breaking news
Granite factories
-
గ్రా‘నైట్’..రైట్‌రైట్!
చిత్తూరు అర్బన్: భూగర్భ గనులశాఖ (మైన్స్) పరిపాలన చిత్తూరు జిల్లాలో పూర్తిగా గాడి తప్పింది. సహజ ఖనిజాలను తవ్వుకున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ (ఖనిజాల రాయల్టీ) రుసుములను వసూలు చేయాల్సిన గనులశాఖ చేతులు పైకెత్తేసింది. అధికార పారీ్టకి చెందిన నాయకులు గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీల నుంచి దౌర్జన్యంగా సీనరేజ్ వసూలు చేసుకుంటుంటే వేడుక చూస్తోంది. కూటమి నేతలు వేసే బిస్కట్లకు ఆశపడ్డ కొందరు అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల సొమ్మును నేతల జేబుల్లోకి మళ్లిం చేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీ మామూళ్లు చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో గ్రానైట్ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. క్వారీల రూపంలో వీటిని దక్కించుకున్న వ్యక్తులు భూగర్భ గనులశాఖ పర్యవేక్షణలో గ్రానైట్ రాళ్లను తవి్వ, వాటిని ఫ్యాక్టరీల్లో కట్ చేయించి, పాలిష్ వేసి, ఆపై విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం చేయడానికి వ్యాపారులు క్యూబిక్ మీటరు గ్రానైట్‌కు వాటి రంగు ఆధారంగా స్లాబ్ పద్ధతుల్లో ప్రభుత్వానికి సీనరేజ్ రుసుములను చెల్లించాలి.రాఘవ కన్‌స్ట్రక్చన్స్ అనే కంపెనీ ఫ్యాక్టరీల నుంచి రుసుములు చెల్లించే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీతో ఈ కంపెనీకి రుసుములు వసూలు చేసుకునే కాల పరిమితి ముగిసింది. ప్రైవేటు కంపెనీ స్థానంలో మైన్స్ శాఖ, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. కానీ గత ఐదు నెలలుగా రుసుముల వసూళ్ల నుంచి మైన్స్ అధికారులను పక్కకు తోసేసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.. ఫ్యాక్టరీల నుంచి నెల నెలా బెదిరించి, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలుచేసి వారి జేబుల్లో వేసుకుంటున్నారు. ఇష్టారాజ్యం కొందరు క్వారీ యజమానులు గ్రానైట్ ఖనిజాన్ని దోచుకుంటున్నారు. భారీ మొత్తంలో గ్రానైట్ వెలికితీసి, అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11 గంటలు దాటితే చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో గ్రానైట్ స్మగ్లింగ్ జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆదాయానికి ఐడియా..!
జాతీయ రహదారులపై టోల్ వసూలు తరహాలోనే ఇక గ్రానైట్ ఉత్పత్తులకూ ఇకపై రుసుము వసూలు చేయనున్నారు. అందులో భాగంగా రాయల్టీ వసూళ్లకు టెండర్ల కోసం ప్రకటన కూడా జారీ చేశారు. దీనికి ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. గ్రానైట్ గనుల నుంచి పెద్ద మొత్తంలో ముడిరాయి రాయల్టీ చెల్లించకుండానే సరిహద్దు దాటిపోతోందని వివిధ రకాల నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.వందల కోట్లలో ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలోనే దొంగ చేతికి తాళం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి, ఒంగోలు: జిల్లాలో అన్ని రకాల ఖనిజాలకు సంబంధించి మొత్తం ఎనిమిది మైనింగ్ లీజులు, 526 క్వారీ లీజులు ఉన్నాయి. అన్ని రకాల ఖనిజాలకు సీనరేజి వసూళ్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల ఖనిజాలకు రాయల్టీ వసూలు కొన్ని రకాల శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలించింది. బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, బల్లాస్ట్, మొరం, గ్రావెల్ ఆర్డినరీ ఎర్త్ మినహా అన్ని రకాల మైనర్ మినరల్స్‌కు సీనరేజి రుసుం వసూలు, ఇతర చార్జీలు, పన్నుల వసూలు కోసం టోల్ వసూలు తరహా కాంట్రాక్టర్ల ఎంపికకు బిడ్స్ పిలిచింది. జిల్లా పరిధిలో 272 క్వారీలు జిల్లా పరిధిలో 272 క్వారీల నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇక సీనరేజి రుసుం వసూలు ప్రైవేటు వ్యక్తులే చేయనున్నారు. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ 141 లీజులు, బ్లాక్ గ్రానైట్ క్వారీ లీజులు 60, కలర గ్రానైట్ లీజులు 71 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా భూగర్భ గనులశాఖ ఒంగోలు ఏడీ కార్యాలయం పరిధిలో రూ.360 కోట్లు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.3 కోట్లు రాయల్టీ ద్వారా ఆదాయం వస్తోంది. వీటికి 20 శాతం అదనంగా చేర్చి టెండర్ బిడ్ పిలిచినట్లు అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. జిల్లాలో అత్యధిక రాయల్టీ భూగర్భ గనుల శాఖ ఒంగోలు సహాయ సంచాలకుని కార్యాలయం పరిధిలోనే ఉంది. రాయల్టీ వసూలు ఇక ప్రైవేటు పరం కానున్న నేపథ్యంలో క్లస్టర్లను నిర్ణయించారు. ఒక వేళ జిల్లా మొత్తానికి ఒకే టెండర్ బిడ్ రాకపోతే క్లస్టర్లకు విడివిడిగా టెండర్లను పిలవడానికి వీలుగా క్లస్టర్లను నిర్ణయించారు. ఒంగోలు, మార్టూరు, మార్కాపురం, చీమకుర్తి క్లస్టర్లుగా నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రానైట్ నుంచి మాత్రమే సీనరేజి వసూలు చేయాలని నిర్ణయించారు. సీనరేజితో పాటు ఆదాయపన్ను, డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్, నెట్ చార్జీలు కూడా టెండర్ దక్కించుకున్న వారే వసూలు చేయాలి. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం పేరొందిన సంస్థలు, వ్యక్తుల నుంచి డిపార్టుమెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్ వేలం ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. ప్రయోగాత్మకంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు. ప్రకాశంలో గెలాక్సీ గ్రానైట్, కలర్, బ్లాక్ గ్రానైట్ ఖనిజాలు ఉన్నాయి. గెలాక్సీ మినహా కలర్, బ్లాక్, చిత్తూరు రెడ్ వంటి రకాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఎంఎస్టీసీ లిమిటెడ్ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఎస్టిసిఈసిఓఎంఎంఇఆర్సిఇ డాట్ కామ్) లేదంటే డిపార్టుమెంట్ ఆప్ మైన్స్ అండ్ జియాలజి వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఐఎన్ఈఎస్ డాట్ ఏపి డాట్ జీవోవి డాట్ ఇన్)లో వివరాలు పొందు పరిచారు. బిడ్స్ దాఖలు చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉంది. రూ.450 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, కనిగిరి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్ గనులు ఉన్నాయి. ఏటా ఒంగోలు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.380 కోట్ల వరకు రాయల్టీ రుసుం వసూలవుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారుల నివేదికలో రాయల్టీ రూపంలో జమవుతున్నదాని కన్నా రెట్టింపు దొడ్డిదారిన పోతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానం తరహాలోనే గ్రానైట్ రాయల్టీ రుసుం వసూలుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి రూ.450 కోట్లకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు నెలకున్నాయి. జిల్లాలో ఇప్పటికే డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.558 కోట్లు ఉంది. రూ.101.78 కోట్లతో 992 పనులు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 55 శాతం నిధులతో కమ్యూనిటీ బెన్ఫిట్ వర్కులు, 40 శాతం నిధులతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు నిధులు కేటాయించారు. కమ్యూనిటీ బెన్ఫిట్ విభాగంలో విద్య, అంగన్వాడీ భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ విభాగానికి, ఆరోగ్యం, తాగునీటి సరఫరాకు, పారిశుద్ధ్య పనులకు నిధులను కేటాయించారు. మిగిలిన 40 శాతం నిధులతో సిమెంట్ రహదారులు, మురుగునీటి పారుదలకు కాలువల నిర్మాణానికి, నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించారు. ఇక మీదట డీఎంఎఫ్ చార్జీలు కూడా సంబంధిత కాంట్రాక్టర్లే వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో గ్రానైట్ సీనరేజి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రంగాల్లోని వ్యాపారులు సీనరేజి వసూలుకు ప్రభుత్వ మార్గదర్శకాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. -
పరిశ్రమలకు ‘చంద్ర’గ్రహణం
