breaking news
high school students
-
1 నుంచి 8 తరగతులకు ఆన్లైన్ పాఠాలే..
సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ఉంటుందా? ఉండదా? అంటే ఉండకపోవచ్చుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు.. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే ఎదురయ్యే సవాళ్లు, సమస్యల నేపథ్యంలో వారికి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తోంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రారంభించిన ప్రత్యక్ష బోధనను మాత్రమే కొనసాగించే యోచనలో ఉంది. ఇటు మిగతా తరగతుల విద్యార్థులను ప్రస్తుతమున్న ఆన్లైన్/డిజిటల్ (టీవీ పాఠాలు) పాఠాలకే పరిమితం చేసే ఆలోచనల్లోనే విద్యాశాఖ ఉంది. అంతేకాదు వారికి బోర్డు ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఎలాంటి పరీక్షల నిర్వహణ లేకుండానే పైతరగతులకు పంపించే దిశగానే అడుగులు వేస్తోంది. ‘భౌతిక దూరం’కష్టమనే.. కరోనా కారణంగా పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. కార్పొరేట్, బడా ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు తీసుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని, చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు అటు ఆన్లైన్ తరగతులు నిర్వహించలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. కొన్ని యాజమాన్యాలైతే స్కూళ్లను పూర్తిగా మూసేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు త్వం గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్/డిజిటల్ (టీవీ పాఠాలను) ప్రారంభించింది. టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రభుత్వ విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆన్లైన్ బోధన చేపట్టలేని మరికొన్ని సాధారణ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం అందిస్తున్న వీడియో పాఠాలనే చూడా లని తల్లిదండ్రులకు సూచించాయి. మొన్నటివరకు అ లాంటి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వీడియో పాఠాలనే విన్నారు. చివరకు ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ, బెంచీకి ఒకరు చొప్పున, తరగతి గదిలో 20 మంది మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. గతంలో ఒక్కో తరగతికి చెందిన వారు ఒకే గదిలో 70–80 మంది కూర్చునే విద్యార్థులను మూడు నాలుగు తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. వారికి బోధించేందుకు ఉన్నత పాఠశాలల్లోని టీచర్లతో పాటు 5 వేల మంది వరకు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై ఉన్నత పాఠశాలలకు పంపించారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బెంచీకి ముగ్గురు నలుగురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. భౌతిక దూరం పాటించడం అనేది లేకుండా పోయింది. 6, 7, 8 తరగతులు ప్రారంభించాలనుకున్నా.. పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన సమయంలోనే 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అయితే 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన సమయంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూసి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే పాఠశాలల్లో కరోనా వ్యాప్తి లేకపోయినా, ప్రైవేటు పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 18 రోజులు దాటింది. అయితే కోవిడ్ నిబంధనల అమలు ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగా సాధ్యం కావడం లేదనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, ఏదైనా అనుకోని సమస్య వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఒక్క విద్యార్థికి కరోనా ఉన్నా అది ఇతరులకు సులభంగా సోకే ప్రమాదముంది. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులను ప్రారంభిస్తే ఇంకా అదనపు టీచర్లు కావాలి.. గత విద్యా సంవత్సరంలో తీసుకున్న 12 వేల మంది విద్యా వలంటీర్లకు మించి ఇంకా అదనంగా తీసుకోవాలి. ఇటు అదనపు తరగతి గదులు అవసరముంటుంది. ఈ నేపథ్యంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయడమే మంచిదన్న అభిప్రాయంలోనే అధికారులున్నారు. మరోవైపు మార్చి నెలలో 6, 7, 8 తరగతులను ప్రారంభించినా ఈ సమస్యలు వస్తాయని, పైగా మార్చిలో వేసవి ఎండలు ఎలా ఉంటా యో తెలియదు.. ఒంటిపూట బడులనే కొనసాగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధన అవసరమా? తల్లిదండ్రులు పంపిస్తారా? అన్న సందిగ్ధం ఉన్నతాధికారుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఓసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చూద్దామనే ఆలోచన చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రాథమిక పాఠశాలలు) మాత్రం ప్రత్యక్ష బోధన అవసరమే లేదనే అభిప్రాయంలో అధికారులున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న హాజరు శాతం: మంత్రి సబిత రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తుండటంతో 9,10 తరగతుల విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో తరగతుల నిర్వహణపై గురువారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నందున విద్యార్థులు ప్రత్యక్ష తరగతుల హాజరుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 1న విద్యార్థుల హాజరును పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 48%, మోడల్ స్కూళ్లలో 37%, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 19%, ప్రైవేట్ పాఠశాలల్లో 46% ఉందన్నారు. ఇక ఈ నెల 17న చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 72%, మోడల్ స్కూళ్లలో 69%, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో 71%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 85%, ప్రైవేట్ పాఠశాలల్లో 69 శాతానికి హాజరు పెరిగిందన్నారు. -
