breaking news
IMFL
-
కిక్కిచ్చే విదేశీ మద్యంలో పిచ్చెక్కించే నిజాలు?
► విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్ను.. పేరేదైనా అంతా నాటు సారానే! ► విదేశాల్లో తృణధాన్యాలతో మద్యం తయారీ.. చెక్క పీపాల్లో నిల్వ ప్రధానం ► భారతదేశంలో 90 శాతం ఐఎంఎఫ్ఎల్ మద్యం మొలాసిస్ నుంచే తయారీ ► విస్కీ, బ్రాందీ తదితర రుచులు, వాసనల కోసం కృత్రిమ ఫ్లేవర్ల వినియోగం ► చెక్క పీపాల్లో నిల్వ ఊసే అరుదు.. డిస్టిలరీల నుంచి నేరుగా సీసాల్లో సరఫరా విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను, ఓడ్కా.. మందు ఏదైనా అంతా నాటు సారానే! భారత్‌లో తయారు చేసే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) పేరుతో మన దేశంలో తయారు చేసి తళతళలాడే కొత్త సీసాల్లో విక్రయిస్తున్న ఈ మద్యానికి.. మన ఊళ్లల్లో శివార్లల్లో చిట్టడవుల్లో అక్రమంగా కాచి పాత సీసాల్లో చౌకగా విక్రయించే నాటు సారాకు.. పెద్ద తేడా లేదు!! నాటు సారాలో రంగు కలపరు.. వేర్వేరు రుచులూ ఉండవు. ‘బ్రాండెడ్’ లిక్కర్లో కొన్ని రంగులు, కొన్ని కృత్రిమ రుచులు కలుపుతారు అంతే తేడా!!! ఇతర దేశాల్లో విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్ను వంటి మద్యపానీయాల తయారీకి.. మన దేశంలో అవే పేర్లతో విక్రయించే మద్యపానీయాల తయారీకి చాలా తేడా ఉంది. అక్కడ ఒక్కో రకం మద్యం తయారీకి నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. అందులో ఉపయోగించే పదార్థాలు వేర్వేరుగా ఉంటాయి. తయారు చేసిన మద్యాన్ని ఓక్ చెక్క పీపాల్లో కొన్నేళ్ల పాటు నిల్వ ఉంచిన తర్వాత సీసాలకు నింపి మార్కెట్‌కు పంపిస్తారు. కానీ.. మన దేశంలో అన్ని రకాల మద్యాలనూ ఒకే పద్ధతిలో తయారు చేస్తారు. అన్నిట్లోనూ ఒకటే పదార్థం ఉపయోగిస్తారు. విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్నుల పేర్ల ప్రకారం ఆయా రుచులు, రంగులు వచ్చేట్లు కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. తయారైన వెంటనే సీసాల్లో నింపి మార్కెట్‌కు తరలిస్తారు. నిజానికి మన దేశంలో చేసినట్లు విదేశాల్లో మద్యం తయారు చేసి విక్రయిస్తే.. అది పెద్ద స్కామ్ అవుతుంది. కానీ మన దేశంలో ఈ తయారీ విధానాలకు బ్యూరో ఆఫ్ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) చట్టబద్ధత కల్పిస్తోంది. ఐఎంఎఫ్ఎల్ పేరుతో అమ్ముడవుతున్న ఈ మద్యం మార్కెట్ విలువ ఇంటర్నేషనల్ వైన్ అండ్ రీసెర్చ్ సంస్థ ప్రకారం 2014లో రూ. 41,000 కోట్లు. అక్కడ తృణధాన్యాలు.. ఓక్ చెక్క పీపాలు: విస్కీ అంటే.. ఏదో ఒక రకమైన తృణధాన్యాలను ఇతర తృణధాన్యాలతో కలిపి లేదా కలపకుండా నానబెట్టి, పులియబెట్టి వాటి నుంచి తయారు చేసే మద్యపానీయం’ అనేది యూరప్2008లో ఇచ్చిన నిర్వచనం. అమెరికాలో, మెక్సికోలో కూడా వారి వారి సొంత నిర్వచనాలు ఉన్నాయి. కానీ.. విస్కీని తృణధాన్యాల నుంచి తయారు చేయాలని, తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో నిర్దష్ట కాలం నిల్వ చేయాలనే కొన్ని పద్ధతులు వారందరికీ ప్రాధమిక సూత్రాలు. విస్కీ రంగు, రుచి, వాసన వంటి ప్రధాన లక్షణాలను అదనంగా వేరే పదార్థాలను కలపడం ద్వారా తీసుకురాకూడదు అనేది ఇంకా ముఖ్యమైన నియమం. బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమల్లో ఏదో ఒక ధాన్యం పిండిని పులియబెట్టి ఈ మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని కనీసం మూడు సంవత్సరాల పాటు ఓక్చెక్క పీపాల్లో నిల్వ ఉంచాలి. విభిన్న రంగులు, రుచుల కోసం ఈ ఓక్చెక్క పీపాల రకాలను మార్చడం, నిల్వ కాలాన్ని పెంచడం వంటి చర్యలు చేపడతారు. మొత్తం మీద తృణధాన్యాలతో తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో కొన్నేళ్లు నిల్వ ఉంచితేనే అది నిజమైన విస్కీ అవుతుందనేది ప్రపంచ దేశాల్లో పాటించే పద్ధతి. నిర్దిష్ట కాలం నిల్వ ఉంచిన తర్వాత ఆ మద్యం తగిన ‘వయసు’కు వస్తుంది. అనంతరం దాన్ని సీసాల్లో నింపి మార్కెట్లోకి పంపుతారు. ఇక్కడ మొలాసిస్.. కృత్రిమ ఫ్లేవర్లు..: ప్రపంచంలో అత్యధిక శాతం విస్కీని వినియేగించే దేశం భారతదేశమే. కానీ.. మన విస్కీలో 90 శాతం పైగా అసలు విస్కీ కాదు. అది మొలాసిస్తో చేసిన సారాయి. మన దేశంలో తయారు చేసే మూడు రకాల విస్కీల్లో.. మాల్ట్ విస్కీ, గ్రెయిన్ విస్కీలు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉంటాయి. సాధారణ విస్కీ మాత్రం.. మొలాసిస్నుంచి తయారు చేస్తారు. ఇదే దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాన్య మద్యప్రియులు సేవించే విస్కీ. చెరకు గడల నుంచి పంచదారను తయారు చేసేటపుడు ఉప ఉత్పత్తిగా వచ్చే ఒక ద్రవపదార్థం మొలాసిస్. దీనిని డిస్టిల్ చేసి విస్కీని తయారు చేస్తారు. కాకపోతే విస్కీ రంగూ, రుచీ, వాసన కోసం కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. బ్రాందీ, రమ్ము, ఓడ్కా అన్నీ కూడా ఇలా మొలాసిస్తో చేసేవే. ఇది 19వ శతాబ్దంలో బ్రిటిష్పాలనలోనే ఆరంభమైంది. కారణం.. ఆ కాలంలో కరవు కాటకాలతో ఆహార ధాన్యాలకు ఎల్లప్పుడూ కొరత ఉండటం. ఫలితంగా మద్యం తయారీకి మొలాసిస్నే ప్రధాన ఆధారంగా ఎంచుకున్నారు. దేశీయంగా అభివృద్ది చెందిన ఈ షార్ట్ కట్ పద్ధతులనే అధికారిక మద్యం తయారీ విధానంగా మార్చేశారు. అందుకే.. 1500కు పైగా గల భారతీయ మద్యం బ్రాండ్లలో చాలా వాటిని యూరోపియన్ మార్కెట్లలోకి అనుమతించలేదు. మన ‘విదేశీ మద్యం’ తయారీ ఇలా..! మన దేశంలో మొలాసిస్ ను పులియబెట్టడం ద్వారా నాటు సారా తయారు చేస్తారు. ఇక వివిధ రకాల విదేశీ మద్యం ఎలా తయారు చేస్తున్నారో, అవే మద్యాలను విదేశాల్లో ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా చూస్తే... విస్కీ: అంతర్జాతీయంగా: పూర్తిగా తృణధాన్యాలు లేదా మాల్టెడ్తృణధాన్యాలు లేదా రెండిటినీ కలిపిన వాటి నుంచి తయారు చేస్తారు. కనీసం మూడు సంవత్సరాల పాటు ఓక్ చెక్క పీపాల్లో నిల్వ చేస్తారు. భారతదేశంలో: మొలాసిస్‌ను డిస్టిల్ చేసి విస్కీ తయారు చేస్తారు. కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. అత్యధికభాగం నిల్వ ఉంచరు. ‘ఏజ్డ్’ అని లేబుళ్లపై పేర్కొనే రకాలను మాత్రం కనీసం ఒక ఏడాది నిల్వ ఉంచుతారు. రమ్ము: అంతర్జాతీయంగా: మొలాసిస్తో తయారు చేస్తారు. కనీసం రెండేళ్లు ఓక్ చెక్క పీపాల్లో నిల్వ ఉంచుతారు. తద్వారా రంగు, రుచి సహజంగా వస్తాయి. భారతదేశంలో: మొలాసిస్ లేదా కార్బొహైడ్రేడ్ల నుంచి చేసి, కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు కలుపుతారు. నిల్వ చేయరు. బ్రాందీ: అంతర్జాతీయంగా: వైన్లేదా, పులియబెట్టిన ద్రాక్షపళ్ల నుండి తయారు చేస్తారు. ‘బ్లెండెడ్’ రకం బ్రాందీ కోసం మరొక పండును కూడా దీనికి కలపవచ్చు. కనీసం రెండేళ్ల పాటు నిల్వ చేస్తారు. భారతదేశంలో: కేవలం మొలాసిస్తో చేసి కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు కలుపుతారు. నిల్వ ఉంచరు. దీనికి రెండు శాతం ద్రాక్ష బ్రాందీ కలిపితే దానిని బ్లెండెడ్బ్రాందీ అంటున్నారు. జిన్ను: అంతర్జాతీయంగా: తృణధాన్యం నుంచి తయారు చేసిన మద్యానికి జునిపర్మొక్క ఫ్లేవర్‌ను కలిపితే జిన్ను అవుతుంది. భారతదేశంలో: మన దేశంలో మొలాసిస్నుంచి తయారు చేసిన మద్యానికి కృత్రిమ జునిపర్ఫ్లేవర్కలుపుతారు. ఓడ్కా: అంతర్జాతీయంగా: బంగాళదుంపలు, ఏవైనా కూరగాయలు, చెరకులతో ఓడ్కాను చేస్తారు. వీటిలో కొన్నిటిని కలిపి కూడా చేస్తారు. భారతదేశంలో: మొలాసిస్లేదా పులియబెట్టిన తృణధాన్యం లేదా ఇతర కార్బొహైడ్రేడ్ల నుంచి తయారు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2010 లెక్కల ప్రకారం మద్యం మార్కెట్విక్రయాలు ఇలా... విస్కీ 75% రమ్ము 15% ఓడ్కా, జిన్ను 5% బ్రాందీ 5% (ఔట్లుక్మేగజీన్సౌజన్యంతో) -
పెళ్లికి ముందురోజు..
పాట్నా: తెల్లవారితే పెళ్లి ఉందనగా చిన్ననాటి స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకుందామనుకున్న వరుడిని బీహార్ పోలీసులు జైలుకు పంపించారు. పంజాబ్‌లోని అమృత్ సర్‌కు చెందిన మన్దీప్(26) అతని చిన్ననాటి స్నేహితుడు బచితర్ సింగ్(28)తో కలిసి తన వివాహానికి పంజాబ్ మెయిల్లో థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్కు బయలుదేరాడు. బీహార్‌లో గత మంగళవారం నుంచి అమల్లో ఉన్న సంపూర్ణ మద్యపాన నిషేదం గురించి తెలియక పార్టీ చేసుకోవడంలో బీజీ అయిన వీరిద్దరిని ప్రయాణికుల ఫిర్యాదుతో దనాపూర్ వద్ద రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.23 లక్షల నగదు, ఒక ఐఎమ్ఎఫ్ఎల్ ఓపెన్ బాటిల్, మొబైల్ ఫోన్లు, సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను సీజ్ చేసినట్లు రైల్వే సూపరింటెండెంట్ పీఎన్ మిశ్రా తెలిపారు. భారతీయ రైల్వే యాక్ట్, నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు వివరించారు. నిందితులకు నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో ఎక్కువ మోతాదులో మద్యం స్వీకరించినట్లు తేలిందని చెప్పారు. -
చౌక మద్యంపై నో వ్యాట్!
