breaking news
India Gadget Expo -2015
-
లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకుందాం..రా!
హైటెక్స్‌లో గాడ్జెట్ ఎక్స్పో ప్రారంభం 21వరకు ప్రదర్శన మాదాపూర్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గాడ్జెట్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ‘ఇండియా గాడ్జెట్ ఎక్స్పో -2015’ ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో వివిధ రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ప్రదర్శనలో 100 స్టాల్స్‌లో కెనాన్, మైక్రోమాక్స్, జియోని, పానసోనిక్, డబ్ల్యూడీసీ, మోటోరోల, వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈనెల 21వరకు ప్రదర్శన కొనసాగుతుంది. సెక్యూరిటీ బ్యాగ్ మహిళలకు రక్షణ కలిగించే విధంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన బ్యాగ్ ప్రదర్శనలో ఆకట్టుకుంటోంది. బ్యాగ్‌కు రెండు బటన్లు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే వాటిని ప్రెస్ చేయాలి. జీపీఎస్ సిస్టమ్ ద్వారా పోలీసులకు, ఆసుపత్రులకు, మహిళలకు రక్షణ కల్పించే కార్యాలయాలకు సమాచారం వెళ్ళిపోతుంది. బ్యాగ్‌లోనే వివిధ రకాల స్ప్రేలు కూడా ఉంటాయి. ధర రూ. 1500 ఆకట్టుకుంటున్న త్రీడీ ప్రింటర్ మదిలోని ఆలోచనలను పేపర్ పై రాయడం పాత పద్ధతి.. ఇప్పుడు ఏకంగా త్రీడీలో ప్రింటింగ్ వేసుకోవడానికి ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి. త్రీడీ ప్రింట్‌ను భవన నిర్మాణ రంగంలో డిజైన్లను వేయడానికి, విద్యార్థులకు వివిధ రకాల బొమ్మలు చూపించడానికి ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్, రబ్బర్, ప్రత్యేకమైన మెటల్స్ను వాడుకోవచ్చు. ధర రూ. 45 లక్షల నుండి ప్రారంభం. ఎయిర్ ఫ్యూరిఫయర్ నగరంలో గాలి కాలుష్యం అధికం.. దీంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు ఎయిర్ ప్యూరిఫయర్ ఉపయోగపడుతుంది. దీనిని గృహాలలో, పరిశ్రమలలో, పాఠశాలలలో, ఆఫీసులలో, ఆసుపత్రులలో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ధర రూ. 25వేల నుండి ప్రారంభం. ఆకట్టుకుంటున్న ఎయిరోఫిక్స్ ప్రస్తుతం వివాహాది శుభకార్యాలకు ఎయిరో ఫిక్స్ ను వాడుతున్నారు. హెలికాప్టర్ ఆకారంలో ఉండి దానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను అమర్చి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. వీటిని ముఖ్యంగా పబ్లిక్ ప్రాంతాలలో, సినిమాలు తీసేం దుకు, డాక్యుమెంటరీల కోసం, ఫొటోగ్రఫీ కోసం, వివాహాలు, రక్షణ కొరకు వీడియోలను, ఫోటోలను తీసేందుకు ఉపయోగిస్తున్నారు. జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మొబైల్ రిమోర్ట్ ద్వారా ఆపరేటింగ్ చేయవచ్చు. ధర రూ. 1.25 లక్షల నుండి ప్రారంభం. ముచ్చటగొలిపే బ్లూటూత్ ప్రింటర్స్ స్పాట్ బిల్లింగ్ మిషన్స్, బ్లూటూత్ ప్రింటర్స్, టైం, అటెండెన్స్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈ టికెటింగ్, రిటైల్ బిల్లింగ్, పార్కింగ్ మేనేజ్మెంట్, టాక్స్ కలెక్షన్, కేబుల్ టీవీ బిల్లింగ్ లాంటి వాటికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి జీఎస్ఎం, జీపీఆర్ఎస్, సీడిఎంఎ మోడ్స్‌ను సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, కామన్ మీటర్ రీడర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 10 వేల నుండి ప్రారంభం. -
హైదరాబాద్‌లో గాడ్జెట్ ఎక్స్పో
కొలువుదీరనున్న 300 బ్రాండ్లు ♦ 1,000కిపైగా ఉపకరణాల ప్రదర్శన ♦ సెప్టెంబర్ 18 నుంచి 21 వరకూ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మరో ప్రసిద్ధ కార్యక్రమానికి హైదరాబాద్ రెడీ అవుతోంది. హైటెక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు ఇండియా గాడ్జెట్ ఎక్స్పో-2015 జరుగనుంది. 1,000కిపైగా ఉపకరణాలు ఎక్స్‌పోలో కొలువుదీరనున్నాయి. కొన్ని ఉపకరణాలను భారత్‌లో తొలిసారిగా ప్రదర్శించేందుకు కంపెనీలు సిద్ధం అయ్యాయి. కార్యక్రమం జరిగే నాలుగు రోజులపాటు సాయంత్రం 5 గంటలకు 5 ఉత్పత్తులను ఆవిష్కరించనున్నారు. చైనా, కొరియా, తైవాన్, జపాన్తోసహా 12 దేశాలకు చెందిన 300లకుపైగా బ్రాండ్లు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. లక్షకుపైగా సందర్శకులు వస్తారని అంచనా. ఎన్డీటీవీ గాడ్జెట్ గురూ అవార్డుల కార్యక్రమం కూడా ఇదే సందర్భంగా జరుగనుంది. 2014లో గాడ్జెట్ ఎక్స్పో హైటెక్స్‌లో జరిగింది. ఎక్స్పో వేదికగా..: గాడ్జెట్ ఎక్స్‌పోకు ఏటా హైదరాబాద్ వేదిక కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమ వివరాలను వెల్లడించేందుకు గురువారం ఏర్పాటైన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘లాస్ వెగాస్‌లో జరిగే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో స్థాయికి రానున్న రోజుల్లో గాడ్జెట్ ఎక్స్పోను తీసుకెళ్తాం. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఎక్స్‌పోలో పాల్గొన్న కంపెనీలకు తెలియజేస్తాం. ఇక్కడ ప్లాంట్లు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఇప్పటికే సెల్కాన్ ప్లాంటు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వంతో జూలై 6న మైక్రోమ్యాక్స్ ఒప్పందం చేసుకుంటోంది. తైవాన్ కంపెనీ ఒకటి వస్తోంది’ అని మంత్రి వెల్లడించారు. రైతులకు ఫ్యాబ్లెట్స్.. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాగు తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా రైతులకు ఫ్యాబ్లెట్స్ (స్మార్ట్‌ఫోన్) ఇవ్వనున్నామని తారక రామారావు తెలిపారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కంటెంట్‌ను సమకూర్చారని వివరించారు. సహకార సంఘాల ద్వారా వీటిని రైతులకు చేరుస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చైనాలో 10 లక్షల మంది ఉంటే భారత్‌లో కేవలం ఒక లక్ష మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. నేటి నుంచి ప్రారంభమవుతున్న డిజిటల్ తెలంగాణ వారోత్సవాలో భాగంగా జూలై 6న పలు కంపెనీలతో అయిదు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. మీసేవను విస్తృతం చేస్తున్నామని, రానున్న రోజుల్లో విద్యార్థులు ఆన్లైన్లో బస్ పాస్‌లు పొందుతారని అన్నారు.