breaking news
Equity Exchange Traded
-
ఈటీఎఫ్‌లకూ మార్జిన్ ట్రేడింగ్ సదుపాయం
న్యూఢిల్లీ: ఈక్విటీ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)కు సైతం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్) అందించేందుకు బ్రోకర్లకు సెబీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గ్రూప్ 1 కింద ఉన్న కొన్ని స్టాక్స్‌కు మాత్రమే మార్జిన్ ట్రేడింగ్ సదుపాయాన్ని బ్రోకర్లు అందిస్తున్నారు. ఒక పెట్టుబడి సాధనంగా ఈటీఎఫ్‌లో ఉండే పారదర్శకత, వైవిధ్యం, తక్కువ వ్యయాల వంటి అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని ఈటీఎఫ్ యూనిట్లను సైతం అర్హత కలిగిన సెక్యూరిటీగా పరిగణిస్తున్నట్టు సెబీ తెలిపింది. అలాగే, ఎంటీఎఫ్‌కు తనఖాగా ఈ యూనిట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. క్లయింట్లు బ్రోకర్లకు చెల్లించే ముందస్తు మార్జిన్ అన్నది నగదు, నగదు సమానం లేదా ఈక్విటీ ఈటీఎఫ్‌ల రూపంలో ఉండొచ్చని సెబీ తెలిపింది. ఇందుకు సంబంధించి బోర్డు ఆమోదంతో కూడిన ఒక విధానం ఉండాలని స్పష్టం చేసింది. అంటే ఒక విధంగా గ్రూప్1లో ఉన్న స్టాక్స్‌కు సమానంగా ఈక్విటీ ఈటీఎఫ్‌లను ఇక మీదట పరిగణించనున్నారు. -
ఐదేళ్లలో లక్ష కోట్లకు ఈటీఎఫ్ ఆస్తులు
ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ ముంబై: దేశంలో ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ (ఈటీఎఫ్) ఫండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, త్వరలోనే వీటి ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎఎస్‌ఈ) అంచనా వేస్తోంది. గత 12 ఏళ్లలో ఈటీఎఫ్ ఆస్తుల విలువ 12 రెట్లు పెరిగాయని, వచ్చే ఐదేళ్లలో ఈటీఎఫ్‌లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అన్నారు. సోమవారం ముంబైలో జరిగిన ‘ఈటీఎఫ్ కాన్ఫరెన్స్ 2015’ సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈక్విటీ ఈటీఎఫ్‌ల్లో 97 శాతం ఆస్తులను ఎన్ఎస్ఈ నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం ఈక్విటీ ఈటీఎఫ్ ఆస్తుల నిర్వహణ విలువ రూ. 10,000 కోట్ల లోపునకే పరిమితమయ్యింది. ఈటీఎఫ్‌లకు డిమాండ్ పెరగనుండటంతో రానున్న కాలంలో కమోడిటీ విభాగంలో కూడా ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈమధ్యనే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గిల్ట్ విభాగాల్లో ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సెబీ చీఫ్ యు.కె. సిన్హా మాట్లాడుతూ ఈటీఎఫ్‌ల్లో మరింత పారదర్శకత తీసుకురానున్నట్లు తెలిపారు. పెట్టుబడి సాధనాల్లో ఈటీఎఫ్‌లు అతి ముఖ్యమైనవని, కానీ కొత్త పథకాలను సృష్టించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బయట దేశాలవలే రిస్క్‌తో కూడుకున్న పథకాలు ప్రవేశపెట్టడానికి దూరంగా ఉండాలన్నారు.