17న విరాట్ విశ్వకర్మ జయంత్యుత్సవాలు
విజయవాడ (గాంధీనగర్) : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ నెల 17న విరాట్ విశ్వకర్మ జయంత్యుత్సవాలను స్థానిక జింఖానా మైదానంలో నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ జె. కూర్మాచారి తెలిపారు. గవర్నర్‌పేటలోని బెజవాడ జ్యూయలరీ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా 108 దంపతులచే విశ్వకర్మ యజ్ఞం నిర్వహిస్తామని తెలిపారు. విశ్వకర్మ సేవా పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. ఉత్సవ కమిటీ వ్యవస్థాపకుడు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో 13జిల్లాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం విశ్వకర్మ జయంత్యుత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు అండలూరి ఏకాంబరరావు, పొన్నాడ ఈశ్వరాచారి, పాండురంగాచారి, రావుట్ల వెంకటచారి, చిప్పాడ చందు, చిలుగోటి అంజిబాబు పాల్గొన్నారు.