breaking news
Full literacy
-
సరస్వతీ నిలయం.. సంకువారిగుంట
బడి బాటే బతుక్కి బంగారు బాటని ఆ గ్రామస్తులు వందేళ్ల క్రితమే గుర్తించారు. నాలుగక్షరాలు నేర్చుకుని జ్ఞానం పెంచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తావని తమ పిల్లలకు ఉగ్గుపాల నుంచే నూరిపోశారు. అలా స్వాతంత్య్రానికి ముందు మొదలైన ప్రస్థానం దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది. కమ్యూనిస్ట్ ఉద్యమాలనుంచి రాజకీయరంగం వరకూ, సాధారణ ప్రభుత్వ కొలువుల నుంచి అత్యుత్తమ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల వరకు ఆ గ్రామానికి చెందిన ఎంతో మంది దేశ విదేశాల్లో తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. శతశాతం అక్షరాస్యతతో సరస్వతీ నిలయంగా విలసిల్లుతున్న ఆ గ్రామమే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని సంకువారిగుంట. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సంకువారిగుంట బ్రిటిష్ కాలంలో ఏర్పడిన గ్రామం. 1890–1900 సంవత్సరాల మధ్య ఈ గ్రామం ఏర్పడినట్లు పెద్దలు చెబుతుంటారు. బ్రిటిష్‌వారి కాలంలో పంట పొలాలకు కాపలాగా ఉండేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది తదనంతర కాలంలో అక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 1916లోనే ఇక్కడ క్రైస్తవ మిషనరీ ప్రాథమిక పాఠశాల ఉన్నట్లు పాత గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతం కలిసి ఉన్నప్పటి రికార్డుల ప్రకారం తెలుస్తోంది. 1953లో అది మేనేజ్మెంటు ప్రాథమిక పాఠశాలగా మారింది. ప్రస్తుతం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి వరకు మాత్రమే ఉంది. అనంతరం గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ ఈ గ్రామ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతుంటారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాజశేఖర్ ఓఎన్జీసీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సంకువారిగుంటకు చెందిన డి.ఎం.రాజశేఖర్ తన పరిశోధనలకు గాను 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామానికి చెందిన మరికొందరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. శాస్త్రవేత్త దుగ్గిరాల మోజెస్ రత్నశేఖర్ శాస్త్రవేత్తగా 50కి పైగా పరిశోధనా పత్రాలు వెలువరించారు. ఈయనతో పాటు మరో 10 మంది ఓఎన్జీసీ. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. చిన్న గ్రామంలో 250 మంది ప్రభుత్వ ఉద్యోగులు 500 కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో సుమారు 250 మంది వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. బ్యాంకు, రైల్వే, పోలీస్, మిలటరీ, నేవీ, ఇంజనీరింగ్‌తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ ఈ గ్రామానికి చెందినవారు ఉన్నారు. రాజకీయంగానూ సంకువారిగుంట చైతన్యవంతమైన గ్రామం. బెజ్జం సంజీవరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జూపూడి ఎమ్మెల్సీగా పనిచేశారు. 1960లో డీటీ మోజెస్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంతనూతలపాడు స్థానానికి పోటీ చేశారు. గురువుల దక్షత వల్లే చదువులు... గతంలో ఇక్కడ పనిచేసిన గురువుల దీక్ష, దక్షతల వల్లే గ్రామస్తులకు విద్యాబుద్ధులు అలవడ్డాయి. పిల్లలు పొలం పనుల్లో కాదు..పాఠశాలలో ఉండాలి అని వారు చెప్పిన మాట గ్రామస్తులను ఆలోచింపజేసింది. గతంలో గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పిల్లి సుందరరావు, పిల్లి జయరావు సోదరులు గ్రామస్తులను విద్యాబుద్ధుల వైపు మళ్లించారు. గ్రామంలో మొదటి ప్రభుత్వ ఉద్యోగి అయిన మోజెస్ ఉపాధ్యాయుడిగా గ్రామస్తుల్లో మరింత మార్పు తీసుకొచ్చారు. ఆయన ఒంగోలులో 1952లో ఠాగూర్ ట్యుటోరియల్ను స్థాపించి గ్రామం నుంచి విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడ్డారు. స్వగ్రామంలో 36 ఏళ్లు పనిచేశా నేను పుట్టిన ఊరిలోనే ప్రాథమిక విద్య అభ్యసించాను. తదనంతర కాలంలో ఉపాధ్యాయుడిగా 39 ఏళ్లు పనిచేస్తే 36 సంవత్సరాలు మా ఊరిలోనే పనిచేసే అవకాశం దక్కింది. నాకంటే ముందు మా అన్న సుందరరావు 40 సంవత్సరాలు ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సొంత ఊరికి చెందిన వందల మంది పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే అవకాశం మా కుటుంబానికి లభించింది. – పిల్లి జయరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరి దృష్టీ చదువు పైనే.. మొదటి నుంచీ గ్రామంలోని ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే దృక్పథంతోనే ముందుకు సాగుతున్నారు. మా గ్రామానికి చెందిన వారు మన రాష్ట్రంలోనే కాక అనేక రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. పూర్వం నుంచి మా పెద్దలు చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. నేను కూడా మా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నాను. మా పెద్దమ్మాయి ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్నమ్మాయి ఇంటర్ చదువుతోంది. – దుగ్గిరాల విజయకుమార్, గ్రామస్తుడు -
‘గురు’తర బాధ్యత మీదే!
