breaking news
IG N Sanjay
-
వైఎస్ జగన్ దీక్ష ఆగదు
-
వైఎస్ జగన్ దీక్ష ఆగదు
* వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ * ఉల్ఫ్ హాలు గ్రౌండ్లో దీక్షకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ * శుక్రవారం సాయంత్రానికి అనుమతి వస్తుందని విశ్వాసం సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ పరిశీలకుడు బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. 26వ తేదీ ఉదయం నుంచి గుంటూరు ఉల్ఫ్ హాలు గ్రౌండ్‌లోనే దీక్ష చేపడతారని స్పష్టం చేశారు. గురువారం ఉదయం గుంటూరు ఐజీ ఎన్.సంజయ్‌తో చర్చలు జరిపిన తర్వాత, అనంతరం సాయంత్రం గుంటూరు దీక్షా ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉల్ఫ్ హాలు గ్రౌండులో దీక్షకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేశామని శుక్రవారం సాయంత్రానికి అనుమతి వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. జగన్ దీక్షకు సంబంధించి తాము గతంలోనే మూడు ప్రాంతాలను పోలీసులకు తెలియజేశామని, వాటిని నిరాకరించడంతో ప్రైవేటు యాజమాన్యానికి చెందిన ఉల్ఫ్‌హాలు గ్రౌండ్‌ను అద్దెకు తీసుకున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వ ఒత్తిడి మేరకు పోలీసులు అక్కడ దీక్షకు అనుమతులు నిరాకరించడం దారుణమన్నారు. హోదా వచ్చే వరకూ పోరాటం చేస్తామని, చంద్రబాబు గుండెల్లో నిద్రపోతామని బొత్స హెచ్చరించారు. హోదాకోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఆ పనిచేయకపోగా, రాష్ట్ర భవిష్యత్తుకోసం జగన్మోహన్రెడ్డి చేస్తుంటే దాన్ని ఆపాలని చూస్తున్నాడని ఆరోపించారు. నిరవధిక దీక్షపై బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పొట్టిశ్రీరాములు నిరవధిక దీక్ష చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేదా? అని ప్రశ్నించారు. హోదా అనేది భావితరాల భవిష్యత్ కోసమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని తెలిపారు. హోదా కోసం ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని ఆందోళనలు చే పడతామని ఆయన వెల్లడించారు. ఐజీతో జరిగిన చర్చల్లో పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, కొడాలి నాని, మాజీ మంత్రులు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, తాడికొండ, తెనాలి, వినుకొండ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు హెనీ క్రిస్టినా, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. -
సమర్థంగా విధులు నిర్వహించండి
ఎస్పీలతో రేంజ్ ఐజీ సంజయ్ గుంటూరు క్రైం :జిల్లాలో రాజధాని ఏర్పాటు జరుగుతున్న క్రమంలో వీవీఐపీలు,వీఐపీలు తరచూ పర్యటించే అవకాశం ఉన్నందువల్ల పోలీస్ అధికారులు తమ విధులను సమర్థంగా నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ సూచించారు. ఐజీ తన క్యాంపు కార్యాలయంలో రేంజ్ పరిధిలోని ముగ్గురు ఎస్పీలతో బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎప్పటికప్పుడు స్టేషన్లను పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వా లన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించి నేరస్తుల కదలికలపై నిఘా కొనసాగించాలన్నారు. తీరప్రాంత గ్రామాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్న తీరు, తదితర అంశాల గురించి ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమర్థత చాటే సిబ్బందికి రివార్డులు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. మూడు జిల్లాల పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. అందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుగా తెలియజేస్తానన్నారు. అదేవిధంగా రేంజ్ కార్యాలయానికి రావాల్సిన నివేదికలను త్వరితగతిన పంపాలన్నారు. సమావేశంలో గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీ సి.హెచ్.శ్రీకాంత్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ ఎస్.సెంథల్‌కుమార్ పాల్గొన్నారు. పలువురి అభినందనలు ఐజీగా బాధ్యతలు చేపట్టిన ఎన్.సంజయ్‌ను అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, గుంటూరు పశ్చిమ ఎమ్యెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మోదుగుల జిల్లాలోని పరిస్థితులపై ఐజీతో చర్చించారు. తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఐజీని కలిసినవారిలో అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జె.భాస్కర్‌రావు, డీఎస్పీలు బి.మెహర్‌బాబు, కె.నరసింహ, గంగాధరం, ఎన్.ప్రసాద్, సీఐలు, అర్బన్ ఎస్పీ కార్యాలయ ఏవో వివేక్‌దూబే, సూపరింటెండెంట్లు కరిముల్లా, శివకుమార్, రూరల్ జిల్లా అదనపు ఎస్పీలు గోళ్ల రామాంజనేయులు, టి.శోభామంజరి, కె.శ్రీనివాసరావు, డీఎస్పీలు జి.చెంచుబాబు, కె.సుధాకర్, ఐ. పూజ, బి.సత్యనారాయణ,ఎం. మధుసూదనరావు, సీఐలు, రూరల్ ఎస్పీ కార్యాలయ ఏవో ఎం.సంపత్తు, సూపరింటెండె ంట్లు షేక్ కరిముల్లా, జయశ్రీ, నారాయణమూర్తి, ఆర్ఐలు ఉన్నారు. తొలుత ఐజీ సీసీ హిమవంతరావు, కార్యాలయ మేనేజర్ నాగలక్ష్మి, ఉద్యోగులు సంజయ్‌ను కలిశారు.. తనను కలిసినవారిని ఐజీ సాదరంగా ఆహ్వానించి ఎక్కడ పనిచేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు.