Indian Direct Selling Association
-
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
న్యూఢిల్లీ: డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ స్థిరమైన వృద్ధిని చూస్తోంది. పరిశ్రమ విలువ 2024 మార్చి నాటికి రూ.22,150 కోట్లకు చేరుకున్నట్టు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) ప్రకటించింది. ఈ రంగంలో 470 వరకు చిన్న, పెద్ద సంస్థలు దేశంలో సేవలు అందిస్తుండగా, వీటి పరిధిలో కొత్తగా 1.86 లక్షల మంది ప్రత్యక్ష విక్రేతలు (డైరెక్ట్ సెల్లర్స్) 2023–24లో నమోదైనట్టు తెలిపింది. గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24) డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ఏటా 7.15 శాతం చొప్పున వృద్ధి చెందుతూ.. రూ.16,800 కోట్ల నుంచి రూ.22,142 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ఈ రంగంలో ఆరోగ్య సంరక్షణ, పోషకాహార ఉత్పత్తులు అధిక అమ్మకాలతో 64.15 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐడీఎస్ఏ వార్షిక నివేదిక తెలిపింది. కాస్మెటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాల వాటా 23.75 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ రెండు విభాగాల వాటా 2023–24 మొత్తం అమ్మకాల్లో 87.9 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో ఉత్తరాది 29.8 శాతం వాటాతో ముఖ్య పాత్ర పోషిస్తోంది. తూర్పు భారత్ నుంచి 24.2 శాతం అమ్మకాలు కొనసాగగా, ఇందులో పశ్చిమబెంగాల్ నుంచే 11.3 శాతం సమకూరింది. పశ్చిమ భారత్‌లో అమ్మకాలు 22.4 శాతంగా ఉంటే, దక్షిణాదిన 15.3 శాతం అమ్మకాలు కొనసాగాయి. ఎనిమిది రాష్ట్రాలతో కూడిన ఈశాన్య భారత్‌లో అమ్మకాలు 8.3 శాతంగా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రధాన మార్కెట్.. 13 శాతం వాటాతో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో (2023–24) మహారాష్ట్ర అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, యూపీ, బీహార్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, ఢిల్లీ, అసోం, గుజరాత్ టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70 శాతం ఈ రాష్ట్రాల నుంచే వచి్చంది. 2023 మార్చి నాటికి మొత్తం డైరెక్ట్ సెల్లర్స్ 88.06 లక్షలుగా ఉంటే, 2024 మార్చి నాటికి 86.2 లక్షలకు పెరిగారు. చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే ప్రత్యక్ష విక్రేతల్లో 56 శాతం మంది పురుషులు కాగా, 44 శాతం మహిళలు ఉన్నారు. మొత్తం విక్రేతల్లో 73.2 శాతం 25–54 ఏళ్ల వయసులోని వారు కావడం గమనార్హం. అంతేకాదు విక్రేతల్లో అత్యధికులకు ఉన్నత విద్యార్హతలున్నాయి. 52 శాతం మంది గ్రాడ్యుయేషన్, 26 శాతం మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారే. ప్రత్యక్ష విక్రయాల్లో ఇళ్ల నుంచి చేసేవి అధికంగా ఉన్నాయి. డిజిటల్ ఛానళ్ల ద్వారా అమ్మకాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. 17 శాతం విక్రేతలు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర వాటి సాయంతో అమ్మకాలు పెంచుకుంటుంటే, 15 శాతం మంది వాట్సాప్, మెస్సేజింగ్ యాప్స్ సాయం తీసుకుంటున్నారు. -
మహిళలే మహారాణులు,డెరెక్ట్ సెల్లింగ్లోకి 53 లక్షల మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 మహమ్మారితో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో కొత్త అవకాశాలను వెతుక్కున్నారు. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ రంగం ఒకటి. 2020 ఏప్రిల్–సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలోకి ఏకంగా 53.18 లక్షల మంది ప్రవేశించారని ఐడీఎస్ఏ చెబుతోంది. డైరెక్ట్ సెల్లింగ్ విపణిలో 2019–20లో దేశవ్యాప్తంగా 74 లక్షల మంది చురుకైన విక్రేతలు ఉన్నారు. ఇది వార్షికంగా 30% పెరుగుదల. 2019–20 గణాంకాల ప్రకారం అమ్మకందార్లలో సగం మంది మహిళలు ఉండడం గమనార్హం. -
ఇదీ ఆమ్వే కథ
* అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్యకలాపాలు * 1994లో భారత్‌లో అడుగు.. * దేశవ్యాప్తంగా వ్యాపారం విస్తరణ సాక్షి, హైదరాబాద్: అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్య కలాపాలు సాగిస్తున్న ఆమ్వే సంస్థ 1994లో భారత్‌లో అడుగుపెట్టింది. 1995లో ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసో సియేషన్ (ఐడీఎస్ఏ) అనే వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాతి ఏడాది అమ్వే ఆపర్చునిటీ ఫెడరేషన్ (ఏఓఎఫ్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించింది. 1998 నుంచి గొలుసుకట్టు వ్యవహారంగా పిలిచే మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లకు తెరలేపింది. సంస్థలో సభ్యుడిగా చేరి ఉత్పత్తులు కొనుగోలు చేసిన వ్యక్తి మరొకరిని రూ.4500 చెల్లించడం ద్వారా సభ్యుడిగా చేర్పించాలి. ఈ రకంగా మూడు రకాలైన స్కీముల్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. ఆర్బీఐ ఫిర్యాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో ఆమ్వేపై 2002లో చండీగఢ్ పోలీసులు తొలికేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం-1978 ప్రకారం ఆమ్వే ప్రజల్ని మోసం చేస్తున్నట్లే అని అప్పటి ఆర్థిక మంత్రి సైతం లోక్‌సభలో ప్రకటిం చారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పోలీసులకు ఫిర్యాదు అందడంతో 2006లో కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని ఆమ్వే కార్యాలయాలపై దాడులు చేసి డాక్యుమెంట్లను, వస్తువులను సీజ్ చేశారు. దీనిపై ఆమ్వే హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సైతం కేసు నమోదును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2007లో ఆమ్వే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో సీఐడీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి 2008లో నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటిదాకా సీఐడీతో పాటు గుంటూరు, కృష్ణ, ప్రకాశం, మెదక్, హైదరాబాద్, సైబరాబాద్, కర్నూలు పోలీసులూ ఆమ్వేపై కేసులు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ కూడా ఆమ్వేపై ఫెమా ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కేరళలో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు సంస్థ సీఈఓ విలియం స్కాట్‌ను గతంలో ఒకసారి అరెస్టు చేసి విడిచిపెట్టారు. తాజాగా కర్నూలు పోలీసులు అరెస్టు చేయడంతో ఈ అమెరికా జాతీయుడు రెండోసారి కటకటాల్లో చేరినట్లైంది. సమాచారం లేకుండా అరెస్టు చేశారు: ఆమ్వే కర్నూలు పోలీసులు తమ సంస్థపై గత ఏడాది డిసెంబర్ లోనే కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆమ్వే పీఆర్వో సుశాంత్ సుబుధి అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆరోపించిన అంశాలు వాస్తవదూరమని పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసుల దర్యాప్తునకు ఆమ్వే సంస్థ పూర్తి సహకారం అందిస్తోందని, పోలీసులు కోరిన సమాచారంతో పాటు పత్రాలు అందించిందని సుశాంత్ తెలిపారు.