breaking news
hindu muslim integrity
-
అన్నీ హిందూ కుటుంబాలే.. ఏకగ్రీవంగా ముస్లిం సర్పంచ్
బద్వేరా/జమ్మూ,కశ్మీర్ : కుల, మతాల కుమ్ములాటలతో భారతావని ఓ పక్క ‘రాజకీయాల’ల్లో చిక్కుకుని తల్లడిల్లుతోంటే.. కశ్మీర్‌లోని ఓ గ్రామం మాత్రం అందరికీ కనువిప్పు కలిగే పనిచేసింది. గ్రామంలో ఉన్న ఒకేఒక్క ముస్లిం కుటుంబానికి అధికారాన్నిచ్చింది. కులం, మతం కాదు ముఖ్యం.. పనిచేసే తత్వం అని ప్రపంచానికి తెలియజెప్పింది. వివరాలు.. కశ్మీర్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బేలన్-కరోఠి గ్రామం చౌదరీ మహ్మద్ హుస్సేన్ (54) అనే వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 450 కుటుంబాలు గల ఈ గ్రామంలో హుస్సేన్ది మాత్రమే ముస్లిం కుటుంబం. మిగతా వారంతా హిందువులే. తమ మధ్య హిందూ ముస్లిం భేదాలు లేవని ప్రపంచానికి తెలిపేందుకు, హుస్సేన్ కుటుంబం ఒంటరిది కాదని దన్నుగా నిలిచేందుకే ఆయన్ని తమ గ్రామ పెద్దగా ఎన్నుకున్నామని అక్కడి ప్రజలు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తద్వారా ‘భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం’ అనే మాటలకు నిజమైన అర్థం చెప్పారు. హుస్సేన్‌కు నలుగురు కుమార్తెలు, ఐదుగురు కుమారులున్నారు. గ్రామం మొత్తం హిందువులే నివసిస్తున్నా హుస్సేన్ కుటుంబం మాత్రం ఎప్పుడూ వివక్షకు గురికాలేదు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ, అందరితోనూ తలలో నాలుకలా మెలిగే హుస్సేన్ అంటే గ్రామస్తులకు ఎంతో గౌరవం. అందుకనే ప్రస్తుత ఎన్నికల్లో ఆయనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుని మతసామరస్యాన్ని చాటారు. ‘ఈ గ్రామంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’అని హుస్సేన్ ఉద్వేగంగా చెప్పారు. -
పాక్‌లో హిందూ ముస్లిం భాయ్ భాయ్
పాకిస్థాన్ అంటే మనకు టెర్రరిస్టులే కళ్లముందు కదలాడుతారు. ఆక్కడ మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులపై ముస్లిం ఛాందసవాదులు దాడులు చేస్తున్నారని, వారిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారుస్తున్నారని అప్పుడప్పుడు దేశీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు కూడా ఘోషిస్తుంటాయి. మరోవైపు చూస్తే పాకిస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలసిమెలసి సహజీవనం సాగిస్తున్నారన్నది అక్షర సత్యం. సింధూ రాష్ట్రంలోని తార్పార్కర్ జిల్లాలో మీఠీ అనే చిన్న గ్రామం అలాంటిదే. అక్కడ రంజాన్ వచ్చిందంటే హిందువులంతా ముస్లింలలాగే ఉపవాసం చేస్తారు. మొహర్రం ప్రదర్శనను ముందుండి నడిపిస్తారు. సూఫీ తత్వం ప్రకారం మొహర్రం ప్రదర్శనకు హిందువులే ముందుండాలని ఆ గ్రామ పెద్దలు చెబుతున్నారు. అలాగే మొహర్రం సమయంలో హిందువులెవరూ పెళ్లిళ్లు, పేరంటాలు చేసుకోరు. రంజాన్, దీపావళి సందర్భంగా ఇరుమతాల వారు స్వీట్లు ఇచ్చి పుచ్చుకుంటూ పరస్పర విశ్వాసాలను పరిరక్షించుకుంటారు. హిందువుల విశ్వాసాలను గౌరవించి మైనారిటీలైన అక్కడి ముస్లింలు ఆవులను వధించరు. వాటి మాంసాన్ని తినరు. అంతేకాకుండా హిందూ దేవాలయల్లో పూజలు జరుగుతున్నప్పుడు మసీదు మైకులు మౌనం పాటిస్తాయి. మసీదు మైకుల్లో నమాజ్ వినిపిస్తున్నప్పుడు గుడిలో గంటలు మోగవు. ఆ ఊర్లో నేరాల సంఖ్య కేవలం రెండు శాతానికి మించదని తార్పార్కర్ జిల్లా పోలీసు అధికారులే తెలియజేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ విడిపోయిన నాటి నుంచి వారు ఇలాగే సామరస్యంగా సహజీవనం చేస్తున్నారట. ఇప్పటి వరకు తమ గ్రామంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మత ఘర్షణ జరగలేదని, ఇప్పటికీ టెర్రరిజం ఛాయలు కూడా లేవని ఇరు మతాల పెద్దలు గర్వంగా చెబుతారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా ? -డాన్ డాట్ కామ్ సౌజన్యంతో...