breaking news
Institutional Trading Platform
-
రియల్టీలో పెట్టుబడుల సునామీ, రూ.36,500 కోట్లకు..
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్) ఈ ఏడాది 4 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36,500 కోట్లు)గా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్ ఇండియా అంచనా వేసింది. 2020లో ఈ రంగంలో సంస్థాగత పెట్టుబడిదారులు 4.8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు 2.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2020 మొదటి ఆరు నెలల్లో వచ్చిన గణాంకాలతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు కొల్లియర్స్ ఇండియా తెలిపింది. కార్యాలయ సముదాయాలపై ఇన్వెస్ట్ చేసేందుకు సంస్థాగత పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 35 శాతం పెట్టుబడులు కార్యాలయ వసతుల ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. అలాగే, పారిశ్రామిక, గోదాముల విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 775 మిలియన్ డాలర్లు (రూ.5,657 కోట్ల)గా ఉన్నాయి’’ అని కొల్లియర్స్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకర్షణీయమైన విలువలకే ఆస్తులను సొంతం చేసుకునే ఆలోచనతో ఇన్వెస్టర్లు ఉన్నారని తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు కేవలం 4 శాతంగానే ఉన్నాయని పేర్కొంది. లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్ ల్యాబ్‌లు, డేటా కేంద్రాలకు సంబంధించి రానున్న రోజుల్లో పెట్టుబడులు ప్రోత్సాహకరంగా ఉండొచ్చని అంచనా వేసింది. చదవండి: మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి -
స్టార్టప్స్ నిధులకు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫాం
ముంబై: స్టార్టప్ సంస్థలు, ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు తమ వెంచర్ల కోసం నిధులు సమీకరించుకునేందుకు వీలుగా ‘ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం’ను (ఐటీపీ) ప్రవేశపెట్టాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. దీని ద్వారా ఇతర సంస్థలు, సంపన్న ఇన్వెస్టర్లు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ స్టార్టప్స్ నిధులు సమీకరించుకోవచ్చు. అయితే అధిక రిస్కుల దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు ఉండవు. ఇందుకు సంబంధించి ‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల సమీకరణ ప్లాట్‌ఫాం’పై సోమవారం విడుదల చేసిన చర్చాపత్రంలో సెబీ ఈ విషయాలు పేర్కొంది. స్టార్టప్ సంస్థలు విదేశీ మార్కెట్లకు వెళ్లకుండా దేశీయంగానే నిధులు సమీకరించుకునేందుకు తోడ్పాటు అందించడమే ఈ ప్రతిపాదన ప్రధానోద్దేశం. దీనిపై ఏప్రిల్ 20లోగా సంబంధిత వర్గాల అభిప్రాయాలు సెబీకి తెలియజేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఈ-కామర్స్, కొత్త తరం కంపెనీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఐటీపీలో లిస్టింగ్ వ్యవధి ఏడాది పాటు వర్తిస్తుంది. ఆ తర్వాత స్టాక్ ఎక్స్చేంజీలకు మారొచ్చు. స్టార్టప్స్ దేశీయంగానే లిస్టయ్యేలా ప్రోత్సహించే దిశగా నిబంధనలను జూన్‌కల్లా ఖరారు చేయగలమని సెబీ చైర్మన్ యూకే సిన్హా తెలిపారు.