breaking news
hero nara rohit
-
అభిమానుల రుణం తీర్చుకోలేనిది : నారా రోహిత్
అనంతపురం: అనంతలో సేవా భావం కలిగిన అభిమానులుండడం ఆనందంగా ఉందని, ఇక్కడ ఒక సినిమా చేయాలనుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. నారా పవర్ ఆఫ్ యూత్ సంస్థ ఆధ్వర్యంలో నారా రోహిత్ ఆదివారం నగరంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నారాయణ సేవ పేరిట నిత్యం అన్నదానం చేస్తున్న విజయ్సాయికుమార్ సేవలను కొనియాడారు. మునిసిపల్ అతిథి గృహంలో అభిమానులతో సమావేశమై వారితో ముచ్చటించారు. బాలయ్యతో పాటు తన చిత్రాలను ఆదరిస్తున్న నందమూరి అభిమానుల రుణం తీర్చుకోలేనిదన్నారు. తన అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, వారికి తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. లలితకళాపరిషత్తులో జరిగిన వైద్య శిబిరంలో దాదాపు 500 మందికి ఉచిత వైద్య సేవలందించారు. అదేవిధంగా రోహిత్ అభిమాన సంఘం వారు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి, హీరో నారా రోహిత్, నిర్వాహకులు ధనుంజయ నాయుడు బృందాన్ని అభినందించారు. అనంతరం ప్రభుత్వ జనాసుపత్రిలో సాయి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం, పేద విద్యార్థులకు పుస్తకాల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత జగన్, మారుతీప్రసాద్ తదితరులతో పాటు నారా రోహిత్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రక్తదానం చేసిన ‘అసుర’ మూవీ టీం
హైదరాబాద్: రెటినోబ్లాస్టోమా అవగాహన వారోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు సహకారంతో బ్లడ్ లైవ్ అనే కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని శనివారం సినీనటుడు నారా రోహిత్ ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకురావడం సమాజ సేవ అని ఆయన అభివర్ణించారు. ఇలాంటి ఉత్తమ కార్యక్రమాలు, సమాజ సేవ నిర్వహిస్తున్న రెండు ప్రముఖ సంస్థలతో అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అసుర సినిమా సిబ్బంది రక్తదానం చేశారు. కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న 5 ఏళ్ల లోపు పిల్లలకు సహాయం అందించేందుకు వీరంతా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.