హైటెక్ మట్కా కేంద్రం గుట్టు రట్టు
తాడిపత్రి, న్యూస్‌లైన్: తాడిపత్రి కేంద్రంగా సాగుతున్న హైటెక్ మట్కా కేంద్రం గుట్టును అనంతపురం ప్రత్యేక పోలీసులు బుధవారం వేకువజామున రట్టు చేశారు. క్రిష్ణాపురం ఒకటో రోడ్డులో ఎవరికీ అనుమానం రాకుండా రవికుమార్‌రెడ్డి, రవీంద్రారెడ్డి అనే వ్యక్తులు మెయిల్స్ ద్వారా ఇతర ప్రాంతాల్లోని బీటర్ల నుంచి మట్కా లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సెంథిల్‌కుమార్‌కు ఈ హైటెక్ మట్కాకేంద్రం గురించిన సమాచారం అందింది. వెంటనే ఆయన అనంతపురంలోని ప్రత్యేక పోలీసుల ద్వారా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు మట్కా నిర్వాహకుల ఇళ్లపై దాడులు చేయించారు. వారి నుంచి కంప్యూటర్లు, సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడిపత్రిలో మట్కా, జూద కేంద్రాలను అరికట్టేందుకు ఎస్పీ ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. పేకాట కేంద్రాలపై చూసీచూడనట్లు వ్యవహరించిన పట్టణ సీఐ లక్ష్మినారాయణకు ఇప్పటికే చార్జిమెమో జారీ చేశారు.
తాజాగా మట్కా కేంద్రంపై కూడా ఎస్పీ పర్యవేక్షణలో దాడులు చేయడంతో సీఐ ఏకంగా సెలవుపై వెళ్లిపోయారు.