breaking news
Garividi Lakshmi Movie
-
‘గరివిడి లక్ష్మి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఆనంది, రాగ్ మయూర్ జంటగా, వీకే నరేష్, రాశి, శరణ్య, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `గరివిడి లక్ష్మి`. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. దీనికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బయోపిక్ తరహాలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా నేడు శనివారం (అక్టోబర్ 17)న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? రివ్యూ లో చూద్దాం.90వ దశకంలో జానపద గీతాలు అనగానే గుర్తొచ్చే పేర్లలో కళాకారిణి గరివిడి విజయలక్ష్మి ఒకరు. నేటి జెన్‌జీ తరానికి ఆమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్‌కు మాత్రం ఆమె పాటలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎప్పుడో ఒక సందర్భంలో ఆమె గొంతు వినే ఉంటారు. అలాంటి ప్రముఖ జానపద కళాకారిణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘గరివిడి లక్ష్మి’. బుర్రకథ, జానపద కళలపై పెద్దగా అవగాహన లేని నేటి తరానికి ఆమె జీవితాన్ని పరిచయం చేసే ప్రయత్నం ఇది. కథేంటంటే?ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతంలో పుట్టిన కళాకారిణి జీవిత కథే ఈ చిత్రం. దేవుడమ్మ (రాశి), తాత నాయుడులకు పుట్టిన గారాలపట్టి విజయలక్ష్మి (ఆనంది). చదువు పెద్దగా అబ్బకపోయినా.. ఒక్కసారి వింటే చాలు, ఆ విషయాన్ని ఇట్టే పట్టేసే ప్రతిభ ఆమె సొంతం. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్న లక్ష్మి జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. పలు కారణాలతో భర్తకు దూరమైన దేవుడమ్మ ఆమెకు అన్నీ తానే అయి పెంచుతుంది.అయితే లక్ష్మికి 12 ఏళ్ల వయసులోనే పెళ్లి చేయాల్సి వస్తుంది. ఆ పెళ్లి ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? లక్ష్మి జానపద కళల వైపు అడుగులు వేయడానికి కారణమేంటి? బుర్రకథ నేర్చుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురయ్యాయి? గరివిడి లక్ష్మిగా ఆమె ఎలా గుర్తింపు తెచ్చుకుంది? అనేది తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఎలా ఉందంటే?90స్ లో జానపద కళతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గరివిడి విజయలక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము సాహసమనే చెప్పాలి. ప్రస్తుతం కొత్త తరహా సంగీత ప్రపంచంలో కనుమరుగవుతున్న బుర్రకథ, జానపద కళల నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించడం ఆసక్తికరమైన ప్రయత్నం అనే చెప్పాలి .ఒక కళాకారిణి జీవితాన్ని మాత్రమే కాకుండా.. ఆమె ఎదుగుదల వెనుక ఉన్న కష్టాలు, కన్నీళ్లు, వ్యక్తిగత సంఘర్షణలను చూపించాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు ‘మహానటి’ సినిమా గుర్తుకు వస్తుంది. అయితే ఇక్కడ కథానాయిక ప్రయాణం, జానపద కళ చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.సినిమా తొలి భాగంలో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం కేటాయించారు. లక్ష్మి బాల్యం, కుటుంబ పరిస్థితులు, ఆమె జీవితంలో చోటుచేసుకునే పరిణామాలను చూపిస్తూ కథ ముందుకు సాగుతుంది. దీంతో అక్కడక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ గరివిడి లక్ష్మి జీవిత ప్రయాణం సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. మధ్యమధ్యలో వినిపించే జానపద గేయాలు 90స్ ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. ఆ పాటల్లోని సహజత్వం, అప్పటి కళా వాతావరణం సినిమాకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. కొంత ఓపికతో చూస్తే తొలి భాగం ముగిసే సమయానికి కథపై ఆసక్తి పెరుగుతుంది.ద్వితీయార్ధం ఊరటనిస్తుందిఏదో మిస్ అయిందనే భావనతో విరామం తీసుకున్న ప్రేక్షకులకు ద్వితీయార్ధం కొంత ఊరటనిస్తుంది. లక్ష్మి జీవితంలో ప్రేమ చిగురించడం, ఆ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు కథకు భావోద్వేగాన్ని జోడిస్తాయి. ప్రేమ కోసం ఆమె పడే తపన, కన్నీళ్లు కొన్ని సన్నివేశాల్లో ఆలోచింపజేస్తాయి.అయితే ఒక దశలో కథనం కాస్త పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, లక్ష్మి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసే పరిణామాలు కథపై ప్రేక్షకుడికి అనుబంధాన్ని పెంచుతాయి. ఆమె పడే బాధను చూస్తుంటే ఆ పాత్రతో మనమూ ప్రయాణిస్తున్న భావన కలుగుతుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు సినిమా ముగిసే వరకు ఆసక్తిని కొనసాగిస్తాయి. ముఖ్యంగా చివరి ఘట్టాలు లక్ష్మి జీవితంలోని సంఘర్షణలను మరింత బలంగా చూపిస్తాయి.అయితే కొన్ని సన్నివేశాల్లో కథనం నెమ్మదించడం, కొన్ని భావోద్వేగాలను మరింత ప్రభావవంతంగా చూపించే అవకాశం ఉన్నా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోకపోవడం లోపాలుగా అనిపిస్తాయి. అయినప్పటికీ జానపద కళను కథలో భాగం చేసిన తీరు, ఓ కళాకారిణి జీవితంలోని మరో కోణాన్ని పరిచయం చేయాలనే ప్రయత్నం సినిమాకు బలాన్నిస్తాయి.ఎవరెలా చేశారంటే?గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది అద్భుతంగా నటించింది. భావోద్వేగ సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించేలా నటించడంతో పాటు.. అమాయకత్వం, పట్టుదల, కళపై ప్రేమను తన హావభావాలతో చక్కగా పలికించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనే సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. పాత్రలోకి పూర్తిగా ఒదిగిపోయి, లక్ష్మి జీవితాన్ని ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నంలో విజయవంతమైంది.రాంబాబు పాత్రలో నరేశ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యానికి న్యాయం చేశాడు. సీనియర్ నటి రాశి దేవుడమ్మగా మరోసారి తన అనుభవాన్ని చూపించింది. తల్లి పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలికించింది. సకలక శంకర్, శ్రీరామ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి . ముఖ్యంగా జానపద గేయాలు కథకు తగ్గట్టుగా అందించాడు . నిర్మాణ విలువలు పరవాలేదు. దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరపై చూపించిన విధానం ప్రశంసించదగ్గవే.చివరిగా..అక్కడక్కడా నెమ్మదించే కథనం కొంత ఇబ్బంది పెట్టినా.. గరివిడి లక్ష్మి జీవితం, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, జానపద కళకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తుచేసే ప్రయత్నం ఈ సినిమా. 90స్ ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసే చిత్రంగా నిలుస్తుంది. జానపద కళలపై ఆసక్తి ఉన్నవారితో పాటు, ఓ కళాకారిణి జీవితంలో దాగున్న సంఘర్షణలను తెలుసుకోవాలనుకునేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.రేటింగ్: 2.75/5-ప్రశాంత్ కందా -
‘గరివిడి లక్ష్మి’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
దసరా మూవీస్.. హైప్ ఎలా ఉంది?
పండగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లల్లో సందడి కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దసరా, బతుకమ్మ సీజన్ కావడంతో మార్కెట్లన్నీ కళకళలాడిపోతున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు సినిమాలు కూడా రెడీ అయిపోయాయి. ఈసారి స్టార్ హీరోలు ఓ వైపు పోటీపడుతుండగా.. వీళ్లతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. ఇంతకీ దసరా మూవీస్‌కి హైప్ ఎలా ఉంది? జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)'రణబాలి' విషయానికొస్తే.. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన సినిమా ఇది. ఈ శుక్రవారం(అక్టోబర్ 16) థియేటర్లలోకి రానుంది. రష్మిక ఇదివరకే 'ఛావా' లాంటి పీరియాడిక్ మూవీస్ చేసింది. విజయ్‌కి మాత్రం ఇదే ఫస్ట్ టైం. లుక్స్ దగ్గర నుంచి ప్రమోషనల్ కంటెంట్ వరకు అన్నీ బాగున్నాయి. హైప్ కూడా పర్లేదనిపించేలా ఉంది. బ్రిటీషర్లపై తిరుగుబాటు తరహా కాన్సెప్ట్‌లతో గతంలో పలు మూవీస్ వచ్చినప్పటికీ ఇది రియల్ ప్లస్ కాస్త ఫిక్షన్ జోడించిన కథ కావడంతో సగటు సినీ ప్రేక్షకులకు కాస్తంత ఆసక్తి ఉంది. మరి దాన్ని 'రణబాలి' టీమ్ ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి?'జైలర్ 2' విషయానికొస్తే.. మూడేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్ ఎంతలా సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ రకంగా ఇది రజనీకి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. రజనీ పని ఇక అయిపోయిందనుకుంటున్న టైంలో ఇదొచ్చి ఆయన మళ్లీ ఊపిరి తీసుకునేలా చేసింది. చెప్పాలంటే తొలి భాగంలోనే పెద్దగా కథ ఉండదు. రజనీకి పడిన ఎలివేషన్లు, అనిరుధ్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచాయి. మరి ఈ గురువారం(అక్టోబర్ 15) రాబోతున్న రెండో భాగంలో కొత్తగా ఏం చూపించారు? ఈసారి అనిరుధ్ మ్యూజిక్ ఏ మేరకు వర్కౌట్ అయిందనేది చూడాలి. దీనిపై కూడా బజ్ ఓ మాదిరిగానే ఉంది.పైన చెప్పిన సినిమాలపై కాస్తోకూస్తో బజ్ ఉండగా.. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన 'క్రేజీ కళ్యాణం'(అక్టోబర్ 16), ఆనంది 'గరివిడి లక్ష్మి ' కూడా ఈ వీకెండ్లోనే రిలీజ్ కానున్నాయి. కానీ వీటిపై కనీసం హైప్ లేదు. చెప్పాలంటే వీటి గురించే జనాలకు పెద్దగా తెలీదు! అయితే పండగ టైంలో కొన్నిసార్లు చిన్న చిత్రాలు కూడా కంటెంట్‌తో షాకిస్తుంటాయి. అలా ఈసారి విజయ్ దేవరకొండ, రజనీకాంత్‌లకి చిన్న సినిమాలు ఏమైనా ఝలక్ ఇస్తాయేమో చూడాలి? ఈసారి పండగ విన్నర్ ఎవరనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.(ఇదీ చదవండి: డిజాస్టర్ దర్శకుడితో యష్ కొత్త సినిమా?) -
పట్టుచీరలో 'గరివిడి లక్ష్మి' ఆనంది (ఫొటోలు)
-
‘గరివిడి లక్ష్మి’తో బుర్రకథకు పూర్వవైభవం
వారి గొంతున మాటలు పాటలై ప్రవహిస్తాయి.. వారి పలుకుల్లో అచ్చ తెలుగు పదాలు రథాలు కట్టి పరుగులు తీస్తాయి.. అచ్చమైన ఉత్తరాంధ్ర యాసలో వినిపించే కథలు శ్రవణానందంగా ప్రతిధ్వనిస్తాయి. వారే బుర్రకథ కళాకారులు. బుర్ర నిండా గేయాలు.. వారి కథలన్నీ గాయాలు అన్నట్టు కొనసాగుతున్నారు. కాలం ఈ కళను మరుగున ఉంచేసింది. సినిమాలు, టీవీలు, తాజాగా రీల్స్ ప్రభావంతో బుర్రకథ కళ తప్పింది. అంతటి మహత్తరమైన కళాకారులు నిశ్శబ్దమైపోయారు. గరివిడి లక్ష్మి సినిమా రాకతో మళ్లీ ఇన్నాళ్లకు వారిపై చర్చ జరుగుతోంది. – శ్రీకాకుళం కల్చరల్ న్రేను వచనం.. మా వారు హాస్యం బుర్ర కథ కళాకారిణిగా 30 