breaking news
epass books
-
ఇక ఈ–పాస్ బుక్‌లు
ఆదిలాబాద్ అర్బన్ : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రానున్నాయి. పాత పట్టాదారు పాస్‌బుక్ స్థానంలో కొత్తగా ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులో తేనుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే సోమవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ యేడాది ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం పథకంతో పాటు రైతులకు కొత్త పాసు పుస్తకాల పంపిణీ విషయమై చర్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పాత వాటిని సేకరించి వాటి స్థానంలో కొత్త పాసు పుస్తకాలను రైతులకు అందించే విధంగా ముందడుగు వేస్తున్నారు. అయితే కొత్త పాస్ పుస్తకాలను రైతులకు ఏ విధంగా పంపిణీ చేద్దామనే దానిపై జిల్లా ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం తర్వాత ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని, జిల్లాలో ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 1,38,125 పాస్ పుస్తకాలు.. జిల్లాలో గత మూడు నెలలుగా నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. భూ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా సరిగ్గా ఉన్న భూములకు కొత్త పట్టా పాసు పుస్తకాలు సులభంగా రానున్నాయి. జిల్లాలో నిర్వహించిన భూ సర్వే ద్వారా 3,56,633 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది. ఈ భూముల పరిధిలో 1,38,125 పట్టాపాసు పుస్తకాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో 1,29,326 పట్టా పాసు పుస్తకాలు ఎలాంటి తప్పులు లేకుండా ఉన్నాయని అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. మిగతా 8,799 పాసు పుస్తకాల్లో వివిధ రకాల తప్పులు ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది. సరిగ్గా ఉన్న పాసు పుస్తకాల స్థానంలో ఎలాంటి ఆటంకం కలుగకుండా కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవీ కాకుండా వివాదాలు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు కూడా భూ సర్వే ద్వారా అధికారుల దృష్టికి వచ్చాయి. వివాదాలు లేని భూములను పరిశీలించిన అధికారులు.. వివాదాలు గల భూములను పక్కన పెట్టారు. ఏ వివరాల ప్రకారం, ఎప్పుడు, ఎవరితో పంపిణీ చేయాలి అనే దానిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 1.39 లక్షల పుస్తకాలు అవసరం కొత్త ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తే జిల్లాకు 1.39 లక్షల పాస్ పుస్తకాలు కావాలని జిల్లా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇందుకు భూ సర్వేకు ముందు ఉన్న రైతులు, పాస్బుక్ల వివరాలు, భూ సర్వే తర్వాత తేలిన రైతులు, పాస్బుక్ల వివరాలు సరిపోల్చుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తక్షణమే పంపిణీకి చర్యలు తీసుకునేలా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే కొత్త పాస్ పుస్తకాలు ఎక్కడి నుంచి తెవాలి? ప్రింటింగ్ ఎక్కడ చేయించాలి? జిల్లాలో ప్రింటింగ్‌కు అనుమతిస్తారా? లేక సీసీఎల్ఏ నుంచి సరఫరా చేస్తారా? అ నే దానిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉం ది, రైతులకు ఫిబ్రవరిలో కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమైతే ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. -
పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
- రైతులకు సకాలంలో ఈ పాసుపుస్తకాలు ఇవ్వాలి - రెవెన్యూ సిబ్బందితో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దేవనకొండ: రైతులు ఈ–పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకుంటే కారణాలు చెప్పకుండా ఎందుకు తిరస్కరిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటివి మళ్లీ పునరావృతమైనా, పనితీరు మార్చుకోకపోయినా విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన పత్తికొండకు వెళ్తూ దేవనకొండలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరా్వత జేసీ హరికిరణ్, ఆర్డీఓ ఓబులేష్, రెవెన్యూశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 417 మంది ఈ–పాసు పుస్తకాలకు దరఖాస్తులిసే్త ఎందుకు రిజెక్ట్ చేశారని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ–పాసుపుస్తకాలను 30 రోజులు గడిచినా ఎందుకు ఇవ్వడం లేదో తనకు కారణాలు చెప్పాలన్నారు.ఇక నుంచి రైతులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూడాలన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనాలను నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని ఆర్డీఓ ఓబులేష్ డిప్యూటీ సీఎంకు విన్నవించారు. తర్వాత గాలిమరల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు ఉపముఖ్యమంత్రి పరిహార చెక్కులను అందజేశారు. సమావేశంలో తహసీల్దార్ తిరుమలవాణి, డిప్యూటీ తహసీల్దార్ రంగన్న, ఎంపీడీఓ ఉమామహేశ్వరమ్మ, ఆర్ఐ ఆదిమల్లన్నబాబు, ఆయా గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు.