breaking news
Himayath Sagar Reservoir
-
భారీ వర్షం.. ఏ క్షణంలోనైనా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా వరుసగా ఐదు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ట,పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, గౌలిపుర, చార్మినార్, ఫలక్‌నుమా, ఉప్పుగూడ ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులను స్వీకరించి.. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. నిండుకుండలా హిమాయత్ సాగర్ భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఏ క్షణంలోనైనా డ్యామ్ గేట్లు ఎత్తేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ 1762 అడుగులకు చేరింది. 1763 అడుగులు దాటితే గేట్లు ఎత్తేసామని హైదరాబాద్ మెట్రో పాలిటస్ వాటర్ సప్లై జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. తోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 2010లో చివరి సారి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు.మళ్లీ పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ నిండింది. డ్యామ్ గేట్ల దగ్గర లీకేజీ అవుతుండడంతో మరమ్మతులు చేస్తున్నారు సిబ్బంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను జలమండలి, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. మూసి నదీ పరివాహక ప్రాంతాలైన కిస్మత్ పూర్, బండ్లగూడ, హైదర్ గూడా, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. పోలీస్ శాఖ అప్రమత్తం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. 24 గంటలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాట ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్ 100కు వచ్చే కాల్స్ అన్నింటీకి ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైన డయల్ 100కు ఫొన్ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ కోరారు. పెరుగుతున్న తమ్మిలేరు వరద ప్రవాహాం భారీ వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. ఏలూరుకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతాలకు తమ్మిలేరు వదర నీరు వచ్చి చేరింది. తమ్మిలేరు కాలువకు గండి కొట్టి 10000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గండికొట్టిన ప్రాంతాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రమణారెడ్డి పరిశీలించారు. ఏలూరులో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రమణారెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులను సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. -
జలాశయాలు.. కబ్జా!
మొయినాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ మహానగరంతోపాటు జిల్లాలోని మొయినాబాద్ మండలానికి నీరందించే గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాలకు ముప్పు ముంచుకొస్తోంది. వీటిని క్రమంగా అక్రమార్కులు చెరబడుతున్నారు. దీంతో ఈ రెండూ.. రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక ఓ వైపు, ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్- జలాశయం నిండినప్పుడు విస్తరించే భాగం) పరిధి లో రిసార్టులు, ఫాంహౌస్‌ల నిర్మాణాలు జలాశయాల ఉనికికే ప్రమాదం తెస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం జారీచేసిన 111 జీఓ అక్రమార్కుల ఆగడాలను నియంత్రించలేకపోతోంది. యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఏమిటి ఆపద? జంట జలాశయాల్లో దశాబ్దాల నుంచి పూడిక తీయలేదు. యేటా వరద నీటితోపాటు పూడిక వచ్చి చేరుతోంది. దీంతో వీటి నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. గండిపేట జలాశయం నిర్మించినప్పుడు దాని పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 5.5టీఎంసీలు. ప్రస్తుతం అది 3.9టీఎంసీలకు పడిపోయింది. ఇక హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 3.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.9 టీఎంసీలకు తగ్గిపోయింది. కబ్జాల మాటేంటి? జంటజలాశయాల పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. ఇప్పటికే రెండు జలాశయాల పరిధిలో సుమారు 340 ఎకరాల శిఖం భూమి కబ్జాలకు గురైనట్లు తెలుస్తున్నది. జలాశయాల్లో నీళ్లు లేనప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పట్టా భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలి. కానీ అలాంటి పట్టాభూములను చాలామంది ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందినవారికి అమ్మేశారు. ఆ భూముల్లో వారు రిసార్ట్స్, ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. మరికొన్ని భూములు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో జలాశయాల విస్తీర్ణం తగ్గి వాటి రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రస్తుతం గండిపేట జలాశయం విస్తీర్ణం 24.74 చదరపు కిలోమీటర్లు కాగా హిమాయత్‌సాగర్ జలాశయం విస్తీర్ణం 28.16 చదరపు కిలోమీటర్లు. 111 జీఓ.. ఏం చెబుతోంది? జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో ప్రభుత్వం 111 జీఓను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం జలాశయాల ఎగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు. కానీ ఈ నిబంధనలను అక్రమార్కులు గాలికి వదిలేశారు. ఇప్పటికే జలాశయాల సమీపంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఫాంహౌస్‌లు, రిసార్టులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి, అక్రమ లేఅవుట్లు, వెంచర్లు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఏం చేస్తున్నారు? గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతున్నా, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లు వెలుస్తున్నా ఇటు జలమండలి గానీ, అటు రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చినా ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లలోకి నీళ్లు రాకుండా మట్టి పోసి ఎత్తు పెంచేసుకుంటున్నారు. జలాశయాలను ఆనుకుని జరుగుతున్న నిర్మాణాలన్నీ బడాబాబులవే కావడంతో అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.