ఏళ్లకు పైగా ఉంటున్నాను. నేను వచనం చెప్తే, మా వా రు దేవానందం హాస్యం చెపుతారు. ప్రభుత్వ, ప్రైవే టు ప్రదర్శనలు 10 వేల వరకు ఇచ్చాం. గరివిడి లక్ష్మి ప్రదర్శన చేస్తున్నప్పుడు నేను చిన్నచిన్న ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు డ్యాన్సులు తప్ప కథ ఉండడం లేదు అందుకే దూరంగా ఉంటున్నాను. – లోపింటి సుజాత, కళాకారిణి, రాజాం మ్రూడు దశాబ్దాలుగా.. మా కుటుంబం అంతా కళాకారులే కావడంతో చిన్నతనం నుంచి బుక్ర కథ కళకు ఇంటిలో ప్రోత్సాహం లభించింది. నేను వచనం చెప్పేదాన్ని. మా తండ్రి పంచాది చంద్రరావు, అన్నయ్య రమణారావు కూడా కళాకారులే. సుమారు మూడు దశాబ్దాలుగా వెయ్యి వరకు ప్రదర్శనలు ఇచ్చాం. ఇప్పుడు ప్రదర్శనలకు దూరమయ్యాం. ప్రస్తుతం రామయ్యతండ్రి పండగకు పందిరిపాటలు పాడుతున్నాను.– సీపాన కృష్ణవేణి, గోకర్ణపల్లి, పొందూరు మండలంఘాఆ రోజులే వేరు బుర్రకథలంటే ఆరోజుల్లో ఎంతో ఆదరణ ఉంది. మేము ప్రదర్శనకు వస్తే గ్రామాల్లో ఎంతో ఆదరించేవారు. నా పదహారో ఏట నేను మొదటి సారిగా స్టేజి ఎక్కి ప్రదర్శన చేశాను. నేను వచనంతో పాటు గా సెంటర్ కథ కూడా చెప్పేదాన్ని. 1500 వరకు ప్రదర్శనలు చేశాను. మా పేద పరిస్థితిని బట్టి నేను ఒక పక్క చదువుతూ మరో ప్రక్క ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. దానిద్వారా వచ్చిన డబ్బుతో ఫీజులు, పుస్తకాలు కొనుక్కొని చదివాను. ప్రముఖ కళాకారిణి గరివిడి లక్ష్మి గ్రూపు తో సమానంగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. గ్రామాల్లో నోట్ల దండలతో మమ్మల్ని సత్కరించేవారు. గరివిడి లక్ష్మి సినిమాగా రావడం గర్వంగా ఉంది. నేడు బుర్రకథల ప్రదర్శనలలో ఆశ్లీలత కనిపిస్తోంది. ట్రూపులో ఎంత మంది యువతులు ఉన్నారో అడిగి ప్రదర్శన బుక్ చేస్తున్నారు. ఇది తగదు. – అలిగి రమాదేవి, బుర్రకథ కళాకారిణి, శ్రీకాకుళం క్రళను కాపాడాలి ప్రాచీన జానపద కళారూపమైన బురక్రథకు మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేస్తున్న గరివిడి లక్ష్మి చిత్రం విజయ వంతం కావాలి. ఒక్క బురక్రథ కాదు జముకుల పాట, పందిరి పాట, తూర్పు భాగవతం, పులి వేషధారణలు, వీరణం, బిందెల నృత్యాలు ఇవన్నీ కూ డా మన ప్రాచీన కళారూపాలే. వీటిని కాపాడాలి. – వి.జగన్నాథంనాయుడు, ఇంటాక్ అదనపు కన్వీనర్ -
నాకు దేవుడు ఇచ్చిన వరం ఈ సినిమా: ఆనంది
‘‘గరివిడి లక్ష్మి’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో చేసిన కళా ప్రదర్శన చాలా ఆకట్టుకుంది. ఈ పాటలు వింటుంటే నా బాల్యం గుర్తుకొచ్చింది. ఈ చిత్రానికి మంచి పేరొస్తుందని నమ్ముతున్నాను’’ అని అడివి శేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో అడివి శేష్, దర్శకులు బాబీ కొల్లి, హరీష్ శంకర్, మారుతి అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ సినిమా నాకు దేవుడు ఇచ్చిన వరం’’ అన్నారు ఆనంది. ‘‘గరివిడి లక్ష్మి’ మాకు ప్రత్యేకమైన సినిమా’’ అని చెప్పారు కృతీ ప్రసాద్. ‘‘గరివిడి లక్ష్మి’ పాత్రకు ఆనంది సరైన ఎంపిక అనిపించింది’’ అని చె΄్పారు విశ్వప్రసాద్. ‘‘మా గరివిడి లక్ష్మి మీతో (ప్రేక్షకులు) పాడిస్తుంది... ఆడిస్తుంది... నవ్విస్తుంది... కన్నీళ్లు పెట్టిస్తుంది’’ అని చె΄్పారు గౌరీ నాయుడు. ‘‘ఇందులో స్పెషల్ రోల్ చేశాను’’ అన్నారు రాగ్ మయూర్. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, నటుడు వీకే నరేష్ తదితరులు ΄ాల్గొన్నారు. -
‘40 సినిమాలకు డైలాగ్స్ రాశా.. 500 చిత్రాల్లో నటించా.. కానీ..’