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పుల అమలు, లక్ష్యాల సాధనలో చదువులు చెప్పే గురువులదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది వారు చూపించే బాట నుంచేనని గుర్తు చేస్తూ వారిపై ఉంచిన గురుతర బాధ్యతను నెరవేర్చాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతమయ్యేలా టీచర్లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను రూపుమాపి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో నిరక్షరాస్యత శాతం జాతీయ సగటును మించి ఉందని, ఐదేళ్లలో ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, వారి వసతి, భోజనాలకు ఏటా రూ.20 వేలు, అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రవేశపెట్టామని చెప్పారు. మూడేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారో వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గురువులకు వందనాలు. నాకు చదువు చెప్పిన ప్రతి గురువు పాదాలకు వందనం చేస్తూ నాలుగు మాటలు చెబుతున్నా. మన తెలుగువారైన మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని దేశమంతా టీచర్స్‌డేగా జరుపుకొంటోంది. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేసి అనంతరం భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప పాఠం. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికొక నిదర్శనం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితమే అని చెప్పవచ్చు. తనకు పాఠాలు చెప్పిన ఒక బీసీ కులానికి చెందిన అధ్యాపకుడు వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో దివంగత నేత ఒక స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. గురువు విద్యార్ధుల మనసులపై చెరగని ముద్ర వేస్తారనేందుకు ఇదో నిదర్శనం. గురువు చేసే పని బహుశా ఎవరూ చేయలేరేమో. అందుకనే గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః అని అంటారు. ఈ పరిస్థితులు మారాలి.. మన రాష్ట్రం చదువుల పరంగా ఏ స్థాయిలో ఉందో అంతా ఆలోచన చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యత అక్షరాలా 33 శాతం. అదే జాతీయ సగటు 27 శాతం మాత్రమే. అంటే ఏపీలో నిరక్షరాస్యత జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. దీని అర్థమేమిటో మీరంతా ఆలోచన చేయాలి. వీరంతా చదువుకోవాలనే ఆరాటం లేని వారు కాదు. చదివించాలనే తపన ఉన్నా చదివించలేని పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చి నిరక్షరాస్యతను ఐదేళ్లలో పూర్తిగా సున్నాకు తీసుకురావాలన్నదే నా తాపత్రయం, తపన. ఇదేకాదు.. 18 – 23 సంవత్సరాల వయసు కలిగి ఇంటర్ తరువాత డిగ్రీ చదవాల్సిన పిల్లలు ఎంతమంది కాలేజీల బాట పడుతున్నారని చూస్తే దానిలోనూ వెనుకబడి ఉన్నాం. బ్రిక్స్ (బ్రెజిల్ రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలైన రష్యాలో 81 శాతం, చైనాలో 48 శాతం, బ్రెజిల్లో 50 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుండగా మన దేశంలో కేవలం 26 శాతమే చేరుతున్నారు. అంటే 74 శాతం మంది పిల్లలు ఇంటర్ దాటి కాలేజీల్లో చదివే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులు మార్చాలి. రష్యాలో 81 శాతం మంది పిల్లలు కాలేజీల్లో చేరుతుంటే దానికన్నా ఎక్కువగా మన రాష్ట్రం ఉండాలన్న తాపత్రయంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి శ్రీకారం చుట్టాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కాలేజీల్లో చదువుకునే పిల్లలకు వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేలు ఇచ్చే పథకాల ద్వారా విద్యారంగ పరిస్థితులను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌కు వీణను అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్. చిత్రంలో మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు పార్థసారథి, మల్లాది విష్ణు మానవత్వం లేని పాలనను పాదయాత్రలో చూశా... నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో నడుస్తున్నప్పుడు చాలా స్కూళ్లు కనిపించాయి. చాలామంది పిల్లలు, ఉపాధ్యాయులు నా దగ్గరకు వచ్చారు. కొందరు ఉపాధ్యాయులు నాడు ప్రతిపక్షనేతగా ఉన్న నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పినందుకు గత ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. కానీ వాస్తవమేమిటనే ఆలోచన చేయలేదు. పాదయాత్రలో స్కూళ్ల పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు నా కంటికి కనిపించాయి. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి 8 నెలలకుపైగా బకాయిలు చెల్లించలేదు. సరుకులు కొనే పరిస్థితి లేదు. ఆయాలకు ఇచ్చే గౌరవ భృతి రూ. వెయ్యి ఇచ్చే పరిస్థితి లేదు. 8 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెడితే వాళ్లు సరుకులు ఏం తీసుకొస్తారు? పిల్లలకు తిండేం పెడతారు? ఆ పిల్లలు ఆ తిండేం తినగలుగుతారు? పిల్లలు చదువుల బాట ఎలా పడతారు? అన్న కనీస ఆలోచన, మానవత్వం లేని పరిపాలనను ఆనాడు చూశాం. స్కూళ్లలో పరిస్థితులు మరీ అధ్యాన్నం. బాత్రూములో నీళ్లుండవు. అవి వినియోగానికి అసలు పనికిరావు. పాఠ్యపుస్తకాలు స్కూళ్లు తెరిచిన జూన్ మొదటి వారానికే అందుబాటులోకి రావాల్సి ఉన్నా అక్టోబర్, నవంబర్‌లో కూడా అందించలేని దుస్థితి. టీచర్లు తక్కువగా ఉన్నారని తెలిసినా నియామకాలు చేయాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. యూనిఫారాల పరిస్థితీ అంతే. ఇవ్వాల్సిన సమయంలో ఏదీ ఇవ్వని దుస్థితి. ఇలా ప్రతి అడుగులో ప్రభుత్వమే పాఠశాలలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తే స్కూళ్లు ఎలా తయారవుతాయో నా పాదయాత్రలో గమనించా. ఇవన్నీ చూసిన తరువాతనే విప్లవాత్మక మార్పులు తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. తొలి అడుగులు మీ నుంచే.. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే స్కూళ్ల దశదిశ మార్చేలా ప్రతి స్కూలు ఫొటో తీయాలని చెప్పాం. దశలవారీగా మూడేళ్లలో ప్రతి స్కూలును ఎలా మార్చామో ఫొటోల ద్వారా వ్యత్యాసాన్ని చూపించాలని అధికారులను కోరాం. ఇందుకు కట్టుబడి ఉన్నాం. ప్రతి స్కూలులో మార్పులు చేస్తాం. పేరెంట్ బాడీలను తీసుకువస్తాం. తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియంగా మార్చాలని ఆరాట పడుతున్నాం. పిల్లలకు మంచి చదువులు అందాలి. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు బాగుండాలి. మన పిల్లలను ఏ మోహమాటం లేకుండా ప్రభుత్వ స్కూళ్లకు చిరునవ్వుతో పంపించేలా ఉండాలన్న ఆరాటంతో అందరం ఉన్నాం. ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఆ బృహత్తర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. అయితే ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలన్నా తొలి అడుగులు పడేది మీరు చూపించే బాట నుంచే. మీ బాధ్యతలను మరొక్కసారి గుర్తుచేస్తూ దీన్ని గొప్పగా నెరవేరుస్తారని ఆశిస్తూ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు’ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు.. టీచర్స్ డే సందర్భంగా 143 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందచేశారు. ఉత్తమ గురువులకు ట్యాబ్, పతకం, ధ్రువపత్రం, రూ.20 వేల నగదు అవార్డును పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందించింది. విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్ధులకు ఉన్నత విద్య కలను సాకారం చేశారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, పేర్ని నాని, కొడాలి నాని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తన జీవితాన్ని మార్చిన గురువును ఏ పిల్లవాడైనా ఎంత ఎదిగినా మరిచిపోలేడు. దీనికి నిదర్శనం దివంగత నేత వైఎస్సార్ జీవితమే. తనకు పాఠాలు చెప్పిన వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో స్కూలును స్థాపించారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఇవ్వాళ్టికీ ఆ స్కూలును నడుపుతోంది. – సీఎం వైఎస్ జగన్ గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు -
చదువుతోనే సంపూర్ణ అక్షరాస్యత
ఆదిలాబాద్ అర్బన్ : అందరూ చదువుకుంటేనే సంపూర్ణ అక్షరాస్యత సాధించవచ్చని కలెక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం సాక్షరభారత్, జన్ శిక్షణ సంస్థాన్(ఎన్జీవో) ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా విద్యార్థులు, అధికారులు సాక్షరభారత్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. వయోజన విద్య ద్వారా, కస్తూరిబా బాలికా విద్యాలయాల ద్వారా డ్రాపౌట్ పిల్లలకు విద్యను అందించుట, సాధారణ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించుట వంటివి చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరిస్తే అక్షరాస్యత సాధనలో మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ చదువు రాని వారికి చదువు చెప్పాలని కోరారు. మహిళల అక్షరాస్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతో ప్రజలందరిలో జాతీయ భావం పెరుగుతుందని అన్నారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, వయోజన విద్య ఉప సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి, జన శిక్షణ సంస్థాన్ కార్యదర్శి సురేందర్, సభ్యులు రాజేశ్వర్, గంగాధర్, అలీబాన్, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల యజమానులు పాల్గొన్నారు.