breaking news
District Panchayat
-
‘స్వచ్ఛభారత్’ లక్ష్యంగా పనిచేయాలి
జిల్లాపరిషత్ : ‘స్వచ్ఛభారత్’ లక్ష్యంగా పనిచేయాలని జిల్లాపంచాయతీ అధికారి (డీపీవో) కృష్ణమూర్తి సూచించారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోగల జెడ్పీ సమావేశ మందిరంలో ‘స్వచ్ఛ’ పక్షోత్సవాలపై టీవోటీలకు ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడారు. 2019 అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి ఉందని, అప్పటివరకు దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా మార్చాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పొడి చెత్త, తడి చెత్తను వేరువేరుగా చేసి డంపింగ్ యార్డులలో పారేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలని డీపీవో ప్రజలకు సూచించారు. 2న గ్రామసభలు నిర్వహించాలి.. స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి 15 వరకు స్వచ్ఛ పక్షోత్సవాలను నిర్వహించాలని ఆదేశించిందన్నారు. అందులో భాగంగా 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా గ్రామసభను ఏర్పాటుచేసి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. 15వ తేదీన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాలన్నారు. శిక్షణ పొందిన టీవోటీలు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, గ్రామజ్యోతి ఏడు కమిటీల కన్వీనర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. స్వచ్ఛ పక్షోత్సవాలను విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాలని డీఎల్పీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలకు సూచించారు. పక్షోత్సవాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల జాబితాను టీవోటీలకు అందజేశారు. శిక్షణలో డీఎల్పీవోలు హనూక్, రాములు, ఎంవోటీలు సంజీవ్‌కుమార్, చందర్ నాయక్, నాగవర్ధన్, సతీశ్‌రెడ్డి, రాంనారాయణ, వీరభద్రం, టీవోటీలు పాల్గొన్నారు. -
గుజరాత్లో తప్పనిసరి ‘ఓటు’
రాజ్‌కోట్/అహ్మదాబాద్: గుజరాత్లో వచ్చే అక్టోబర్ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ‘తప్పనిసరి ఓటు’ నిబంధనలు ప్రవేశపెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను బీజేపీ సర్కారు తోసిపుచ్చింది. ‘‘ఓటు వేయటం తప్పనిసరి చేస్తూ బిల్లుకు సంబంధించిన నిబంధనలు నోటిఫై చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చట్టాన్ని కార్పొరేషన్, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అమలు చేస్తాం. ఓటు వేయని వారి కోసం మేం నిబంధనలు రూపొందిస్తున్నాం. వాటిని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పాటిల్ గురువారం రాజ్‌కోట్‌లో విలేకరులకు తెలిపారు. ఇలాంటి చట్టం నియంతృత్వ పాలనకు ప్రతీక అని ప్రతిపక్షనేత శంకర్‌సింగ్‌వాఘేలా విమర్శించారు.