breaking news
DR.C. Narayana Reddy
-
అక్షరానుబంధం
బురద నవ్వింది కమలాలుగా పువ్వు నవ్వింది భ్రమరాలుగా పుడమి కదిలింది చరణాలుగా జడిమ కదిలింది హరిణాలుగా నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది ... ప్రకృతి నేపథ్యాన్ని అక్షర మాలలుగా మలచిన కవి సి.నారాయణరెడ్డి సృష్టి ‘విశ్వంభర’. అందుకు వేదికై స్ఫూర్తి నింపింది ఈ ‘భాగ్య’నగరమే! విద్యార్థిగా ఆయున ప్రస్థానం మొదలైంది ఇక్కడే. కవిగా, ఆచార్యునిగా.. సాహితీ జగతిలో ఎంతగా ఎదిగితే, అంతగా పెనవేసుకుంది ఈ నగరంతో ఆయున అనుబంధం. అక్షర శిల్పి సినారెకు ఈ చారిత్రక నగరంతో మరపురాని జ్ఞాపకాలెన్నో! వాటిలో కొన్ని ఆయున మాటల్లోనే.. జ్ఞాపకం డా॥సి. నారాయణరెడ్డి భారత్‌కు 1947లోనే స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలన నుంచి 1948లో విమూక్తి లభించింది. కరీంనగర్ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్నా. ఉర్దూ మీడియుం. తర్వాతి ఏడాది ఇంటర్. ఆ రోజుల్లో జిల్లా స్థాయిలో కళాశాలలు లేవు. అబిడ్స్‌లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్లో చేరా. అక్కడ తెలుగు విద్యార్థులు కూడా ఉర్దూలోనే మాట్లాడుకొనేవారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బీఏ కూడా ఉర్దూ మాధ్యమమే. ఎంఏ తెలుగు చదివాను. ఓయూ హాస్టల్లో ఉండేవాణ్ణి. అంతకుముందు పేయింగ్ గెస్ట్‌గా సికింద్రాబాద్‌లో మకాం. హిందీ పాటలను తెలుగులో.. ఎక్కువగా హిందీ సినిమాలు చూసేవాళ్లం. సుల్తాన్‌బజార్ ‘దిల్షాద్’, జీపీవో సమీపంలోని ప్యాలెస్, కింగ్ కోఠి ప్రాంతంలో రాయల్ టాకీస్ అప్పట్లో పెద్ద థియేటర్లు. ప్యాలెస్‌లో ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. స్నేహితులకు ఆ సినిమాల్లోని పాటలను తెలుగులోకి అనువదించి పాడి వినిపించేవాడిని. ఇప్పటికీ గుర్తుందో పాట... ‘బర్సాత్’ చిత్రంలోనిది.. ‘ఛోడ్గయే బాలమ్..’ దీనికి తెలుగులో... ‘వీడితివా రాణీ... ఏకాకిగా నను వీడితివా’... అంటూ వెంటనే అందుకునేవాడిని. దాశరథితో కలసి.. దాశరథి, మహాకవి కాళోజీ గారు, నేను ప్రధాన పాత్రధారులుగా ‘తెలంగాణ రచయితల సంఘం’లో పనిచేశాం. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లో తెలుగు భాషా వికాసానికి కృషి చేశాం. అప్పుడు సాహిత్యమే ఉద్యమం. సాయంత్రం వేళ బొగ్గులకుంట శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో సాహితీ సభలు జరిగేవి. అక్కడ ఎన్నో గ్రంథాలు చదివేవాడిని. తెలుగు సాహిత్యంలో ఓయూ నుంచి పీజీ, డాక్టరేటు పొందాను. తొలుత సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, తరువాత నిజాం కళాశాలలో అధ్యాపకునిగా, ఓయూలో ఆచార్యునిగా పనిచేశా. అంబేద్కర్ విశ్వవిద్యాలయం (1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (1989) ఉపాధ్యక్షుడిగా, అంతకుముందు రాష్ట్ర భాషా సంఘం అధ్యక్షుడిగా.. ఈ నగరంలోనే ఎన్నో పదవులు అలంకరించాను. ‘అభ్యుదయం... అప్పట్లో ‘అభ్యుదయ రచయితల సంఘం’తో సంబంధాలుండేవి. దీని ద్వారా వార్షిక సమ్మేళనాలు నిర్వహించేవాళ్లం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహా కవి శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారితో పరిచయం ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో తెలుగుదనం నింపుకున్న గొప్ప గొప్ప రచయితలు ఎందరో భాషకు సేవ చేశారు. ప్రముఖ రచయిత, కమ్యూనిస్టు నాయకుడు వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ నాలాంటి వారికెందరిలోనో స్ఫూర్తి నింపిన నవల. ఆప్తమిత్రులు... నా సహాధ్యారుు డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి నాకు ఆప్త మిత్రుడు. నేను ఆచార్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన అధ్యాపకుడిగా ఉండేవాడు. విద్యాభ్యాసంలో ఒక ఏడాది వెనుక పడ్డాడు. నాకంటే ఉర్దూపై బాగా పట్టు ఉన్నవాడు. క్రమక్రమంగా నా రచనలకు అండగా నిలిచాడు. ఇక దాశరథి, నేను అత్యధిక భాగం కలసి తిరిగేవాళ్లం. ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు వయసులో పెద్దవాడైనా ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రావి నారాయణరెడ్డిగారితో పరిచయం ఏర్పడింది. నిజంగా అదో మధురానుభూతి. ఆయనపై లఘు చిత్రం తీశాం. ఈ మహానగరంతో ముడివేసుకున్న ఎన్నెన్నో అపురూప జ్ఞాపకాలు. చెప్పుకుంటూ పోతే అదో గ్రంథమే అవుతుంది. - హనుమా -
అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి...
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ‘బంగారు గాజులు’ చిత్రంలో డా॥సి.నారాయణరెడ్డి గారు రాసిన అన్ని పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అందులోని అన్నాచెల్లెళ్ల అనురాగానికి గీటురాయిగా నిలిచిన ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది’ అనే పల్లవితో మొదలయ్యే గీతం... పల్లవిలోనే మన దేశంలోని గృహవ్యవస్థలోని ఆప్యాయతల్ని, అనుబంధాల్ని, అనురాగాల్ని ముఖ్యంగా మన దేశంలో అన్నాచెల్లెళ్ల బంధంలోని గొప్పతనాన్ని తెలియజేసే పాట. మన తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధాలని తెలిపే పాటలు చాలా వచ్చినా ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఆ అనుబంధంలోని మాధుర్యాన్ని తెలిపే మధురగీతంగా నిలిచింది. చెల్లిని కంటికిరెప్పలా చూసుకొనే అన్న... ఆ అన్నయ్యను ఉద్దేశించి చెల్లి పాడే పాట. పల్లవిలో... నా అన్న నా వ ద్ద ఉంటే అదే గొప్ప నిధి, అదే తన సంపద... అంటుంది. ఆ తర్వాత చరణంలో ‘ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై/ చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో/ కన్నకడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము’ అనే వాక్యాల సారాంశం... తామిద్దరం ఒకే తల్లి కడుపులో పుట్టి, తల్లిదండ్రుల దీవెనతో సర్వకాల సర్వావస్థలయందు చల్లగా వర్థిల్లుతాం అని తెలుపుతుంది. ‘కలిమి మనకు కరువై నాకాలమెంత ఎదురైన/ ఈ బంధం విడిపోదన్న ఎన్నెన్ని యుగాలైన/ ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్న’ అంటూ సాగే ఈ రెండవ చరణంలో నేను బతికున్నంత కాలం నీ వెంట... సంపద ఉన్ననాడు కాని, లేనినాడు ఒకే రీతిగా ఉంటానంటూ... ఎన్ని కష్టాలొచ్చినా, కడగళ్లు ఎదురైనా, మన అనుబంధాన్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరంటూ, నీవు నన్ను కంటికిరెప్పలా చూసుకుంటున్న విధంగానే, నేను కూడా నీకు అన్నివేళలలో నీడగానే ఉంటానంటూ.... తెలిపే ఈ గీతం ఈ నాటికీ మధురమే! ఈ చిత్రంలోని పాటలు ప్రసిద్ధి చెందడానికి కారణం ప్రముఖ సంగీత దర్శకులు కీ॥టి.చలపతిరావు అందించిన స్వరాలు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన చాలా చిత్రాలకు చలపతిరావు గారే స్వరాలందించడం విశేషం. అన్నయ్య సన్నిధి పాటకు సంబంధించి సినారె తన మనసులో ఊహించుకుని రాసిన ట్యూన్‌ని టి.చలపతిరావుగారికి వినిపిస్తే దానికి ఆయన ‘బాగానే ఉంది కాని... మనం మరోలా చేద్దాం’ అంటూ ఈ పాటను ఇప్పుడు మనం వింటున్న ట్యూన్లో చేశారట. ఆ కాలంలో హిందీ చిత్ర గీతాల్లో మకుటాయమానంగా నిలిచిన ‘చౌద్వీ కా చాంద్ హో..’ అనే పాట ట్యూన్‌ని యథాతథంగా కాకుండా, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రాగ ఛాయలో ఈ పాటను స్వరపరిచినట్టు సినారె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ పాటలో చెల్లిగా నటించిన విజయనిర్మల, ఆ చెల్లెలిపై అంతే అనురాగం కలిగిన అన్నయ్య పాత్రలో అక్కినేని అభినయం అంతే అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసిన వారికి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటుంది ఇందులోని ఈ పాట. సాహిత్యం, సంగీతం చక్కగా కుదిరితే ఒక పాట ఎంత పాపులర్ అవుతుందో చెప్పడానికి ఈ పాట ఉదహరణ. ఇలాంటి విలువలు ఉన్న పాటలు ఇప్పుడు మన సినిమాలో లేకపోవడానికి మన విద్యావిధానం నుండి ‘నీతిశాస్త్ర’ పాఠ్యాంశాన్ని తీసివేయడం ఒక కారణం. నేటి మన చిత్రాల్లో కుటుంబ సంబంధాలు, వాటి విలువలకు సంబంధించిన అంశాలు మృగ్యమౌతుండడం వల్లనే నేడు ‘నిర్భయ, అభయ’ వంటి ఘోర సంఘటనలు సమాజంలో చోటుచేసుకుంటున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - మాస్టార్జీ సినీ గీతరచయిత సంభాషణ: నాగేశ్