టాలీవుడ్లో తనదైన నటన, రచనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించి, మెప్పించిన ఆయన.. కొంతకాలంగా వెండతెరకు దూరంగా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంతే కాకుండా తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.10 నుంచి 15 ఏళ్లు రంగస్థలంపై..‘సినిమాల్లో రాకముందు దాదాపు 10 నుంచి 15 ఏళ్లు రంగస్థలంపై నటించాను. నాటకరంగంలో ఎంతో అనుభవం సంపాదించిన తర్వాతే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఆ అనుభవంతోనే నటుడిగా దాదాపు 500 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం లభించింది. ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ ఇలా సుమారు 40 సూపర్‌హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశాను. ప్రస్తుతం స్థాయికి తగ్గట్లుగా నటించేందుకు సరైన పాత్రలు రావడం లేదు. అందుకే వెండి తెరకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నా. దీంతో యూట్యూబ్‌లో షార్ట్ఫిలిమ్స్ చేస్తున్నాను. కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గినా.. డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటా’ అని ఎల్బీ శ్రీరామ్ భావోద్వేగంగా మాట్లాడారు.‘గరివిడి లక్ష్మి’ సినిమాతో.. కాగా ఎల్బీ శ్రీరామ్ ‘గరివిడి లక్ష్మి’ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన ‘బుర్రకథ గురువు’ పాత్రలో కనిపించనున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: మెగా, నందమూరి మల్టీస్టారర్.. దర్శకుడిగా బోయపాటి రెడీ!) Memorable Frames with the Esteemed Guests & Team #GarividiLakshmi at the Trailer Launch Event ❤️🔥 WATCH TRAILER HERE! -- https://t.co/f9vANVZgm9 GRAND RELEASE IN THEATRES ON 17th OCTOBER 2026 ❤️ #GarividiLakshmionOct17th https://t.co/XtFKqdGzel— People Media Factory (@peoplemediafcy) October 5, 2026 -
బుర్రకథ అంటే ఏంటో చూపిస్తా..'గరివిడి లక్ష్మి' ట్రైలర్ చూశారా?
ఉత్తరాంధ్ర ప్రజలకు గరివిడి లక్ష్మి అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుర్రకథ కళాకారిణిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పాటలు అప్పట్లో ఎంతలా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఈమె జీవితం ఆధారంగా తెలుగులో తీసిన సినిమా 'గరివిడి లక్ష్మి'. ఆనంది టైటిల్ రోల్ చేసింది. గౌరీనాయుడు జమ్ము దర్శకుడు. ఈ నెల 17న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఉత్తరాంధ్ర జానపద కళల వైభవాన్ని, గ్రామీణ మహిళ పోరాట పటిమని ఈ సినిమాలో చూపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఆనందితో పాటు రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, రాశి తదితరులు కీలక పాత్రలు చేశారు. 90స్ లో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మి జీవిత కథను ఈ ట్రైలర్లో శాంపిల్‌గా చూపించారు.అక్టోబర్ 16న జైలర్ 2, రణబాలి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో గరివిడి లక్ష్మి చిత్రం.. ప్రేక్షకుల దృష్టిని ఏ మేరకు ఆకర్షిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా) -
'గరివిడి లక్ష్మి' సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)
-
గరివిడి లక్ష్మి.. థియేటర్లకు వచ్చేస్తోంది..!
నిజజీవిత కథలు, సంఘటనలు స్ఫూర్తిగా రాబోతున్న మరో మూవీ 'గరివిడి లక్ష్మి'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నల్లజీలకర్ర మొగ్గ' అని సాగే ఓ పాటని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మీ అనే ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో లక్ష్మీ పాత్రలో ఆనంది కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షక మహాశయులందరికీ విజ్ఞప్తి 📢అక్టోబర్ 17న, మీ అభిమాన థియేటర్లలో మా గరివిడి లక్ష్మి ఆడి పాడి అలరించబోతోంది ❤️❤️❤️#GarividiLakshmi GRAND RELEASE IN THEATRES ON 17th OCTOBER 2026 💥#GarividiLakshmionOct17th @peoplemediafcy @vishwaprasadtg @anandhiactress @smayurk… pic.twitter.com/G4Y0aStFxQ— People Media Factory (@peoplemediafcy) September 21, 2026 -
ఉత్తరాంధ్ర జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు.. చూశారా?
తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథలతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నల జీలకర్ర మొగ్గ బాగా వైరలయింది. తాజాగా మరో జానపద పాటను వదిలారు.ఉత్తరాంధ్ర జానపదంకోసింది కోయగూర దుబ్బో సందమామ.. వాసనకీ సంపంగి మొగ్గ అంటూ పాట మొదలవుతుంది. ఈ జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు వేసింది. చరణ్ అర్జున్ సంగీతం అందించగా అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము ఆలపించారు. ఈ పాటను ఉత్తరాంధ్ర జానపదాల నుంచి సేకరించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.ఆనంది కెరీర్ఆనంది విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్ జిల్లా తన స్వస్థలం. ఆమె అసలు పేరు రక్షిత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును హాసికగా మార్చుకుంది. అది కలిసిరాకపోయేసరికి ఆనందిగా మారింది. తెలుగులో జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్, ప్రేమంటే, భైరవం సినిమాలు చేసింది. తెలుగులోకన్నా కోలీవుడ్‌లోనే హీరోయిన్గా మంచి పేరు, అవకాశాలు తెచ్చుకుంది.