రాష్ట్ర సర్కారు ఆలోచన సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో మంచినీళ్ల బాటిల్ ధర రూ. 20 పలుకుతోంది. సీసా కల్లు ధర కూడా రూ. 20కి తక్కువకు దొరకట్లేదు. కానీ అక్టోబర్ నుంచి రాష్ట్రంలో రూ.15కే చౌకమద్యం అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గిరిజన తండాలు మొదలుకొని గ్రామాలు, నగరాల వరకు ఎక్కడైనా లభిస్తున్న గుడుంబాకు విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని నిర్ణయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలుత గుడుంబా ప్యాకెట్లను విక్రయిస్తున్న రూ.10కే 90 ఎంఎల్ మద్యాన్ని (కంట్రీ లిక్కర్) అందించాలని సీఎం కేసీఆర్ సూచించినా ఆ ధరకు మద్యాన్ని అందించేందుకు డిస్టిలరీలు ముందుకు రావని అధికారులు చెప్పడంతో ధరను రూ. 15గా ఖాయం చేశారు. నూతన మద్యం విధానం రూపకల్పనలో రూ. 15 మద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మద్యం పాలసీపై చర్చించేందుకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ శనివారం ఉన్నతాధికారులు, బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. రూ. 15కు మద్యం అందించడం వల్ల ఎక్సైజ్ శాఖకు వచ్చే లాభనష్టాలపై చర్చించారు. పకడ్బందీగా ఎక్సైజ్ పాలసీ ప్రతిపాదనలు రూపొందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆరు డిస్టిలరీలు సిద్ధం మద్యం దుకాణాల్లో ప్రస్తుతం చీప్ లిక్కర్ 90 ఎంఎల్, 180 ఎంఎల్ బాటిళ్లలో లభ్యమవుతోంది. 90 ఎంఎల్ ధర కనీసంగా రూ. 30 కాగా, 180 ఎంఎల్ రూ. 55గా ఉంది. రాష్ట్రంలో ఉన్న 16 డిస్టిలరీల్లో ఐఎంఎఫ్ఎల్తోపాటు చీప్ లిక్కర్ కూడా తయారవుతోంది. వివిధ రకాల పేర్లతో బేవరేజెస్ గోడౌన్ల ద్వారా మద్యం దుకాణాలకు చేరుతుంది. ఇప్పుడు సర్కార్ తెస్తున్న రూ.15కే కంట్రీ లిక్కర్ కారణంగా అధిక ధరలో లభించే చీప్ లిక్కర్ మీద దెబ్బపడనుంది. సర్కార్‌కు వచ్చే రాబడిలో చీప్ లిక్కర్ ఆదాయమే అధికం. ఈ నేపథ్యంలో చీప్ లిక్కర్‌కు బదులు కంట్రీ లిక్కర్ తయారు చేసి డిపోలకు అందించేందుకు ఆరు డిస్టిలరీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. అధికారికంగా మద్యం పాలసీ ఖరారైతే మరిన్ని డిస్టిలరీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉంది. అలాగే మద్యం దుకాణాలపైనా ప్రభావం పడనుంది. గ్రేటర్ సహా పలు నగరాల్లో ఏడాదికి రూ. 90 లక్షల లెసైన్సు ఫీజుతో మద్యం దుకాణాన్ని నిర్వహించే వారికి రూ. 15కే చీప్ లిక్కర్ అమ్మడం వల్ల గిట్టుబాటు కాదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల ప్రతిపాదనలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. వ్యాట్ మినహాయింపు ఆలోచన? గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ‘ఆరోగ్యకరమైన’ మద్యాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు దీనికి వ్యాట్ నుం చి మినహాయింపు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మద్యం మీద 60% నుంచి 160% వరకు ప్రభుత్వం వ్యాట్ విధిస్తోంది. చీప్ లిక్కర్‌పై 60% వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే రూ. 15కే అందించే మద్యం పై వ్యాట్ వడ్డించాలంటే ఒక్కో 90 ఎంఎల్ బాటిల్ రూ. 6 లోపే డిస్టిలరీలో తయారు కావాల్సి ఉంటుంది. పెట్ బాటిల్, స్పిరిట్ (మద్యం) తయారీకి ఖర్చయ్యే రూ.6తో ఇది సాధ్యం కాదని డిస్టిలరీలు చెబుతున్నాయి. నష్టం జరగకుం డా ఉండాలంటే వ్యాట్ మినహాయింపు ఒక్కటే మార్గమని వాది స్తున్నాయి. అయితే వ్యాట్‌ను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై భారీగా కోత పడుతుంది. ఈ నేపథ్యంలో గతేడాది లో చీప్ లిక్కర్ అమ్మకాలు, తద్వారా ప్రభుత్వానికి డిస్టిలరీలు చెల్లించిన వ్యాట్‌కు సంబంధించిన లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు.