breaking news
Infosys foundation Chairperson
-
వ్యాక్సిన్ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం
రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్‌గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.ఏమిటీ సర్వైకల్ క్యాన్సర్? మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్)కూ మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్‌ను ‘సర్వైకల్ క్యాన్సర్’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.ప్రధాన రకాలు... సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. రిస్క్ ఫాక్టర్లు...హెచ్‌పీవీ వైరస్ సోకడం అనేది సర్వైకల్ క్యాన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. చాలామందిలో ఈ హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.చికిత్స ప్రక్రియలు... ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు. సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు. హెచ్‌పీవీతో సమర్థమైన నివారణమామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్‌ను తెచ్చిపెట్టే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్‌పీవీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అదే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్‌ను తయారుచేసి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. కారణాలుసర్విక్స్ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానం. ఈ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ... సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్ దశ’ దీనికి ఉంది డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ – రిస్క్ ఆబ్స్టెట్రీషియన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్‌కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైమ్‌లో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. – సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవిక -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్‌లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్‌కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్‌లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
21 ఏళ్ల నుంచి చీర కొనలేదు
సుధామూర్తి న్యూఢిల్లీ: పెద్ద పేరు, కోట్ల ఆస్తి, అంతకుమించిన హోదా. అలాంటి మహిళ 21 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదంటే నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. అలాంటి వ్యక్తే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య). ఈమె తన ఆహార్యంలో, మాటతీరులో ఆర్భాటం చూపించరు. అలాంటి సుధామూర్తి 21 ఏళ్ల క్రితం చివరి సారిగా చీర కొనుక్కున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాశీ యాత్రలో తమకు ఇష్టమైనదాన్ని విశ్వేశ్వరుడికి అర్పించాలనేది భక్తుల నమ్మకం. దీంతో తనకు ఇష్టమైన చీరల షాపింగ్‌ను వదిలేసినట్లు సుధామూర్తి తెలిపారు. ‘కాశీలో పవిత్ర స్నానానికి వెళ్లాం. అక్కడ మనకు నచ్చినదాన్ని త్యజించాలి. అందుకే నాకిష్టమైన చీరల షాపింగ్‌ను వదిలిపెట్టాను. ఇప్పుడు కేవలం అత్యవసరమైన వస్తువులను మాత్రమే కొంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పారు. -
టీటీడీ సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తమిళనాడులో ఏసీబీ దాడుల్లో పదవి కోల్పోయిన శేఖర్ రెడ్డి స్థానంలో సుధా నారాయణమూర్తిని నియమించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని టెల్కోలో డెవలప్మెంట్ ఇంజనీరింగ్‌గా తన కెరీర్ ప్రారంభించారు. బెంగళూరు యూనివర్సిటీలో కూడా ఆమె కంప్యూటర్ సైన్సును బోధిస్తున్నారు. అంతేకాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్ పర్సన్‌గా ఆమె సేవలందిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్యాల కార్యక్రమాలకు ఆమె ఓ సభ్యురాలుగా ఉన్నారు. కన్నడ, ఇంగ్లీష్‌లో ఆమె పలు రచనలు చేశారు. లోకోపకారిగా సుధా నారాయణమూర్తికి ఎంతో పేరొంది.