బీమాతో మహిళలకు ధీమా
చింతలపూడి : రాష్ట్రంలో పలు బీమా పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐకేపీ (ఇందిరా క్రాంతిపథం) ద్వారా అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన వంటి పథకాలను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. ఈ పథకాల్లో చేరడానికి అర్హులు ఎవరంటే..
ఆమ్ ఆద్మీ బీమా యోజన
ఈ పథకం పూర్తిగా ఎల్ఐసీ ద్వారా అమలు చేయబడుతోంది. ఐకేపీ ద్వారా రూ.15 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. బీమా చేయించుకునే మహిళ వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. భూమిలేని గ్రామీణ కుటుంబంలో పెద్ద లేదా సంపాదించే వ్యక్తి అయి ఉండాలి. బీమా చేయించుకున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే బీమా చేయబడిన మొత్తం రూ.30 వేలు నామినీకి ఇవ్వబడుతుంది. ఒకవేళ బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదం కారణంగా మరణించినా లేదా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.75 వేలు, పాక్షికంగా వైకల్యం సంభవిస్తే రూ.37,500 పరిహారం చెల్లిస్తారు. ఈ పథకంలో సభ్యుల పిల్లలకు ఉపకార వేతనం రూపంలో అదనపు ప్రయోజనం కల్పించారు. ఇద్దరికి మించకుండా 9 నుండి 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. ఈ మొత్తాన్ని 6 నెలలకు ఒకసారి జనవరి 1న , తిరిగి జూలై 1న చెల్లిస్తారు.
అభయ హస్తం
స్వయం శక్తి సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు అర్హులు. ఒక్కో సభ్యురాలు ఏడాదికి రూ.385 చెల్లించాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరో రూ.385 జమ చేస్తాయి. సభ్యులు 60 ఏళ్లు పూర్తయ్యాక పింఛన్ తీసుకోవడానికి అర్హులవుతారు. సభ్యులు 60 ఏళ్లలోపు మరణిస్తే రూ.30 వేలు, సభ్యురాలు జమ చేసిన సొమ్ము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసిన సొమ్మును కుటంబ సభ్యులకు అందచేస్తారు. ప్రమాదవశాత్తూ మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ.75 వేలు, అంగవైకల్యం ఏర్పడి మంచానికి పరిమితమైతే రూ.35 వేలు అందజేస్తారు. పథకంలో చేరిన వారి పిల్లలకు 9 వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.1,200 ఉపకార వేతనంగా అందజేస్తారు.
జనశ్రీ బీమా యోజన
ఆమ్ ఆద్మీ, అభయహస్తంలో చేరని వారికి ఈ పథకం వర్తిస్తుంది. సంవత్సరానికి రూ.165 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో పింఛన్ సౌకర్యం ఉండదు. సహజ మరణం సంభవిస్తే కుటుంబ సభ్యులకు రూ.30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం ఏర్పడితే రూ.35 వేలు అందిస్తారు. ఈ పథకంలో కూడా ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి రూ.1,200 ఉపకార వేతనం అందిస్తారు.