ఒకే అబద్ధాన్ని పలు మార్లు చెప్పి జనాన్ని నమ్మించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆలూచూలూ లేకుండానే రూ.లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసిన బాబు సర్కార్ వాస్తవానికి ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పిన పాపానపోలేదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువై గతంలో ఉన్న పాత పరిశ్రమలు సైతం మూతపడగా మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. పర్యవసానంగా బాబు సర్కారు చెప్పినట్లు లక్షలాది మందికి కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు సైతం పోగొట్టుకుని రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం చేపట్టగానే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని చంద్రబాబు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేశారు. అయితే ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించడం మినహా ఇప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్న మూడు, నాలుగు సంస్థలు సైతం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా నీరు, పోర్టు, రోడ్లు, విమానాశ్రయం లాంటి సౌకర్యాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క పరిశ్రమను నెలకొల్పకపోయినా బాబు ప్రభుత్వం మాత్రం ఎంఓయులు లెక్కగట్టి లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం. పారిశ్రామికవేత్తల వెనుకడుగు కందుకూరు మండలం కోవూరు వద్ద రంగా ఫర్టికల్ బోర్డు(ఆగ్రో బేస్డ్ సంస్థ) ఏర్పాటవుతుందని చెప్పారు. దీంతో పాటు మద్దిపాడు మండలం గుళ్లాపల్లి వద్ద బీబీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(మినరల్ బేస్డ్) పొన్నలూరు మండలం వేలటూరు వద్ద వీఎస్ఎల్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, వెలిగండ్ల మండలం మొగళ్లూరు వద్ద ఆర్కేఎస్ టెక్నో విజన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (పవర్ జనరేషన్), పొదిలి మండలం ఓబులక్కపల్లి వద్ద స్ప్రింగ్‌బీ డెయిరీ ప్రోడక్ట్ (ఫుడ్ అండ్ ఆగ్రో) తదితర పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు బాబు సర్కారు ప్రకటించింది. ఇదే తరహాలో జాసన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్), మోహన్ వెల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండస్ట్రియల్ పార్కు), రంగా ఫర్టికల్ బోర్డు, చైనాకు చెందిన కన్సార్టియం ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు, తమిళనాడుకు చెందిన మోహన్ సింటెక్స్ టెక్స్టైల్స్ తదితర కంపెనీలు జిల్లాలో దొనకొండ, ఇతర ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమల కోసం దొనకొండ మండలంలోని పలు గ్రామాలలో 25,886 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 2450 ఎకరాలను ఎపీఐఐసీకి బదలాయించారు. ఉక్రెయిన్ దేశానికి చెందిన టైటాన్ ఏవియేషన్ ప్రతినిధులు యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్ల తయారీకి, పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు నిమిత్తం మొదట మూడు విడుతలుగా పరిశీలించారు. రూ.500 కోట్లతో, 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 6,200 ఎకరాల భూములు అడిగారు. రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో ఎంఎస్ వైట్ స్టోన్, కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా వారి ఆర్థిక సహాకారంతో రష్యా, ఉక్రెయిన్ దేశ సాంకేతిక సహకారంతో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు అప్పట్లో చెప్పారు. 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. స్పెయిన్ దేశానికి చెందిన ఇండియానా కంపెనీ వాహనాల పరిశోధన కేంద్రం వారు రూ.1500 కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 500 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మేకింగ్ ఏపీలో భాగంగా యాంటనోఫ్ ఫర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ముడిసరుకు రవాణా సంస్థ ఎన్డీఆర్ సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నూతనంగా 400 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరూ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. రామాయపట్నం ఊసేది జిల్లాలో రామాయపట్నం నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పోర్టును పట్టించుకోలేదు. తీరా ఎన్నికల వేళ రూ.4,500 కోట్లతో రామాయపట్నం పోర్టును నిర్మిస్తున్నట్లు చంద్రబాబు శంఖుస్థాపన రాయి వేశారు. దీంతో పాటు రూ.24500 కోట్లతో ఏషియన్ పేపర్ పల్ప్ పరిశ్రమకు సైతం బాబు శంఖుస్థాపన చేశారు. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా పనుల్లో పురోగతి లేదు. పరిశ్రమలు ముందే పూర్తి చేసి ఉంటే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. ప్రాభవం కోల్పోతున్న పలకల పరిశ్రమలు ఒకప్పుడు వైభవంగా విరాజిల్లిన మార్కాపురం పలకల పరిశ్రమ ఆదరణ కరువై మూత దశకు చేరుకుంది. మార్కాపురం పట్టణ శివారులో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ పరిశ్రమ నడుస్తోంది. ఏడెనిమిదేళ్ల క్రితం 100 ఫ్యాక్టరీలతో 12 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమ ప్రస్తుతం కేవలం 45 చిన్న పరిశ్రమలతో 4 వేల మందికి కూడా పని కల్పించలేని పరిస్థితికి చేరుకుంది. విద్యుత్ బిల్లులు పెరగడం, బ్యాంకు రుణాలు అందకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువవడంతో పలకల పరిశ్రమ మూతపడే స్థితికి చేరింది. కష్టాల్లో కూరుకుపోయిన గ్రోత్ సెంటర్లు కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద 1992లో ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేశారు. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో 131.6 ఎకరాలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో 32.6 ఎకరాలు చొప్పున మొత్తం 164 ఎకరాల భూములు కేటాయించింది. 2007లో వీటికి సంబంధించి 110 ప్లాట్లు వేశారు. వైఎస్ హయాంలో ఇక్కడ 45 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీలు, పండ్లు కూలింగ్ యూనిట్లు, పచ్చిపండ్లను మాగపెట్టే యూనిట్లు, ఐస్ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల పాలనలో సింగరాయకొండ గ్రోత్ సెంటర్లో ఒక్క పరిశ్రమ రాలేదు. పసుపు, కారం పొడి ప్యాకింగ్ ఎక్స్‌పోర్ట్స్ యూనిట్లతో పలు పరిశ్రమలు ఇక్కడకు వస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. మరోవైపు గతంలో ఎకరం లక్ష రూపాయలకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎకరం రూ.50 లక్షలు చెబుతున్నారు. పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారంతో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. గ్రోత్ సెంటర్లో భూముల వివాదం వల్లే పరిశ్రమలు రావడం లేదని తెలుస్తోంది. ఇక్కడి భూములు తమవేనంటూ తొలుత ఎండోమెంట్ విభాగం వివాదం లేవనెత్తింది. ఇందుకోసం ఏపీఐఐసీ పోరాటం చేయాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తల పోరాటంతో ఎట్టకేలకు ఎండోమెంట్ విభాగం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ ఆ భూములు తమవేనంటూ మరో వివాదం లేవనెత్తింది. వరుస వివాదాలతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పన్ను రూపంలో వసూళ్లు గ్రోత్ సెంటర్లో పరిశ్రమ ఏర్పాటు చేసిన స్థలాన్ని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అధికారులు వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ.7 లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు 20 ఏళ్లుగా ఇదే వ్యవహారం సాగిస్తున్నారు. ఈ నిధులతో ఇండస్ట్రియల్ ఏరియాలో కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ఆ దాఖలాలు మాత్రం లేవు. దీంతో ఇండస్ట్రియల్ ఏరియా చిల్లచెట్లు, మురుగుతో అధ్వానంగా తయారైంది. గుళ్లాపల్లిలో 40 పరిశ్రమలు మూత మద్దిపాడు మండలంలోని గుళ్లాపల్లి వద్ద 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో 1,271 ఎకరాల్లో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేశారు. 644 ప్లాట్లు వేసి పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. వైఎస్ హయాంలో ఇక్కడ 400 పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా 250 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లతో పాటు పలురకాల పరిశ్రమలు ఏర్పాటుయ్యాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఇక్కడకు భారీ పరిశ్రమలు రాలేదు. గడిచిన నాలుగేళ్లలో పది గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు మాత్రమే ఏర్పాటు కాగా 40 పరిశ్రమలు మూతపడటం గమనార్హం. జీఎస్టీ 28 శాతానికి పెంచటం, విద్యుత్ చార్జీలు మరింత భారం కావడంతోపాటు పారిశ్రామిక రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో రాయల్టీలో 40 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు సర్కారు పైసా ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. వైఎస్సార్ హయాంలో రాయల్టీపై రాయితీ 2008–09 నుంచి ఆర్థిక మాంద్యం కారణంగా జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్ క్వారీలు నష్టాలలో కూరుకుపోయి మూతపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో నాటి సీఎం దివంగత వైఎస్సార్.. క్వారీల యజమానులు గ్రానైట్ రాళ్లపై ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీపై మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీ ఇచ్చి ఆదుకున్నారు. దీంతో చీమకుర్తిలో 75 వరకు రన్నింగ్ కండిషన్లో ఉన్న గ్రానైట్ క్వారీలతో పాటు 300 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లకు కూడా మేలు కలిగింది. గ్రానైట్ పరిశ్రమలకు జగన్ భరోసా పాదయాత్రలో భాగంగా చీమకుర్తిలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి అప్పులు తెచ్చి కట్టిన గ్రానైట్ ఫ్యాక్టరీలు నడపలేక మూతపడుతున్నాయని యజమానులు విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీల యజమానులు క్వారీల వద్ద కొనుగోలు చేసే గ్రానైట్ రాయల్టీపై 40 శాతం రాయితీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీల్లో కూడా రాయితీ ఇస్తానని భరోసా ఇచ్చిరు. తద్వారా 1,200 గ్రానైట్ ఫ్యాక్టరీలకు మేలు కలగనుంది. పారిశ్రామిక రాయితీలకు సర్కారు ఎగనామం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన చట్టప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు ఐదేళ్లపాటు జిల్లాలో నెలకొల్పబోయే పరిశ్రమలకు 15 శాతం తరుగుదల పన్ను, పరిశ్రమ ప్లాంట్, కొత్త యంత్రాల వ్యయంపై 15 శాతం పెట్టుబడి అలవెన్సు ఇవ్వాల్సి ఉన్నా అవేవి అందడం లేదు. జిల్లాలో 60 శాతం పరిశ్రమలు మూత ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలివ్వకపోవడంతో ఇటీవల కాలంలో పరిశ్రమలు ముందుకు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. జీఎస్టీ వచ్చాక అదనపు పన్నులు వేయడం, విద్యుత్ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచడం తదితర కారణాలతో బ్యాంకు కిస్తీలు కూడా చెల్లించలేక చిన్న పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నాయి. పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 85 పెద్ద, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. రూ.2,928.80 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన ఈ పరిశ్రమల ద్వారా 22,093 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెబుతున్నారు. ఇవి కాక జిల్లా వ్యాప్తంగా 7,593 చిన్న పరిశ్రమలున్నాయి. రూ.2,040.93 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల ద్వారా 81,277 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇందులో 60 శాతం పరిశ్రమలు(సుమారు 4 వేలు) మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. విద్యుత్ బిల్లులతో పాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన కంతులు చెల్లించలేక ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. 70 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి ప్రస్తుతం ఇండస్ట్రీస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కొంతమేర మాత్రమే చిన్న పరిశ్రమలకు వచ్చాయి. రావాల్సిన సబ్సిడీలు ఇతరత్రా రాయితీలపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. జీఎస్టీ మరింత ఇబ్బందికరంగా మారింది. 70 శాతం పరిశ్రమలు మూత దశకు చేరుకున్నాయి. – కొమ్మి కృష్ణయ్య, వెంగమాంబ గ్రానైట్ యజమాని నష్టపోతున్నాం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్లాటు తీసుకుని గ్రానైట్ ఇండస్ట్రీ స్థాపించా. జీఎస్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నుల కారణంగా ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. ఉత్పత్తికి తగ్గట్లు డిమాండ్ లేకపోవడంతో పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. దీంతో భారీగా నష్టపోతున్నాం. దీనికి తోడు పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. – సయ్యద్ నజీర్, నాసా గ్రానైట్స్ అధినేత, సింగరాయకొండ ఉద్యోగం లేదు.. భృతి లేదు మార్కాపురం ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో మూడేళ్ల కిందట వివరాలు నమోదు చేసుకున్నా. ఒక్కసారి కూడా ఉద్యోగానికి రమ్మని కాల్ లెటర్ పంపలేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో నాలాంటి యువత అంతా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఐదేళ్ల క్రితం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది కూడా ఇటీవల కొంత మందికే ఇచ్చారు. – నాలి బాలగురవయ్య, బీఏ, మార్కాపురం -
రక్తం మరిగిన రాళ్లు..
