breaking news
Heinz Kraft
-
కాంప్లాన్ బాయ్.. జైడస్!
న్యూఢిల్లీ: కన్జ్యూమర్ ఉత్పత్తుల సంస్థ జైడస్ వెల్నెస్ తాజాగా హెంజ్ ఇండియాను కొనుగోలు చేయనుంది. క్యాడిలా హెల్త్‌కేర్‌తో కలిసి ఈ డీల్ కుదుర్చుకోనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 4,595 కోట్లు. హెంజ్ ఇండియా కొనుగోలుతో ఎనర్జీ డ్రింక్ గ్లూకోన్–డీ, టాల్కం పౌడర్ బ్రాండ్ నైసిల్, నెయ్యి బ్రాండ్ సంప్రీతి మొదలైనవి తమ పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నట్లు జైడస్, క్యాడిలా సంస్థలు విడివిడిగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేశాయి. అలాగే భారత్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో కాంప్లాన్ ఉత్పత్తికి సంబంధించిన మేధో హక్కులు కూడా వీటికి లభిస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి (వచ్చే ఏడాది మార్చి) డీల్ పూర్తి కాగలదని ఈ సంస్థలు తెలియజేశాయి. జైడస్ వెల్నెస్లో క్యాడిలా హెల్త్‌కేర్‌కు మెజారిటీ వాటాలున్నాయి. అమెరికన్ దిగ్గజం క్రాఫ్ట్ హెంజ్ భారత విభాగమైన హెంజ్ ఇండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్, డాబర్ ఇండియా మొదలైన దిగ్గజాలు పోటీపడ్డాయి. ‘మా పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి, ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించే వినియోగదారులు మెచ్చే బ్రాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ కొనుగోలు మంచి అవకాశం. కన్జ్యూమర్ వెల్నెస్ విభాగంలో మా కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది‘ అని జైడస్ వెల్నెస్ చైర్మన్ శార్విల్ పటేల్ తెలిపారు. అటు కాంప్లాన్ తరహాలోనే అమ్మకానికి ఉన్న హార్లిక్స్ బ్రాండ్ కొనుగోలు కోసం పోటీపడటం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ వ్యాపార వ్యూహాలకు కాంప్లాన్ బ్రాండ్ మరింత అనువైనదిగా ఆయన చెప్పారు. హెంజ్ సాస్‌లు, ఇతరత్రా క్రాఫ్ట్ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు క్రాఫ్ట్ హెంజ్ వెల్లడించింది. రూ. 1,700 కోట్లకు జైడస్ ఆదాయాలు.. న్యూట్రిషన్ పానీయాల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటోందన్న కారణంతో వినియోగదారులు క్రమంగా ఆయుర్వేద ఉత్పత్తుల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీ న్యూట్రిషనల్ డ్రింకుల మార్కెట్ మందగమనంలో ఉంది. గడిచిన అయిదేళ్లుగా 16.1 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్.. 2017– 2022 మధ్య 5.6 శాతమే వృద్ధి సాధించవచ్చన్న అంచనాలున్నాయి. ఈ సమయంలో జైడస్ ఈ డీల్ కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30తో ముగిసిన 12 నెలల కాలంలో కాంప్లాన్, గ్లూకోన్–డీ, నైసిల్, సంప్రీతి ఘీ ఉత్పత్తుల ద్వారా ఆదాయాలు దాదాపు రూ.1,150 కోట్ల మేర నమోదయ్యాయి. ఈ డీల్‌తో జైడస్ వెల్నెస్ వార్షిక కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,700 కోట్లకు చేరనుంది. రూ.40 కోట్ల నికర నిర్వహణ మూలధనం, రూ.15 కోట్ల నగదు నిల్వలను కలిపి కంపెనీ విలువను మదింపు చేశారు. ఇతరత్రా రుణాలేమీ తమకు బదలాయించడం జరగదని జైడస్ తెలిపింది. కొంత రుణం, కొంత ఈక్విటీ రూపంలో డీల్‌కు అవసరమైన నిధులను సమకూర్చుకుంటామని, పలు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు తోడ్పాటునివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించింది. 1994 నుంచి కార్యకలాపాలు క్రాఫ్ట్ హెంజ్ భారత్‌లో 1994 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్, ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో ఈ సంస్థకు రెండు తయారీ ప్లాంట్లున్నాయి. ప్రస్తుతం హెంజ్ ఇండియాకు 29 రాష్ట్రాల్లో దాదాపు 800 మంది పైగా పంపిణీదారులు, 20,000 పైచిలుకు హోల్సేలర్ల నెట్వర్క్ ఉంది. మరోవైపు జైడస్ వెల్నెస్కు షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్, న్యూట్రాలైట్ తదితర ప్రధానమైన బ్రాండ్స్ ఉన్నాయి. -
క్రాఫ్ట్ భారీ ఆఫర్... యూనిలీవర్ నో!
