రేప్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్
ముంబై: సినీ అవకాశాలు ఇప్పిస్తాన ని నమ్మించి బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ సరఫ్ తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మోడల్ (23) చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్టు చేశారు. శనివారం కోర్టుకు హాజరుపరుస్తామని చెప్పారు. కుమార్ అంధేరీలోని అతని ఇంట్లో తనపై బుధ, గురువారాల్లో రెండుసార్లు అత్యాచారం చేశాడని, అతని బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నానని బాధితురాలు చెప్పింది. ఆమె శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయని, కుమార్ సిగరెట్లతో కాల్చి ఉండొచ్చని పోలీసులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. విడివిడిగా జీవిస్తున్న కుమార్, ఆయన భార్య పల్లవి గొడవ పడ్డారు.
భర్తకు వివాహేతర సంబంధముందని పల్లవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమార్ కూడా అక్కడికెళ్లి సమస్యను పరిష్కరించుకున్నాడు. తర్వాత కుమార్ వివరణ ఇచ్చేందుకు మోడల్‌ను ఇంటికి పిలిపించుకున్నాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆమెపై బీరు సీసాతో కొట్టాడు. కాగా, ఆమె అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నానని కుమార్ విచారణలో చెప్పాడు. కుమార్ ‘వంతే’, ‘మా తుఝే సలామ్’, ‘బాఘీ’, ‘ఖిలాడియోం కా ఖిలాడీ’ తదితర చిత్రాల్లో నటించాడు.