అగ్రిమెంట్లతోనే సరి...!
కైకలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. అగ్రిమెంట్లతోనే అనేక మంది సరిపెట్టుకుంటున్నారు. ఈసీల కోసం ‘ఈ’ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు నానాటికీ పెరిగిపోతున్నాయి. అలా వచ్చిన దరఖాస్తులకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అప్రూవల్ చేయాల్సి ఉంది. అదే విధంగా బ్యాంకు రుణాల కోసం వెళితే ఈసీ తప్పనిసరిగా అడుగుతున్నారు. రుణాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా స్టాంపు డ్యూటీ, ప్రాంకింగ్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
కైకలూరు సబ్ రిజిష్ట్రారు పరిధిలో కైకలూరు మండలంలో 23, కలిదిండి మండలంలో 14, మండవల్లిలో 3, ముదినేపల్లి మండలంలో 1 గ్రామం ఉన్నాయి. కైకలూరు రిజిష్ట్రారు కార్యాలయంలో జూన్ నెలలో 461 దస్తావేజులకు గానూ రూ. 36 లక్షల 18వేల 183, జులై నెలలో 451 దస్తావేజులకు గానూ 31 లక్షల 51వేల 286 ఆదాయం వచ్చింది. ప్రతి రోజూ కనీసం 60 ఈసీలను అప్రూవల్ చేస్తున్నారు. ఇటువంటి సేవలన్నీ నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 7 నుంచి సబ్ రిజిష్ట్రారు కార్యాలయాల్లో ఎక్కడ నుంచైనా దస్తవేజులు అన్లైన్లో తీసుకునే అవకాశం కల్పించారు. దీంతో సేవలు సులభతరమని ప్రజలు భావిస్తున్న తరుణంలో సమ్మె కారణంగా సేవలు నిలిచిపోయాయి. విభజనపై ఏదో ఒక నిర్ణయం వచ్చి త్వరగా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావాలని ప్రజలు కోరుతున్నారు.
సమైక్యం సాధించే వరకు తలుపులు తెరవం....
సమైక్యాంధ్ర ప్రకటన నిర్ణయం వచ్చే వరకు కార్యాలయం తలుపులు తెరుచుకోవని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి సిబ్బంది సమ్మెబాట పట్టారు. జిల్లాలో మచిలీపట్నం రిజిష్ట్రార్ పరిధిలో మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, మొవ్వా, పామర్రు, గుడివాడ, కానుమోలు, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, బంటుమిల్లి, పెడన, కౌతరం, విజయవాడ రిజిస్ట్రార్ పరిధిలో ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, నున్న, పడమట, విజయవాడ గాంధీనగర్న్నాయి. అలాగే విజయవాడ ఈస్ట్ రిజిస్ట్రార్ పరిధిలో గన్నవరం, గుణదల, కంకిపాడు, మైలవరం, నూజివీడు, తిరువూరు, విస్సన్నపేట, ఉయ్యూరు ఉన్నాయి. 130 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కేకేవీ భాస్కరరావు సీమాంధ్ర జేఏసీ కో- కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.