breaking news
hike car prices
-
కార్ల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ప్రారంభ స్థాయి కార్ల నుంచి లగ్జరీ వాహనాల వరకు జనవరి నుంచి వివిధ కార్ల రేట్లకు రెక్కలు రానున్నాయి. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోయిన కారణంగా వివిధ మోడల్స్ ధరలను పెంచబోతున్నట్లు పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను 4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ఆల్టో కే10 నుంచి మల్టీ యుటిలిటీ వాహనం ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలను రేట్ల పెంపునకు కారణంగా పేర్కొంది. కస్టమర్లపై భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కొంత బదలాయించక తప్పని పరిస్థితి ఉంటోందని వివరించింది. మరోవైపు హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా తమ కార్ల రేట్లను రూ. 25,000 వరకు పెంచడంపై దృష్టి పెట్టింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాలు 3 శాతం వరకు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం, కమోడిటీల ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అటు, టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్ వాహనాలపై 3 శాతం మేర, కియా ఇండియా 2 శాతం స్థాయిలో రేట్లను పెంచనున్నట్లు వెల్లడించాయి. వచ్చే నెల నుంచి తమ మొత్తం వాహనాల శ్రేణి రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా వెల్లడించింది. అటు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కూడా 3 శాతం పెంచనుంది. కమోడిటీల రేట్లు, లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైనవి నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జీఎల్సీ మోడల్ ధర రూ. 2 లక్షల వరకు, టాప్ ఎండ్ మెర్సిడెస్–మేబాక్ ఎస్ 680 లగ్జరీ లిమోజిన్ రేటు రూ. 9 లక్షల వరకు పెరగనుంది. ముడి వస్తువులు, రవాణా వ్యయాలు పెరగడంతో ఆడి ఇండియా కూడా తమ వాహనాల శ్రేణి ధరను 3 శాతం వరకు పెంచుతోంది. ఇక బీఎండబ్ల్యూ ఇండియా కూడా 3 శాతం స్థాయిలో పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. హోండా కార్స్ సైతం ఇదే యోచనలో ఉన్నప్పటికీ, పెంపు పరిమాణంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏటా డిసెంబర్లో జరిగేదే.. ముడివస్తువుల ధరల ఒత్తిడి మొదలైన అంశాల కారణంగా రేట్లను పెంచుతున్నామని కార్ల కంపెనీలు చెబుతున్నప్పటికీ, ఇది ఏటా డిసెంబర్లో జరిగే వ్యవహారమేనని పరిశ్రమ నిపుణులు తెలిపారు. సాధారణంగా కొత్త ఏడాదిలో కొత్త మోడల్‌ను కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో డిసెంబర్లో కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే కస్టమర్లను కాస్త తొందరపెట్టేందుకు వాహన కంపెనీలు ఇలాంటి ప్రక్రియ చేపడుతుంటాయని పేర్కొన్నారు. తద్వారా ఏడాది చివర్లో అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలు ప్రయతి్నస్తాయని వివరించారు. సాధారణంగా క్యాలెండర్ సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇలా ధరలను పెంచడం కనిపిస్తుంటుందని, కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేటప్పుడు కూడా ఇలా చేస్తుంటాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రజత్ మహాజన్ తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా రేట్లను సవరించలేదు కాబట్టి నాలుగో త్రైమాసికం ప్రారంభంలో పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో త్రైమాసికంలో కొన్ని బడా కంపెనీల లాభదాయకత తగ్గడం కూడా రేట్ల పెంపునకు కారణమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు సాధారణంగానే క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో రేట్లను పెంచుతుంటాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వర్ గుప్తా తెలిపారు. దానికి అనుగుణంగానే వివిధ కార్ల కంపెనీలు రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయని పేర్కొన్నారు. -
ధరలను పెంచేసిన ఎం అండ్ ఎం
సాక్షి, ముంబై: యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వాహనదారులకు చేదువార్త అందించింది. ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించింది. కమొడిటీ ధరలు పెరగిన నేపథ్యంలో కొన్ని మోడళ్ల వాహనాల ధరలను పెంచాలని భావిస్తున్నామని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా ప్రకటించారు. ప్యాసింజర్ వాహనాల ధరలను 30వేల రూపాయలు లేదా 2 శాతం పెంచాలని కంపెనీ భావిస్తున్నామన్నారు. ఆగస్టు నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, టీయూవీ 300, కేయూవీ100 తదితర మోడళ్ల ప్యాసింజర్ వాహనాల శ్రేణిని ఎం అండ్ ఎం విక్రయిస్తుంది. కాగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. 2.2 శాతం పెరిగిన ధరలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి. -
భారీగా పెరగనున్న మారుతీ, హ్యుందాయ్ ధరలు!
ముంబై : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్లు కార్ల ధరలను భారీగా పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. జనవరిలో ఈ వాహన సంస్థలు కార్ల ధరలను రూ. 2500 నుంచి లక్ష రూపాయల వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడం, గత కొన్ని నెలలుగా వరుసగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, రూపాయి విలువ పతనమవడం వంటివి కార్ల ధరలు పెంపుకు దోహదం చేస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి చేసుకునే కార్ల విడిభాగాల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో జనవరిలో తమ వాహన ధరలను పెంచాలని కార్ల తయారీ సంస్థలు యోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కార్ల సంస్థలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించేశాయి. మిగతా సంస్థలు కూడా ధరల పెంపు ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. న్యూఇయర్ ప్రారంభంలో మారుతీ సుజుకీ ధరలు పెంచడానికి ఎప్పుడూ మొగ్గుచూపదు. కమోడిటీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకే సిద్దమై ఉంటుంది. కానీ భారీ డిస్కౌంట్లు, రూపాయి పతనం వంటివి ఈ సంస్థ రెవెన్యూలకు గండికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి కార్ల ధరలను పెంచనున్నామని మారుతీ సుజుకీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సీ చెప్పారు. అయితే ధరలు ఎంతపెంచాలనే దానిపై తమ ధరల నిర్ణయ టీమ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో రెండో సారి మారుతీ కార్ల ధరలను పెంచుతోంది. హ్యుందాయ్ సైతం జనవరిలో తన కార్ల ధరలను పెంచనున్నట్టు తెలిసింది. తమ మోడల్స్‌పై రూ.4000 నుంచి రూ.1 లక్ష వరకు ధరలు పెంచేందుకు యోచిస్తున్నామని హ్యుందాయ్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. హ్యుందాయ్ ప్రీమియం ఎస్యూవీ, సాంటా ఫీలపై లక్ష రూపాయల ధర పెరగనుంది.