breaking news
female babies
-
ఆమెకు ఆహ్వానం
తరం మారుతోంది.. జనం అభిప్రాయం మారుతోంది... అబ్బాయే కావాలి.. వంశానికి వారసుడు ఉండాలనే ధోరణిలో మార్పు వస్తోంది. ఆడ, మగ.. ఎవరైనా చాలు అనే ఆలోచన పెరుగుతోంది.. లింగ నిష్పత్తి సమానత్వం దిశగా సమాజం వడివడిగా అడుగులు వేస్తోంది..మన దేశంలో ఆది నుంచి పురుషాధిక్యత ఎక్కువ. అబ్బాయి ఇంటిపేరు నిలబెడతాడు.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకుంటాడు.. పున్నామ నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడు ఉండాలి.. అమ్మాయి అయితే కట్న, కానుకలిచ్చి పెళ్లి చేయాలి.. వివాహంతో తల్లి ఇంటితో రుణం తీరిపోతుంది.. లాంటి ఆలోచన చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచి్చనప్పుటి నుంచి ఆడ శిశువుల హత్యలు పెరిగాయి. లక్షల మంది ఆడ శిశువులు అమ్మ కడుపులోనే కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది.. అమ్మాయి ఐనా.. అబ్బాయి ఐనా ఓకే అంటూ యువతరం స్వాగతం పలుకుతోంది. ఆడ శిశువుల కంటే మగ శిశువుల నిష్పత్తి ఎక్కువగా ఉండే పరిస్థితి క్రమేపీ మారుతోంది. దేశంలో లింగ సమానత్వం దిశగా అడుగులు పడుతున్నట్లు, మహిళా జనాభా పెరగనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన అంచనా గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మహిళలు ఉండగా, 2036 వరకల్లా ఇది 952కు వృద్ధి చెందుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుతుంది. మొత్తం జనాభాలో స్త్రీల శాతం 48.5 నుంచి 48.8కి పెరగనుంది. పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేసింది. కాగా లింగ నిష్పత్తి, పని చేసే యువత, జననాల రేటుకు సంబంధించిన పలు ఆసక్తికర గణాంకాలను కేంద్రం వెల్లడించింది. -
‘అమ్మ’మ్మా..
- మగ సంతానం కోసం పదో కాన్పు వరకు వేచిచూసిన దంపతులు - ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ - పదకొండు మంది సంతానంలో బతికున్నది ఐదుగురే.. చందంపేట: ఒకటికాదు..రెండు కాదు.. వరుసగా పది కాన్పులు. పదకొండు మంది సంతానం. పదిహేనేళ్ల క్రితం వివాహమైన ఆ మహిళ 180 నెలల్లో ఏకంగా 90 నెలలు బిడ్డలను మోస్తూనే ఉంది.. ఆడశిశువులు పుట్టడం.. వారిని సాకలేకమని శిశుగృహాల పాలు చేస్తూనే.. మగ బిడ్డ కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. చివరకు పదో కాన్పులో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి.. మగ సంతానం కావాలనే కాంక్షను తీర్చుకుంది. నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మగ సంతానం పట్ల గిరిజనులకున్న మోజుకు ఈ ఘటన అద్దం పడుతోంది. చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ మోత్యతండాకు చెందిన నూన్సావత్ బద్యా, లక్ష్మీ దంపతులకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. అయితే మొదటి కాన్పు నుంచి తొమ్మిదో కాన్పు వరకు లక్ష్మీ ఆడ పిల్లలనే జన్మనిచ్చింది. అయితే మగ పిల్లాడు కావాలనే కొరికతో పదో కాన్పు వరకూ ఆ దంపతులు వేచి చూశారు. తాజాగా లక్ష్మి ఈ నెల 22న పదవ కాన్పులో ఆడ, మగ శిశువులకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే సదరు దంపతులు గతంలో రెండు కాన్పుల్లో జన్మించిన ఆడ శిశువులను సాకలేమని దేవరకొండ, నల్లగొండ ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పుట్టిన పదకొండు మందిలో ప్రస్తుతం ఐదుగురు పిల్లలు మాత్రమే బతికుండగా మిగతా పిల్లలు అనారోగ్య కారణాలతో చనిపోయారని వారి బంధువులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు పదవ కాన్పులో పుట్టిన ఆడ శిశువును అయినా సాకుతారా లేదా అనేది వేచిచూడాలి. -
దయలేని అమ్మలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమ్మా నన్ను అమ్మకే.. ఓ యమ్మా... నాన్నా నీకు దండ మే... నవ మాసాలు నన్ను మోశావమ్మా.. పురిటి నొప్పుల బాధ పడ్డావమ్మా.. పేగు తెంచుక నన్ను గన్నావమ్మా.. పేరు పెట్టకుండ వేరు చేయకమ్మా.. నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓయమ్మా..! నన్ను దూరంజేయబోకమ్మా... అని మెతుకుసీమలో బతుకమ్మ ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతిని.. ఆడపిల్లలను ప్రేమించడమే బతుకమ్మ... పర్యావరణాన్ని రక్షించుకోవడం.. అమ్మను, ఆడబిడ్డను బతికించుకోవడమే ‘బతుకమ్మ’కు అర్థం. పరమార్థం. తెలంగాణ సాకారమై బంగారు బతుకమ్మ నిండు పండగ శోభ సంతరించుకున్న వేళ ఇంకా ముళ్ల పొదల్లో పుత్తడి బొమ్మల మృత్యు కేకలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల పుడితే తప్పు, నట్టిట్లో నడిస్తే ముప్పు.. పెరిగితే అప్పు అనే ధోరణి పల్లెను ఇంకా వదల్లేదు. మెతుకు సీమలో పేదరికం రక్తబంధాన్ని కూడా హేళన చేస్తోంది. అమ్మ వెచ్చని పొత్తిళ్లలో నిద్రపోవాల్సిన పసికందులు ముళ్ల పొదల్లో.. మురికి కాల్వల్లో పడి కన్ను మూస్తున్నారు. జిల్లాలో నెల రోజులుగా వరుసగా ఆడ శిశువును విసిరేసిన సంఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 10 మంది శిశువులను అమ్మలు నిర్దయగా వదిలేసుకున్నారు. గత చేదు సంఘటనలు మరవకముందే బుధవారం గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో మరో సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల ఆడ శిశువులను గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డులో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పాప గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆస్పత్రి సిబ్బంది గుర్తించి విషయాన్ని పోలీసులు, శిశు సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఐసీడీఎస్ అధికారి విమల జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో శిశు గృహ అధికారులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. ఇలాంటి సంఘటనే మంగళవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోనూ చోటుచేసుకుంది. వావిలాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బతుకమ్మ తయారు చేసేందుకు తంగేడు పూల కోసం అటవీప్రాంతంలోకి వె ళ్లగా అక్కడ పొదల మధ్య పసికందు కనిపించటంతో మాన్పడిపోయారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నెలరోజుల ఆడ శిశువును పొదలమాటున వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు మహిళలు విషయాన్ని గ్రామపెద్దలకు తెలిపారు. చివరకు శిశు సంక్షేమశాఖ అధికారులు ఆడశిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. గత నెల 9వ తేదీన మెదక్-చేగుంట రహదారిపై కొర్విపల్లి శివారులో అప్పుడే పుట్టిన మగశిశువును సైతం న్యూస్పేపర్లో చుట్టి మొక్కజొన్న చేనులో వదిలేయగా, స్థానికుల చొరవతో అధికారులు శిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి తరలించారు. ఇక ఐదు నెలల క్రితం వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి పోయారు. ఇలా జిల్లాలో ఆడ శిశువులను అటవీ ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో, ఆస్పత్రుల్లో వదిలేసి వెళ్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం ఎరుగని, లోకం పోకడ తెలియని పసికందులను వదిలించుకుంటూ మాతృత్వానికి మాయని మచ్చలను మిగులుస్తున్నారు. ఏదిఏమైనా ఆడ శిశువులను వదిలేసి వెళ్లటం సమాజానికి పట్టిన రోగమని సామాజిక కార్యకర్త యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ కూతుళ్లను విక్రయించటం, పొత్తిళ్లలోని ఆడశిశువులను వదిలి వేయటం సమాజంపై దుష్ర్ఫభావం చూపుతుందన్నారు. ఆడ శిశులను వదిలివేసే నీచ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.