government and private hospitals
-
ప్రభుత్వ ఆస్పత్రులు ప్రవేటుకు..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అనుసంధానించాలని, తద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వాటిని నిర్వహించాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ మేరకు ప్రజాభిప్రాయం కోరింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే, దానికి అనుబంధ ఆసుపత్రిని నెలకొల్పడం అత్యంత కష్టమైన వ్యవహారం. ఎంతో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా రోగులను ఆయా ప్రైవేటు బోధనాసుపత్రులకు తీసుకురావడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య నాసిరకంగా ఉంటుందన్న భావన అందరిలోనూ నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విముక్తి కలిగించే నూతన ప్రతిపాదనను నీతి ఆయోగ్ ముందుకు తెచ్చింది. ప్రస్తుతం గుజరాత్, కర్ణాటకల్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అప్పగించిన విషయాన్ని నీతి ఆయోగ్ ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసే విషయాన్ని చర్చకు తీసుకువచ్చింది. వైద్యుల కొరతను తీర్చేందుకేనంటూ... అర్హత కలిగిన వైద్యుల కొరతను తీర్చడమే పీపీపీ పద్ధతి లక్ష్యమని నీతి ఆయోగ్ తెలిపింది. ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా 600 పడకలతో బోధనాసుపత్రి ఏర్పా టు చేయడం ఖర్చుతో కూడుకున్నది. దీంతో అనేకమంది ఔత్సాహికులు ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో మెడికల్ సీట్ల కొరత వేధిస్తుందనేది నీతి ఆయోగ్ ఉద్దేశమని వైద్య నిపుణులు అంటున్నారు. తెలంగాణలో అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అవసరంలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. -
విజృంభిస్తున్న మలేరియా, డెంగీ జ్వరాలు
జనవరి నుంచి ఇప్పటివరకు 1,281 కేసులు నమోదు * ఈ వారంలోనే 36 డెంగీ కేసుల నిర్ధారణ * ఇతర జ్వరాలు నాలుగున్నర లక్షలు పైనే నమోదు * కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనం జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వాటితో బెంబేలెత్తుతున్నారు. అలాగే టైఫాయిడ్, అతిసార, కామెర్లు వంటివీ ప్రజలను కలవరపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1,210 మంది మలేరియా బారిన పడితే... డెంగీతో 71 మంది, చికున్ గున్యాతో 26 మంది బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కించింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 36 డెంగీ కేసులు నమోదు కాగా అందులో 13 కేసులు హైదరాబాద్‌లోనే రికార్డు కావడం గమనార్హం. ఇవేకాకుండా ఈ ఏడాది 4.5 లక్షల మంది ఇతర రకాల జ్వరాల బారిన పడినట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. అందులో జూన్, జూలై నెలల్లోనే ఏకంగా 2 లక్షల మందికి జ్వరాలు వచ్చినట్లు నమోదైంది. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడం... పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పట్టణ, పల్లె ప్రాంతాలు అత్యంత అపరిశుభ్రమైన దుస్థితికి వెళ్లడంతో పరిస్థితి ఘోరంగా మారింది. హైదరాబాద్ నగరంతోపాటు ఆదిలాబాద్ గిరిజన పల్లెల వరకూ వ్యాధుల తీవ్రత మరింత పెరిగింది. మూడు జిల్లాల్లో అత్యధిక కేసులు... గిరిజన ప్రాంతాలున్న ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా 647 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 186, వరంగల్ జిల్లాలో 139 కేసులు రికార్డు అయ్యాయి. ముఖ్యంగా ఆయా జిల్లాల్లోని గిరిజన పల్లెలు మలేరియా సహా ఇతర జ్వరాలతో వణికిపోతున్నాయి. తెలంగాణలో సుమారు 2 వేల మలేరియా పీడిత గ్రామాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 870, వరంగల్‌లో 110, మహబూబ్‌నగర్‌లో 20 గ్రామాలున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విషజ్వరాల పరిస్థితి ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. మరోవైపు అత్యధికంగా హైదరాబాద్‌లో 85 వేల మందికిపైగా జ్వరాల బారినపడ్డారు. అందులో ఎక్కువ జ్వరాలు జూన్, జూలై నెలల్లోనే నమోదైనట్లు చెబుతున్నారు. మెదక్ జిల్లాలోనూ 70 వేల మందికి పైగా జ్వరాల బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరో రెండు నెలలపాటు వ్యాధుల సీజన్ ఉండటంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని అంటువ్యాధుల నివారణ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. మలేరియా నిర్ధారణ కిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచామన్నారు. అవసరమైన మందులను సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు. -
డెంగీ భయం !
జిల్లాలో ‘డెంగీ’ వ్యాధి పొంచి ఉందా...రెండేళ్ల కిందట వణికించిన ఈ మహమ్మారి తిరిగి జిల్లాలో కోరలు చాచనుందా....ప్రస్తుతం ఊరూరా ప్రబలిన జ్వరాలన్నీ డెంగీ ఛాయలేనా...గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే విషజ్వరాలు దూకుడుగా వ్యవహరిస్తాయా ... రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోతే ప్రాణాలకు ముప్పేనా...ఇవీ ప్రస్తుతం జిల్లాలోని రోగుల్లో తలెత్తుతున్న అనుమానాలు, భయాందోళనలు. పల్లెలు, పట్టణాల్లో జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో రోగులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. వైద్యులు సైతం అవి సాధారణ జ్వరాలా, లేక డెంగీ జ్వరాలా అనేది తేల్చలేకపోతున్నారు. - జిల్లాను వణికిస్తున్న జ్వరాలు - పట్టణాల్లో కిక్కిరిసిన ఆసుపత్రులు - ధనార్జనే ధ్యేయంగా రోగులను పిండేస్తున్న వైద్యులు - నిమ్మకు నీరెత్తినట్టుగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు - గ్రామాల్లో కొరవడిన పారిశుద్ధ్యం సాక్షి, గుంటూరు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. అధిక శాతం మందికి రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతుండటంతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. వారికి డెంగీ ఉందా లేదా అనే విషయం మాత్రం వైద్యులు చెప్పలేకపోతు న్నారు. ప్రజలు డెంగీ జ్వరాలపై భయాందోళనకు గురి కాకుండా సరైన వైద్యులను ఆశ్రయించి చికిత్స చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఫిజీషియన్లు సలహా ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అధికారికంగా పది డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో కొరవడిన పారిశుద్ధ్యం ►గ్రామాల్లో పారిశుద్ధ్యం కొరవడి జ్వరాలు వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా ఓ కారణం గా వైద్యులు చెపుతున్నారు. ►గ్రామాల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్త, చెదారం లేకుండా చూడడం, మురుగు నీరు నిల్వలేకుండా చూడాలని వైద్యులు సూచన చేస్తున్నారు. లేని పక్షంలో జ్వరాల బా రిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. నివారణ చర్యలపై దృష్టి పెట్టని వైద్య ఆరోగ్య శాఖ... ►వర్షాకాలం జ్వరాల సీజన్ అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ►గ్రామాల్లో ఏఎన్ఎంల ద్వారా జ్వర పీడితుల రక్త సేకరణ జరిపి వారికి ఎలాంటి జ్వరం వచ్చింది, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలనే వాటిపై దృష్టి సారించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏమీ పట్టనట్లు కూర్చున్నారని ప్రజలు మండి పడుతున్నారు. డెంగీని బూచిగా చూపి రక్తాన్ని పీల్చేస్తున్నారు ►జ్వరాల బారిన పడిన రోగులు ఆసుపత్రికి రాగానే కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా డెంగీ సోకిందని, ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు సమాచారం. ►ఎలిసా పరీక్ష నిర్వహించకుండానే డెంగీగా నిర్ధారిస్తూ వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తొమ్మిది డెంగీ అనుమానిత కేసులు నమోదు ... జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది డెంగీ అనుమానిత కేసులు నమోదయ్యాయి. నిర్ధారణ కోసం రక్త నమూనాలు ల్యాబ్‌లకు పంపించాం. రేపల్లెలో నమోదైన కేసు డెంగీ కాదు. అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ నిర్వాహకులు తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్ల డెంగీ గా భావించారు. జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, డీఎంహెచ్ఓ