• 143 బిలియన్ డాలర్లు ఇస్తా్తనన్న క్రాఫ్ట్ • ఈ విలువ మాకు తగింది కాదు: లీవర్ న్యూయార్క్: అమెరికాకు చెందిన ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం క్రాఫ్ట్ హీంజ్ చేసిన విలీన ప్రతిపాదనను డచ్ దిగ్గజ సంస్థ యూనిలీవర్ తిరస్కరించింది. విలీనానికి సంబంధించి క్రాఫ్ట్ తమను తగిన విధంగా విధంగా విలువ కట్టలేదని పేర్కొంది. తమ గ్రూప్ విలువతో పోలిస్తే క్రాఫ్ట్ ప్రతిపాదించిన 143 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ చాలా తక్కువని, ఈ డీల్ వల్ల షేర్హోల్డర్లలకు ఆర్థికంగా గానీ లేదా ఇతరత్రా మరే రూపంలో గానీ లాభం ఏదీ ఉండదని యూనిలీవర్ పేర్కొంది. అందుకని దీనిపై తదుపరి చర్చలు జరిగే అవకాశాలేమీ లేవని స్పష్టం చేసింది. అయితే డీల్ వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా యూనిలీవర్ షేర్లు కొనుగోలు చేశారు. దీంతో లండన్ ఎక్సే్చంజ్‌లో సంస్థ షేర్లు దాదాపు 12 శాతం ఎగిశాయి. ఫుడ్ అండ్ బెవరేజ్ విభాగానికి సంబంధించి క్రాఫ్ట్ హీంజ్ ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద సంస్థ కాగా, ఉత్తర అమెరికాలో మూడో స్థానంలో ఉంది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 6.86 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రాఫ్ట్ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు 106 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు డచ్ కంపెనీ అయిన యూనిలీవర్ 2016లో సుమారు 56.1 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. డవ్, లిప్టన్, నార్ తదితర ప్రముఖమైన బ్రాండ్స్ 400 పైగా ఈ కంపెనీకి ఉన్నాయి. లండన్ స్టాక్ మార్కెట్లో శుక్రవారం భారీగా పెరిగాక యూని లీవర్ మార్కెట్ విలువ దాదాపు 140 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో క్రాఫ్ట్ చేసిన ప్రతిపాదన దాదాపు దీని మార్కెట్ విలువకు సమానంగా ఉన్నట్లయింది. అందుకే యూనిలీవర్ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయత్నాలు కొనసాగిస్తాం...: క్రాఫ్ట్ యూనిలీవర్ తమ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మరింత ఆమోదయోగ్యమైన ఒప్పంద ప్రతిపాదనపై కసరత్తు కొనసాగించనున్నట్లు క్రాఫ్ట్ పేర్కొంది. డీల్ వార్తలతో అమెరికా మార్కెట్లో క్రాఫ్ట్ షేరు ధర ఒక దశలో 7.5 శాతం ఎగిసి 93.81 డాలర్ల వద్ద, యూనిలీవర్ 9.5 శాతం పెరిగి 46.62 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయ్యాయి. ఒకవేళ విలీనం సాకారమైతే గుత్తాధిపత్య ధోరణులతో కొనుగోలుదారుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని, భారీ స్థాయిలో ఉద్యోగాల కోత అవకాశాల కారణంగా రాజకీయంగా ప్రకంపనలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.