అరుణ గ్రహంపైకి విద్యార్థుల పేర్లు
జిన్నారం(నర్సాపూర్): అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుణ గ్రహంపైకి వచ్చే సంవత్సరం జూలైలో పంపనున్న మార్స్ రోవర్లో అమర్చే మైక్రోచిప్‌లో సంగారెడ్డి జిల్లా బొల్లారం ఉన్నత పాఠశాల విద్యార్థుల పేర్లు చేర్చినట్లు పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మైక్రోచిప్‌లో పొందుపరిచిన కోటి పేర్లలో తమ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థుల పేర్లు ఉండడం విశేషమన్నారు. ఈ వ్యోమనౌక 2021 ఫిబ్రవరిలో అరుణ గ్రహాన్ని చేరుతుందని చెప్పారు. పేర్లు పంపడానికి ఉత్సాహం చూపించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. -
వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం
జీలుగుమిల్లి: ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఏలూరులో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం హైస్కూల్ విద్యార్థులు అండర్-19 విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. వీళ్లంతా ఈ నెల 26 నుంచి 28 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్ర స్ధాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని పీఈటీ నాయక్ తెలిపారు. విజేతలకు ఎంపీడీవో కొండలరావు, ఎంఈవో కె.శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. -
విద్యార్థినుల అదృశ్యం మిస్టరీ వీడింది
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి కస్తూర్బా పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు అదృశ్యంపై మిస్టరీ వీడింది. సదరు విద్యార్థులకు సంబంధించిన వస్తువులను పాఠశాల సిబ్బంది బుధవారం కనుగొన్నారు. అనంతరం ఆ విద్యార్థినులు వాళ్ల స్వస్థలమైన ఖానాపూర్ మండలం పెంబికు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థినులపై వాళ్ల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన 11 మంది విద్యార్థినులు ఆ తర్వాత హాస్టల్‌కు తిరిగి రాలేదు. దీంతో హస్టల్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. -
హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు!
హైదరాబాద్: రాష్ట్రంలోని హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ స్ట్రీట్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. వచ్చే కేబినెట సమావేశం పూర్తిగా ఇన్కేబినెట్ మీటింగ్దేనని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంత్రులందరికి లాప్టాప్, ఐపాడ్ల అందజేస్తామని... వాటి సహయంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
నాణ్యతలేని భోజనం మాకొద్దు
పుల్లేటికుర్రు (అంబాజీపేట) :నాణ్యతలేని మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.. ఉడకని కూరలు, ముద్దయిన అన్నం మాకొద్దంటూ 500 మంది విద్యార్థులు ఆందోళన చేశారు. ఉపాధ్యాయులకు, ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులకు నాలుగు నెలలుగా భోజనం బాగుండడం లేదని చెబుతున్నా పట్టించుకోలేదని విద్యార్థులు అన్నారు. మండలంలోని పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం భోజనం సమయంలో కూర, అన్నం బాగోలేదంటూ సెంటర్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అన్నంలో రాళ్లు, వడ్లు ఉంటున్నాయని, వంకాయ కూర తినేందుకు వీలుగా లేదని వంకాయ ముక్కలు ఉడకలేదని విద్యార్థులు అన్నారు. ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులను అడుగగా తింటే తినండి, లేకపోతే మానేయండని చెప్పడంతో విద్యార్థులు పుల్లేటికుర్రు సెం టర్కు చేరుకుని మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు. నాణ్యమైన భోజనం పెట్టాలని, ఇంప్లిమెంట్ ఏజెన్సీని మార్పు చేయాలని వారు నినాదాలు చేశారు. ఆర్ఐ బి.గోపాలకృష్ణ విద్యార్థులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాస్తారోకో విరమించిన విద్యార్థులు హైస్కూలుకు చేరుకుని ధర్నా చేశారు. ఎంఈఓ ఎం.హరిప్రసాద్, ఆర్ గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్ అందె వెంకట ముక్తేశ్వరరావులతో పాటు పలువురు విద్యార్థులతో మాట్లాడారు. నాలుగు నెలల నుంచి భోజనం తినేం దుకు రుచిగా లేక బయట పడేస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. ఈ విషయం ఉపాధ్యాయులకు చెప్పినా పరిస్థితిలో మార్పులేదని వారన్నారు. హాస్టల్స్ విద్యార్థులు 200 మంది ఆకలితో అలమటిస్తున్నట్టు వారు తెలిపారు. వంటకాలను ఎం ఈఓ రుచి చూసి కూరలు బాగోలేదని వంకాయి కూర చేదుగా ఉండి, ఉడకలేదన్నారు. అనంతరం ఎంఈఓ, స్థానికులు బయటి నుంచి పెరుగు, పచ్చడి తెప్పించి విద్యార్థులకు భోజనం పెట్టించారు. అనంతరం హెచ్ఎం. ఎస్.సుబ్బరాజును అధికారులు, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణలు ఆరాతీశారు. ఆఫీసు రూంలో ఉండగా విద్యార్థులు బయటకు వెళ్లిపోయారని హెచ్ఎం తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎంలతో చర్చించి విద్యార్థుల నుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకోవాలని ఎంఈఓ అన్నారు. ఉన్నతాధికారులకు ఈ ఫిర్యాదు పంపి చర్యలకు సిఫార్సు చేస్తామని ఎంఈఓ తెలిపారు.