breaking news
FIS Global Solutions
-
రూ. 8 లక్షల కోట్లకు ఈ–కామర్స్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో డిజిటల్ టెక్నాలజీల వాడకం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఈ–కామర్స్ విభాగం గణనీయంగా వృద్ధి చెందనుంది. గతేడాది (2020లో) 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ 2024 నాటికి దాదాపు 111 బిలియన్ డాలర్ల్ల (సుమారు 8 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. దాదాపు 84 శాతం వృద్ధి సాధించనుంది. ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ ఎఫ్ఐఎస్ విడుదల చేసిన 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 41 దేశాల్లో ప్రస్తుత, భవిష్యత్ చెల్లింపుల ధోరణులను ఈ నివేదికలో విశ్లేషించారు. దీని ప్రకారం కోవిడ్–19 పరిణామాలతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. చెల్లింపుల కోసం కొత్త విధానాలను ఉపయోగించడం పెరిగింది. ‘కోవిడ్–19 నేపథ్యంలో భారత్‌లో ఈ–కామర్స్ విభాగం భారీగా పెరిగింది. భవిష్యత్‌లో మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని ఎఫ్ఐఎస్ వరల్డ్‌పే ఎండీ (ఆసియా పసిఫిక్) ఫిల్ పామ్ఫోర్డ్ తెలిపారు. పెరగనున్న మొబైల్ షాపింగ్..: నివేదిక ప్రకారం ఈ–కామర్స్ వృద్ధికి మొబైల్ ద్వారా కొనుగోళ్లు జరపడం ప్రధానంగా దోహదపడనుంది. వచ్చే నాలుగేళ్లలో మొబైల్ షాపింగ్ వార్షికంగా 21 శాతం మేర వృద్ధి చెందనుంది. 2020లో అత్యధికంగా ఉపయోగించిన చెల్లింపు విధానాల్లో డిజిటల్ వ్యాలెట్లు (40%), క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డులు (చెరి 15%) ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపుల మార్కెట్లో డిజిటల్ వ్యాలెట్ల వాటా 2024 నాటికి 47 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా దేశీయంగా ఆన్లైన్ పేమెంట్లకు సంబంధించి ’బై నౌ పే లేటర్’ (ముందుగా కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం) విధానం కూడా గణనీయంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతానికి దీని మార్కెట్ వాటా 3%గానే ఉన్నప్పటికీ ... 2024 నాటికి ఇది 9%కి పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పీవోఎస్ మార్కెట్ 41 శాతం వృద్ధి.. డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులు జరిపేలా కస్టమర్లకు వెసులుబాటు కల్పించే సంస్థలే రాబోయే రోజుల్లో రిటైల్, ఈ–కామర్స్ మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలవని పామ్ఫోర్డ్ తెలిపారు. నివేదిక ప్రకారం దేశీయంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మార్కెట్ 2024 నాటికి 41 శాతం వృద్ధి చెంది 1,035 బిలియన్ డాలర్లకు చేరనుంది. స్టోర్స్‌లో చెల్లింపులకు అత్యధికంగా నగదు (34 శాతం), డిజిటల్ వ్యాలెట్లు (22 శాతం), డెబిట్ కార్డ్ (20 శాతం) విధానాలను ఉపయోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆసియా పసిఫిక్ 13 శాతం అప్.. వర్ధమాన దేశాల్లో అధిక వృద్ధి ఊతంతో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ–కామర్స్ మార్కెట్ 2024 నాటికి 13 శాతం వార్షిక వృద్ధి నమోదు సాధించే అవకాశం ఉంది. చైనాలో అత్యధికంగా ఈ–కామర్స్ వినియోగం అత్యధిక స్థాయిలో కొనసాగనుంది. -
కరుణ చూపి... కడుపు నింపి
కొన్ని శునకాలు రాజభోగం అనుభవిస్తాయి. వాటి అదృష్టానికి అబ్బురపడిపోతాం. కొన్ని శునకాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు. వాటి ఆలనాపాలనా ఎవరికీ పట్టదు. అందుకే వీధి కుక్కలు వీధికుక్కలుగానే ఉండిపోతాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీధికుక్క దీనస్థితిని చూసి, దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు అంజలి కకటి. ఆ తరువాత కూడా గాయపడిన మరో శునకాన్ని ఎక్కడో చూసి ఇంటికి తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దీనస్థితిలో ఉన్న వీధి శునకాల కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు అంజలి. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘ఈచ్ వన్ ఫీడ్ వన్’ అనే స్వచ్ఛంద సంస్థ. దక్షిణ ఢిల్లీలో ఏర్పాటైన ఈ ఎన్జీవో ‘డెలివరీ బైకు’ అనే సరికొత్త విధానంతో వీధిశునకాలకు ఆహారం అందిస్తుంది. బెక్‌పై ఉన్న వ్యక్తికి ఎక్కడ వీధిశునకాలు కనిపించినా తన దగ్గర ఉన్న ఆహారాన్ని అందించి వాటి ఆకలి తీరుస్తాడు. ఎఫ్ఐఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ మేనేజర్‌గా పని చేస్తున్న అంజలి తన జీతంలో 80 శాతాన్ని ‘ఈచ్ వన్...’ కోసం వినియోగిస్తు న్నారు. తనకు తెలిసిన మిత్రుల నుంచి కూడా నిధులు సేకరిస్తున్నారు. ‘ఈ నెల ఇంత బడ్జెట్’ అని ఏ నెలకు ఆ నెల అనుకుంటున్నప్పటికీ... ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గాయపడిన శునకాన్ని తీసుకువస్తుంటారు. ఇలా ఆకస్మికంగా వచ్చిన శునకాలతో ఖర్చు పెరుగుతుండడాన్ని గమనించిన అంజలి ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఏర్పాటు చేశారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా వీధిశునకాల కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నారు అంజలి. పక్షవాతానికి గురైన ఒక వీధిశునకానికి రకరకాలుగా సపర్యలు చేసి, అది మళ్లీ పరుగెత్తేలా చేశారు. ఈ ఆనందం తనకు ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని ఇస్తుంది అంటారు. గాయపడిన శునకాలను గుర్తించడానికి సహాయబృందాలను, తక్షణ వైద్యసేవలు అందించడానికి మినీ అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంజలి.కెరీర్లో పరుగులు తప్పా మరో ఆలోచన లేని యుతకు అంజలి ఆదర్శంగా నిలిచారు.