ఎ‘వరి’కీ చెప్పుకోలేక...
=వ్యాపారుల దగా... రైతుల వేదన
=వరి తెగుళ్ల నివారణకు పనికిరాని మందులు
=అనవసరమైన ఎరువులు అంటగట్టి మోసం
=వ్యవసాయ సిబ్బంది సమ్మెతో డీలర్ల హవా
సందట్లో సడేమియా అన్నట్టు.... ఇన్నాళ్లూ సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొనడంతో ఎరువుల వ్యాపారులు, డీలర్ల ‘పంట’ పండింది. రైతులకు సూచనలు చేసేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యమైంది. అవసరమైన మందులే కాదు... అనవసరమైనవీ అంటగట్టి కాసులు దండుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతను నిలువు దోపిడీ చేశారు. విధుల్లో చేరిన ఉద్యోగులు ఇకనైనా వీరి భరతం పట్టాలి. రైతుకు అండగా నిలబడాలి.
యలమంచిలి, న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ వ్యవసాయ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఎరువులు, క్రిమిసంహారక మందులమ్మే వ్యాపారులు, డీలర్లు రైతుల్ని నిలువు దోపిడీ చేశారు. వరి తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారే కరువవడంతో అమ్మకాలు పెంచుకోడానికి అవసరం లేని మందులను కూడా విక్రయించారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడంతో దుకాణాల తనిఖీ నిలిచిపోయింది. దీంతో డీలర్లు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
రైతులు ఒక తెగులుకు సంబంధించిన క్రిమిసంహారక మందు అడిగితే, అదొక్కటే పనిచేయదంటూ రెండు మూడు రెండు మూడు తెగుళ్లకు సంబంధించిన మందులు కలిపి ఇచ్చారు. కొందరు డీలర్లు పలు సంస్థల ప్రతినిధులను దుకాణాల వద్దే అందుబాటులో ఉంచారు. రైతులు వచ్చాక వారితోనే మందులు ఎలా పనిచేస్తాయో చెప్పించి విక్రయాలు పెంచుకున్నారు. కొన్ని దుకాణాల్లో పెద్దయెత్తున నకిలీ మందుల విక్రయాలు కూడా జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది ఖరీఫ్ వరినాట్లు ఆఖరులో పడటంతో ఆకుముడత, పొడతెగుళ్లు సోకుతున్నాయి. సాధారణంగా తెగుళ్లు సోకిన వరి నమూనాలను రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది వద్దకు తీసుకెళ్లి ఏ క్రిమిసంహారక మందును పిచికారీ చేయాలో తెలుసుకునేవారు. రైతులకు గ్రామాల్లో ఆదర్శ రైతులు కూడా రైతులకు పూర్తిగా సహకరించేవారు. వరి పంటకు తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు లేకపోవడం వల్ల పెద్దయెత్తున క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు.
వ్యాపారులు, డీలర్ల లాభాపేక్ష, అవగాహన లేమితో రైతులు పొడతెగులు సోకిన వరిపంటకు ఆకుముడత నివారణ మందులను వినియోగిస్తున్నారు. ఈ విధంగా రైతులు ఎకరా వరిపంటలో తెగుళ్ల నివారణకు రూ.800 నుంచి రూ.1000 వరకు అదనంగా ఖర్చు చేయవలసి వస్తోంది. వ్యవసాయశాఖ సూచనల ప్రకారం ఎకరా వరిపంటలో తెగుళ్ల నివారణకు కేవలం రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. క్రిమిసంహారక మందులను ఎక్కువగా వినియోగించడం వల్ల పంట దిగుబడి పడిపోవడమే కాకుండా పంట పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆకుముడత తెగులు సోకిన వరిపైనుంచి వెంపలి కంపను ఈడ్చాలని వ్యవసాయశాఖ సిబ్బంది సూచిస్తున్నారు. ఆ తర్వాత 2 మిల్లీలీటర్ల కర్తఫ్ హైడ్రోక్లోరిల్ను లీటరు కలిపి పిచికారీ చేయాలన్నారు. మందు స్ప్రే చేసే సమయంలో ఎరువులను వినియోగించరాదని సూచించారు. పొడతెగులుకు సంబంధించి పొలంలో, గట్లపై గడ్డిని పూర్తిగా తొలగించాలన్నారు.
ఈ తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల హెగ్జాకోనెజోల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించి శుక్రవారం నుంచి విధుల్లో చేరడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకనైనా వ్యవసాయ శాఖ సిబ్బంది వ్యాపారులపై నిఘా పెట్టాలని, తమకు సత్వరం వ్యవసాయ సూచనలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.