breaking news
gooty won
-
అనంత ప్రీమియర్ లీగ్లో గుత్తి విజయం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో నిర్వహిస్తున్న అనంత ప్రీమియర్ అండర్–16 క్రికెట్ పోటీల్లో గుత్తి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం గుత్తి రైల్వే క్రీడా మైదానంలో గుత్తి, కొనకొండ్ల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొనకొండ్ల జట్టు 92 పరుగులకే కుప్పకూలింది. గుత్తి బౌలర్ ఇమ్రాన్ 5 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుత్తి జట్టు 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి విజయం సాధించింది. వచ్చే ఆదివారం చివరి రౌండ్ లీగ్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. -
కొనసాగుతున్న ఫుట్బాల్ లీగ్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా వ్యాప్తంగా ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫుట్బాల్ లీగ్ క్రీడా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గుత్తిలోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఆదివారం గుత్తి, కళ్యాణదుర్గం జట్లు తలపడ్డాయి. అండర్–13, 15 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అండర్–13 విభాగంలో గుత్తి జట్టు కళ్యాణదుర్గం జట్టుపై 7–0 తేడాతో విజయం సాధించింది. జట్టులో సుభాష్–6, కిరణ్–1 గోల్స్ సాధించారు. అండర్–15 విభాగంలో గుత్తి జట్టు కళ్యాణదుర్గం జట్టు పై 5–0 తేడాతో గెలిచింది. జట్టులో రంగ–3, సాయి–2 గోల్స్ సాధించారు. ఈ నెల 11 నుంచి నగరంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో జిల్లాస్థాయి ఫుట్బాల్ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు.