breaking news
G.H.M.C
-
‘గ్రేటర్’లో ఉత్కంఠ
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర మంత్రిమండలి తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పలు చర్చలు జోరుగా సాగాయి. జీహెచ్ఎంసీలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే దానిపై గురువారం ఉద్యోగులు, సిబ్బందిలో ఉత్కంఠ నెలకొంది. నగరంలోని ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో దాదాపు పది వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరిలో ఉన్నతాధికారుల్లో ఎక్కువమంది డిప్యుటేషన్లపై పనిచేస్తుండటంతో వారంతా ఇక ఇక్కడే ఉంటారా? వారి ప్రాంతాలకు వెళ్లిపోతారా? అనే చర్చలు మొదలయ్యాయి. కీలక పోస్టుల్లోని కమిషనర్, అడిషనల్, జోనల్ కమిషనర్ల పోస్టుల్లో ఇప్పటి వరకు తెలంగాణ వారికి తగిన ప్రాధాన్యం లేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడంతో తమ పరిస్థితేమిటనే యోచనలో తెలంగాణేతర అధికారులున్నారు. ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకునే వెసులుబాటు ఉన్నా.. ఎటు మొగ్గు చూపాలో చెప్పే పరిస్థితి లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్నవారు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు. తమ ఉద్యోగాలు ఇక రెగ్యులర్ అవుతాయన్న ఆనందం తెలంగాణకు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ నోట్ ఆమోదంపై జీహెచ్ఎంసీలో మిశ్రమ స్పందన కనిపించింది. -
అయోమయం..ఆందోళన
సాక్షి, సిటీబ్యూరో: ఒక్క హడావుడి నిర్ణయం.. అయోమయానికి, ఆందోళనకు దారి తీసింది. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా హడావుడిగా జీహెచ్ఎంసీలో విలీనం.. ‘అభివృద్ధి’తో ఆకట్టుకోవాలనుకున్న అధికారుల ఆత్రుతకు మేయర్ కళ్లెం.. విలీనమైన 35 పంచాయతీల్లో కొన్ని గ్రామాల విలీనాన్ని రద్దు చేస్తూ తాజాగా కోర్టు స్టే.. వరుస పరిణామాల నేపథ్యంలో ఇటీవల గ్రేటర్లో విలీనమైన గ్రామాల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఆయా గ్రామాల్లో ఎలాంటి పనులు జరుగక జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అభిప్రాయాల్ని, జీహెచ్ఎంసీ పాలక మండలి తీర్మానాన్ని తోసిరాజని శివార్లలోని 35 గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనం చేయడం తెలిసిందే. విలీన జీవోలు వెలువడ్డాయో లేదో.. అధికార యంత్రాంగం ఆయా గ్రామాలపై పడి, ప్రజల ఆందోళనలను పట్టించుకోకుండా రికార్డుల్ని స్వాధీనం చేసుకుంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజా వ్యతిరేకతను పారదోలాలని భావించినా.. చివరకు చుక్కెదురైంది. నిధుల విడుదలకు బ్రేక్.. కౌన్సిల్ తీర్మానాన్ని సైతం తుంగలో తొక్కి ప్రభుత్వం విలీన ప్రక్రియను పూర్తి చేయడాన్ని జీర్ణించుకోలేని పాలకమండలి.. తమ ఆమోదం లేని గ్రామాల్లో తమ నిధులతో అభివృద్ధి పనులు చేయరాదని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నిధులతో విలీన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయరాదని ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మేయర్ మాజిద్ కమిషనర్ కృష్ణబాబుకు సూచించారు. తనకున్న అధికారంతో మేయర్ నిధుల విడుదలకు బ్రేక్ వేశారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ఇబ్బందులు.. తాజా పరిణామాల నేపథ్యంలో విలీన గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి. దాంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. జీహెచ్ఎంసీలో విలీనమైనప్పటికీ, పంచాయతీ సిబ్బందిని అక్కడే ఉంచారు. పంచాయతీల్లో ప్రస్తుతమున్న సామాగ్రి, సిబ్బందితోనే పనులు చేయాలని అధికారులు సూచించారు. సిబ్బంది ఉన్నా.. విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం, తదితర పనుల నిర్వహణకు అవసరమైన నిధుల్లేవు. అత్యవసర నిధుల కింద ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల వంతున మంజూరు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించినా విడుదల కాలేదు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఎవరివ్వాలో తెలియక అవి ఆగిపోయాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలదీ అదే పరిస్థితి. పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ జీతాలు నిలిపివేసింది. దాంతో, గత నెల జీతాలందలేదు. ఈ నెల సైతం వస్తాయో, రాదో తెలియని పరిస్థితి నెలకొంది. -
100 కోట్లు మటాష్
ఇది ఆమ్స్టర్డ్యాంలోని ఒక రోడ్డు. గుంతలు మచ్చుకైనా లేవు. పక్కనే ఉన్నది గ్రేటర్‌లోని మలక్‌పేట రోడ్డు. వేసి మూణ్నాళ్లు కూడా కాలేదు. అప్పుడే ఇలా.. కారణం వర్షాలట. ఇదీ రోడ్ల నాణ్యత లేమికి అధికారులు చెబుతున్న కుంటిసాకు. ఆమ్స్టర్డ్యాంలోనూ ఏడాది పొడవునా వర్షాలు పడతాయి. వేసేది బీటీ రోడ్లే. అయినా ఎందుకంత తేడా? ...ఇదీ ఇటీవల ఆమ్స్టర్డ్యాంకు అధికారిక పర్యటనకు వెళ్లిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ఆలోచనలో పడేసిన అంశం. కారణాలు సుస్పష్టం.. పాలకుల చిత్తశుద్ధి లేమి.. శాఖల మధ్య సమన్వయ లోపం.. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి... వెరసి వేసిన రోడ్లే మళ్లీ వేయడం. చేసిన పనులే మళ్లీ చేయడం షరా ‘మామూలు’ అయిపోయింది. ఈ ఏడాది రోడ్ల మరమ్మతులకు చేసిన ఖర్చే దాదాపు రూ.వంద కోట్లు. అయినా ప్రయోజనం శూన్యం. రోడ్ల తీరు అధ్వానం. సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులు ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. నెల.. రెండు నెలలు.. మూడునెలలకోమారు పనులు చేస్తున్నా పరిస్థితి షరా ‘మామూలు’ గానే ఉంటోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు వంద కోట్ల రూపాయలు రోడ్ల పాలయ్యాయి. అయినా ఫలితం శూన్యం. ప్రజలకు సదుపాయం మాత్రం కలగడం లేదు. ఎందుకంటే.. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి అలవాటుపడ్డ జీహెచ్ఎంసీ యంత్రాంగం నాలుగురోజుల పాటు మన్నికగా ఉండేలా పనులను చేయడం లేదు. అందుకే ఎప్పుడూ రహదారుల పనులతో అటు కాంట్రాక్టర్లకు కాసుల పంట పండుతోంది. పనులప్పగించినందుకు వస్తున్న కమీషన్లతో ఇటు అధికారుల జేబులూ నిండుతున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వేసిన రోడ్లనే మళ్లీ మళ్లీ వేస్తుండటం.. చేసిన పనులకే మళ్లీ మళ్లీ ఖర్చు చేస్తుండటం వంటి వాటి వల్ల ఏటా దాదాపు రూ.200 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ప్రజలకు రోడ్డు కష్టాలు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం వర్షాకాలానికి ముందస్తుగానే మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. కానీ చేయలేదు. వర్షాలొచ్చాక.. ర హదారులన్నీ దారుణంగా దెబ్బతినడంతో అత్యవసరంగా తాత్కాలిక మరమ్మతులన్నారు. అవి చేశారో లేదో కొద్దిరోజులకే మళ్లీ నగర రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. వర్షానికి పోయాయన్నారు. మళ్లీ నిధులు.. మళ్లీ పనులు.. ఈ తీరుతోనే కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా సమస్యలు తీరడం లేదు. అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో జీహెచ్ఎంసీ శ్రద్ధ చూపడం లేదు. అందువల్లే ఇతర నగరాల్లోని రహదారులు వర్షాకాలాల్లోనూ మెరుగ్గా ఉంటున్నా, మన నగర రోడ్లు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లే దు. మన రోడ్లే బాగున్నాయని వితండ వాదనలు చేస్తున్నారు. భూగర్భపరిస్థితులు, ట్రాఫిక్ భారం తదితరమైన పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకొని, ప్రమాణాల మేరకు రోడ్లు నిర్మి స్తే మన్నికగా ఉంటాయి. కానీ.. అందుకు కిలోమీటర్‌కు రూ.7 కోట్లు ఖర్చవుతుందనే కారణంతో ఆ మేరకు పనులు చేయడం లేదు. దఫదఫాలుగా చేసే పనులకు అంతకన్నా ఎక్కువే ఖర్చవుతోంది. అయినా ఏ ఒక్క మార్గం లోనూ నాణ్యమైన రోడ్లు కనిపించడం లే దు. ఓవైపు 90 శాతం రహదారులు దెబ్బతిన్నాయని చెబుతున్న అధికారులే.. మొత్తం రహదారుల్లో కేవలం ఒక శాతం రోడ్లే పాడయ్యాయని లెక్క ల్లో చూపుతున్నారు. దెబ్బతిన్న ప్రధాన రహదారులనే పరిగణనలోకి తీసుకుంటూ ఒక్కశాతమే పాడయ్యాయని అంటున్నా.. వాస్తవానికి నగర ంలో రోడ్లన్నీ అధ్వానంగానే ఉన్నాయని అంద రికీ తెలిసిన విషయమే. ఏదేమైనా రోజూ 30 లక్షల వాహనాల భారాన్ని మోస్తోన్న నగర రహదారుల్లో పటిష్టత లోపిస్తోంది. ఎక్కడ చూసినా అధ్వానపు రహదారులే దర్శనమిస్తున్నాయి. ఇకనైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అధికారుల పని తీరిదీ... భారీ వర్షాలు.. నిరంతరాయంగా కురవడం వల్ల ఈసారి రోడ్లు బాగా దెబ్బతిన్నాయంటున్న అధికారులు రోడ్లపై నీరు నిల్వ ఉండటం, మురుగుకాల్వలు పొంగిపొర్లడం, వివిధ అవసరాల కోసం రోడ్ల కటింగ్ చేసి తర్వాత పూడ్చకపోవడం, తగిన కేంబర్ లేకపోవడం వల్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయంటున్నారు. కానీ.. వాటిని నివారించే చర్యలు మాత్రం తీసుకోలేదు. జలమండలి, తదితర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా, అలాంటి చర్యలు తీసుకోలేదు. మిల్లింగ్ (దెబ్బతిన్న రోడ్డు పొరను పూర్తిగా తొలగించి, వర్షపునీరు పోయేందుకు తగిన వాలుతో రోడ్డు మరమ్మతు చేయడం) ద్వారా రహదారిపై వర్షపునీరు నిల్వ ఉండదు. అలాగే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ (పీసీసీ) విధానం ద్వారా రోడ్లు మన్నికగా ఉంటాయి. ఇవన్నీ తెలిసినప్పటికీ అధికారులు ఈ విధానాల అమలుకు ఆసక్తి చూపడం లేదు. బెంగళూరు, జైపూర్, చెన్నై తదితర నగరాలు ఈ విధానాల్ని పాటిస్తున్నాయి. ఆయా నగరాల్లో అధ్యయన యాత్రలు చేసిన కార్పొరేటర్లు వాటిపై పట్టుబట్టడం లేదు. అధికారు లూ కొత్త విధానాల జోలికి పోకుండా ఎప్పుడూ చేసే ప్యాచ్‌వర్క్‌లు, పాట్‌హోల్ ఫిల్లింగ్స్తోనే పనులు చేశామనిపిస్తున్నారు. కోట్లాది రూపాయలు గంగలో కలిపేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నగర రహదారులపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం రోడ్లు బాగుచేయాలని ఆదేశించినా.. అధికారుల్లో చలనం లేదు. ఫలితం కానరావడం లేదు. ఇలా చేయాలి.. =రోడ్డు వేసేప్పుడే వరదనీటి కాలువలు, కేంబర్ (రోడ్డుపై నీరు పోయే వ్యవస్థ) ఏర్పాటు చేయాలి. =దెబ్బతిన్న రోడ్డును నిర్ణీత ప్రాంతం వరకు సమంగా కట్‌చేసి పనులు చేయాలి. =బీటీ వేసేప్పుడు ఉష్ణోగ్రతలు 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గకూడదు. =బీటీని బాగా రోలింగ్ చేయాలి. =రోడ్డు డెన్సిటీ టెస్ట్ చేయాలి. =కంకర, బిటుమినస్ నిర్ణీత పరిమాణాల్లో వినియోగించాలి. =నిర్మాణ పనులను ఇంజనీర్లు దగ్గరుండి పర్యవేక్షించాలి. =మెట్రో నగరాలు పాటిస్తున్న మేలైన విధానాలు అనుసరించాలి. =మరమ్మతులు తగిన ప్రమాణాలతో చేయాలి. కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు.