అతిపెద్ద ఆయిల్ పైప్ లైన్‌పై దాడి
బొగోటా: కొందరు తిరుగుబాటుదారులు కొలంబియాలో రెండో అతిపెద్ద ఆయిల్ పైప్ లైన్‌పై దాడి చేశారు. దానిని ధ్వంసం చేశారు. అది కూడా ఆర్మీకి చెందినది కావడం గమనార్హం. దీంతో లీకేజీని నియంత్రించేందుకు కొలంబియా నిపుణులు చాలా ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే దాని లీకేజీ వల్ల వాతావరణంలో పెను మార్పులు వచ్చి జీవన విధానంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అలా జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శ్రమిస్తున్నారు.
రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్ఏఆర్సీ) సంస్థకు చెందిన కొందరు తిరుగుబాటుదారులు ఒకే రోజు రెండు సార్లు ఆర్మీ ఆయిల్ పైప్ లైన్ పై దాడికి పాల్పడ్డారు. ఒకటి మధ్యాహ్నం చేయగా మరొకటి రాత్రి పూట చేశారు. ఈ దాడికి శక్తిమంతమైన బాంబులు ఉపయోగించారు. దీంతో మొత్తం నలుగురు చనిపోగా.. మరో నలుగురు గాయపడ్డారు. నష్టం మాత్రం భారీ స్థాయిలో సంభవించింది.