్‌ను ఓడించి జట్టుకు టైటిల్‌ను అందించారు. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత ప్రపంచ టీమ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య వచ్చే కామన్వెల్త్ గేమ్స్‌లో క్యూ స్పోర్ట్స్‌ను ప్రవేశపెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.