తప్పిన ముప్పు..
సాక్షి, గుంటూరు: జిల్లాకు హెలెన్ తుపాను ముప్పు తప్పిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన హెలెన్ తుపాను శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు మాత్రమే కురిసే అవకాశం వుందని వెల్లడికావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచీ జిల్లా అంతటా వాతావరణంలో మార్పుచోటుచేసుకుంది. రేపల్లెలో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. బాపట్లలో సాయంత్రం నుంచీ వర్షం ఆరంభమైంది. సూర్యలంక వద్ద సముద్రంలో అలలు నాలుగు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 70 అడుగుల మేర ముందుకు వచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం చలితోకూడిన గాలులు బలంగా వీస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేపల్లె మండలంలోని లంకవానిదిబ్బ, నిజాంపట్నంలోని పామర్తి, బాపట్లలోని రామచంద్రాపురం, సూర్యలంక, అడవిపల్లి పాలెం గ్రామాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించి ఆహారాన్ని అందజేశారు. వేటకు సముద్రంలోకి వె ళ్లిన నిజాంపట్నం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులను గుర్తించిన అధికారులు మెరైన్ పోలీసుల సహకారంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తమిళనాడు, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తీరానికి చెందిన పలు బోట్లు నిజాంపట్నం, అడవిపల్లిపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నాయి. నిజాంపట్నం ఓడరేవులో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు మరో మారు సూచించారు.
భయాందోళనలో రైతులు.. జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. కిందటి నెలలో కురిసిన అధికవర్షాలకు సుమారు 6.5 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటను కాపాడుకునే ప్రయత్నాల్లో వున్న రైతులకు హెలెన్ తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో కురియనున్న వర్షాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.
రైతు పరిస్థితి మరింత దయనీయం - ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్
జిల్లాలో అధికవర్షపాతం దెబ్బకు అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కిందటి నెలలో సంభవించిన పంటనష్టానికి సంబంధించి సర్వే 97 శాతం పూర్తయింది. ఆ మేరకు కేంద్ర కమిటీ పర్యటించింది. ప్రస్తుత వర్షాలకు మరో 10 నుంచి 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగే అవకాశం వుందని అంచనా వేస్తున్నాం. జిల్లా ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. రైతులకు పంటల బీమా పరిహారాన్ని కూడా పారదర్శకంగా వర్తింపజేసేందుకు కృషిచేస్తాం.
బాపట్ల, రేపల్లెల్లో ఇరిగేషన్ టీములు.. అక్టోబరు 22 నుంచి 27వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు కష్ణా పశ్చిమ డెల్టాలోని కాలువలు, డ్రెయిన్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. కొమ్మమూరు, తుంగభద్ర, రేపల్లె, బాపట్ల ఈస్ట్శాంప్, నల్లమడ డ్రెయిన్లకు వందల సంఖ్యలో గండ్లు పడ్డాయి. సుమారు 1.50 లక్షల హెక్టార్లలోని వరి పంట ముంపునకు గురైంది. దెబ్బతినగా మిగిలిన పంటను పరిరక్షించుకునే పనిలో మునిగిన రైతాంగానికి హెలెన్ తుపాను కబురు తీవ్ర ఆందోళన రేకెత్తించింది. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ఇప్పటికే దెబ్బతిన్న కాలువలు, డ్రెయిన్ల ద్వారా మళ్లీ పంటలు మునిగిపోతాయన్న ఆలోచనతో ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్తల్లో భాగంగా,రేపల్లె, బాపట్ల ప్రాంతాల్లో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రేపల్లెలో డ్రెయినేజీ సెక్టారు డీఈఈ జోజయ్య నేతత్వంలో ఆరుగురు ఇంజినీర్లు, బాపట్లలో డీఈఈ మురళీధర్ నేతత్వంలో మరో ఆరుగురు ఇంజినీర్లు నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా ఏర్పాట్లు చేశామని ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబు తెలిపారు.
అందుబాటులో అధికారులు
గుంటూరు: స్థానిక పోలీసులతోపాటు మెరైన్, జాతీయ విపత్తుల నివారణ బృందాలు రెవెన్యూ అధికారులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ ఎప్పటికప్పుడు ఆయా బృందాలతో సమీక్షిస్తున్నారు. 40 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తుల నివారణ బృందాలు రెండు జిల్లాకు చేరుకున్నాయి. వీరికితోపాటు మెరైన్‌లోని ఐదు బృందాల్లో 15 మంది సిబ్బంది సిద్ధంగావున్నారు.
ఈదురు గాలులతో కూడిన వర్షం
రేపల్లె: హెలెన్ తుపాను ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి తీరం వెంట ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులకు వరి పంట నేలకొరిగింది. పొట్ట, కంకిదశలో ఉన్న వరి నేలకొరగడంతో పంట నీటిలో నాని దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే, ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఎక్కువశాతం ఇళ్లకే పరిమితమయ్యారు. హెలెన్ ప్రభావం భారీగా ఉంటుందని ప్రచారం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చలి గాలులు వీస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాను కారణంగా శుక్రవారం మధ్యాహ్నాం నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించారు.