breaking news
Gunda Act
-
హత్యకేసు నిందితులపై గూండా చట్టం ప్రయోగం
హొసూరు : విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సూరి (సురేష్) దారుణ హత్య కేసులో ముగ్గురు నిందితులను క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి న్యాయస్థానంలో లొంగిపోయారు. విశ్వహిందూ పరిషత్ నేత సూరిని గత నెల 21వ తేదీ రాత్రి హొసూరు సమీపంలో నెహ్రూనగర్‌లో వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసులో నిందితుల కోసం ప్రత్యేక పోలీసు దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. అదే నెల 24వ తేదీ ఉదయం మత్తిగిరికి చెందిన బాబు, హొసూరుకు చెందిన సాజిత్ బాషా, హొసూరు శాంతినగర్‌కు చెందిన గజేంద్రలు కోర్టులో లొంగిపోయారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ముగ్గురు నిందితులను సేలం జైలుకు తరలించారు. జైలులో ఉంటున్న వీరిపై గూండా చట్టం ప్రయోగించాలని జిల్లా ఎస్పీ మహేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్ సి. కదిరవన్‌కు సిఫార్సు చేశారు. పరిశీలించిన కలెక్టర్ గూండా కేసుకు ఉత్తర్వలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం వీరిపై గూండా కేసు నమోదు చేశారు. -
గూండా యాక్ట్ కింద 31మంది అరెస్టు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్‌లో 31మందిని గూండా చట్టం కింద అరెస్టు చేశారు. వీరిలో ఓ గ్రామానికి చెందిన పెద్దమనిషి కూడా ఉన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోవద్దని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన వీరంతా గతంలో పలు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. హత్యలకు పాల్పడటం, కిడ్నాప్‌లు చేయడంవంటి పలు ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక వారిని విడిచిపెడతామని చెప్పారు. -
‘గూండా’ చట్టంపై వ్యతిరేకత
సాక్షి, చెన్నై: సైబర్ నేరాలు, లైంగిక దాడులను గూండా చట్టం పరిధిలోకి తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సవరణలను పీఎంకే అధినేత రాందాసు తీవ్రంగా ఖండించారు. ఆ సవరణల్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తిపై పలు కేసులు నమోదైనా, పలు సెక్షన్లు మోపినా, పలు మార్లు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినా వారిపై గూండా చట్టం ఇది వరకు నమోదు అయ్యేది. ఏడాది కాలం పాటుగా నాన్‌బెయిల్ వారెంట్‌గా ఉండేది. అయితే, ఇటీవల ఈ చట్టాల్ని పలు విధాలుగా ఉపయోగించే పనిలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పేట్రేగుతున్న సైబర్‌నేరాలు, మహిళలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యల్లో పడింది. ఇందులో భాగంగా సైబర్ నేరాలకు పాల్పడేవారిని, లైంగిక దాడులకు పాల్పడేవారిని గూండా చట్టం కింద అరెస్టుకు ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో ముసాయిదా సైతం దాఖలు చేసింది. అయితే, ఈ చట్టం లైంగిక దాడుల కేసుల్లో దుర్వినియోగం కావొచ్చన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు రాగానే, ఎలాంటి విచారణ లేకుండా ఈ సెక్షన్ నమోదవుతున్న దృష్ట్యా, వ్యతిరేకత మెుదలైంది. దుర్వినియోగం : పీఎంకే అధినేత రాందాసు శుక్రవారం ఓ ప్రకటనలో ఈ చట్టం నమోదును తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక దాడులు, సైబర్ నేరాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం ద్వారా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. తొలి సారిగా నేరం చేశాడంటూ ఒకరిపై ఫిర్యాదు వస్తే, విచారణ లేకుండా ఈ చట్టం నమోదు చేయడం వలన ఏడాది కాలం పాటు అతడు జైలుకు పరిమితం కావాల్సి ఉంటుందన్నారు. చివరకు అతడు నేరం చేయలేదని రుజువు అయితే, ఏడాది జీవితం వృథా అయ్యే పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణ తమ ఎమ్మెల్యే, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గురు మీద నమోదైన జాతీయ భద్రతా చట్టం, గుండా చట్టాల కేసును పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించారు. గురుపై మోపిన కేసులన్నీ చివరకు కోర్టులో కొట్టి వేశారని, అయితే, చేయని తప్పుకు ఆయన శిక్ష అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతి చట్టంలో లైంగిక దాడులకు మరెన్నో కఠిన శిక్షలు ఉన్నాయని, అలాంటప్పుడు చట్ట సవరణలతో గూండా చట్టం పరిధిలోకి లైంగిక దాడులు, సైబర్ నేరాలను తీసుకురావడం విచారకరంగా పేర్కొన్నారు. తన సవరణలను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.