♦ చీమకుర్తిలో మరణ మృదంగం మోగిస్తున్న గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ♦ నిర్లక్ష్యంగా యాజమాన్యాలు.. స్పందించని అధికారులు ప్రకాశం: గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. వాటిలో పనిచేస్తున్న కూలీల పాలిట శాపంగా మారింది. క్వారీలు, ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో పాటు అధికారులు తనిఖీలు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలకు గురవుతూ కార్మికులు మృత్యువాతపడుతున్నారు. గ్రానైట్ రవాణా సమయంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు. వీటికితోడు గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో అనుమానాస్పదస్థితిలో కూడా అనేక మంది కూలీలు చనిపోతుండటం విశేషం. ఇటీవలే ముగ్గురు మృతి... ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ నెల 21న హంస మినరల్స్ అండ్ ఎక్స్‌పోర్ట్‌లో గ్రానైట్ స్లాబులను కంటైనర్‌కు లోడుచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి బీహార్‌కు చెందిన బసంత్ సాహిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు మర్రిచెట్లపాలెంలో బీహార్‌కు చెందిన నీరజ్కుమార్సింగ్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతిచెందాడు. అదే గ్రామంలోని మరో గ్రానైట్ ఫ్యాక్టరీలో మిషన్ స్విచ్ ఆన్‌చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టి పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన ఇనగంటి నాగరాజు మరణించాడు. ఇలాంటి ప్రమాదాలు చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీల్లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సరాసరిన వారానికి ఒకరిద్దరు, నెలకు నలుగురైదుగురు, ఏడాదికి 60 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలూ అధికమే... ఒంగోలు – కర్నూలు రోడ్డుపై చీమకుర్తి–ఒంగోలు మధ్య నిత్యం గ్రానైట్ రవాణాతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి కూలీలతో పాటు ప్రయాణికులు మృతిచెందుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థాని కులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. చీమకుర్తిలో కొత్తగా వేసిన బైపాస్ రోడ్డును ఇంకా ప్రారంభించలేదు. కానీ, దానిపై వారం రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్ర మాదంలో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బూనూరి రమాదేవి, ఉప్పుచర్ల వెంకటేశ్వర్లు, దేవరపల్లి ఆదినారాయణమ్మలు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఈ ఘటన మరవకముందే రెండురోజుల క్రితం కర్నూలు రోడ్డులోని రామతీర్థం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్లామల్లికి చెందిన కేసర వీరారెడ్డి మృతిచెందాడు. ఆయనతో పాటు బైకుపై వచ్చి ప్రమాదానికి గురైన గురువులు తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరా డుతున్నాడు. ఇలా చెప్పుకుంటూపోతే.. చీమకుర్తి పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య కొండవీటి చాంతాడంత ఉంది. నేరుగా ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్యే ఇలా ఉంటే.. మృతికి కారణం అంతుబట్టకుండా అనుమానాస్పదస్థితిలో మృతి చెందుతున్న వారూ అధికంగానే ఉంటున్నారు. సాగర్ కాలు వల్లో శవమై తేలడం, నిరుపయోగంగా ఉన్న గ్రానైట్ గుంతల్లో చనిపోయి పడి ఉండటం, కాలువ కట్టలు, రామతీర్థం పరిసరాల్లో ఉండే కొండలు, లోయల్లో మృతదేహాలై కనిపించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. మూడొంతుల మంది ఇతర రాష్ట్రాల వారే... పొట్టచేతబట్టుకుని పిడికెడు మెతుకుల కోసం రామతీర్థం, చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం పరిసరాల్లో ఉండే గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు అధికంగా వస్తుంటారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే. వాటిలో సహజంగా జరిగే ప్రమాదాలు కొన్నయితే.. ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రమాదాలు మరికొన్ని. ఉద్దేశపూర్వకంగా జరిగిన వాటిని కూడా సహజ ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులే ఇక్కడి ప్రమాదాల్లో ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు. వారి తరఫున ప్రశ్నించేవారు లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధిత కుటుంబానికి ఎంతోకొంత నగదు ముట్టజెప్పి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు సమాచారం.