Direct Selling industry
-
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
న్యూఢిల్లీ: డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ స్థిరమైన వృద్ధిని చూస్తోంది. పరిశ్రమ విలువ 2024 మార్చి నాటికి రూ.22,150 కోట్లకు చేరుకున్నట్టు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) ప్రకటించింది. ఈ రంగంలో 470 వరకు చిన్న, పెద్ద సంస్థలు దేశంలో సేవలు అందిస్తుండగా, వీటి పరిధిలో కొత్తగా 1.86 లక్షల మంది ప్రత్యక్ష విక్రేతలు (డైరెక్ట్ సెల్లర్స్) 2023–24లో నమోదైనట్టు తెలిపింది. గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24) డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ఏటా 7.15 శాతం చొప్పున వృద్ధి చెందుతూ.. రూ.16,800 కోట్ల నుంచి రూ.22,142 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ఈ రంగంలో ఆరోగ్య సంరక్షణ, పోషకాహార ఉత్పత్తులు అధిక అమ్మకాలతో 64.15 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐడీఎస్ఏ వార్షిక నివేదిక తెలిపింది. కాస్మెటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాల వాటా 23.75 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ రెండు విభాగాల వాటా 2023–24 మొత్తం అమ్మకాల్లో 87.9 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో ఉత్తరాది 29.8 శాతం వాటాతో ముఖ్య పాత్ర పోషిస్తోంది. తూర్పు భారత్ నుంచి 24.2 శాతం అమ్మకాలు కొనసాగగా, ఇందులో పశ్చిమబెంగాల్ నుంచే 11.3 శాతం సమకూరింది. పశ్చిమ భారత్‌లో అమ్మకాలు 22.4 శాతంగా ఉంటే, దక్షిణాదిన 15.3 శాతం అమ్మకాలు కొనసాగాయి. ఎనిమిది రాష్ట్రాలతో కూడిన ఈశాన్య భారత్‌లో అమ్మకాలు 8.3 శాతంగా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రధాన మార్కెట్.. 13 శాతం వాటాతో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో (2023–24) మహారాష్ట్ర అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, యూపీ, బీహార్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, ఢిల్లీ, అసోం, గుజరాత్ టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70 శాతం ఈ రాష్ట్రాల నుంచే వచి్చంది. 2023 మార్చి నాటికి మొత్తం డైరెక్ట్ సెల్లర్స్ 88.06 లక్షలుగా ఉంటే, 2024 మార్చి నాటికి 86.2 లక్షలకు పెరిగారు. చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే ప్రత్యక్ష విక్రేతల్లో 56 శాతం మంది పురుషులు కాగా, 44 శాతం మహిళలు ఉన్నారు. మొత్తం విక్రేతల్లో 73.2 శాతం 25–54 ఏళ్ల వయసులోని వారు కావడం గమనార్హం. అంతేకాదు విక్రేతల్లో అత్యధికులకు ఉన్నత విద్యార్హతలున్నాయి. 52 శాతం మంది గ్రాడ్యుయేషన్, 26 శాతం మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారే. ప్రత్యక్ష విక్రయాల్లో ఇళ్ల నుంచి చేసేవి అధికంగా ఉన్నాయి. డిజిటల్ ఛానళ్ల ద్వారా అమ్మకాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. 17 శాతం విక్రేతలు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర వాటి సాయంతో అమ్మకాలు పెంచుకుంటుంటే, 15 శాతం మంది వాట్సాప్, మెస్సేజింగ్ యాప్స్ సాయం తీసుకుంటున్నారు. -
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమతో భారీగా ఉద్యోగాలు
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ వల్ల భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా (ఏడీఎస్‌ఈఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ (ఫిడ్సీ) సహకారంతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్’లో ఆయన పాల్గొని మాట్లాడారు.‘ఈ పరిశ్రమ ద్వారా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చు. స్థానికంగా ఈ రంగం వృద్ధి చెందితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఈ పరిశ్రమలో సేవలందించే సంస్థలు నైతిక పద్ధతులను పాటిస్తూ స్థిరాభివృద్ధిపై దృష్టి సారించాలి. వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వం పోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంలో తయారీ యూనిట్లు స్థాపించేందుకు సంస్థలు ముందుకురావాలి. ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో సేవలందించే సంస్థలకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుంది’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ..‘పారదర్శకంగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించడంలో ఈ పరిశ్రమ కీలకంగా మారనుంది. మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ద్వారా మెరుగైన సేవలందించేందుకు వీలుగా స్టేట్ మానిటరింగ్ కమిటీను త్వరలో ఏర్పాటు చేస్తాం. ఇది వినియోగదారులు, సంస్థల ప్రయోజనాలను కాపాడుతుంది’ అన్నారు. ఏడీఎస్‌ఈఐ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘డైరెక్ట్ సెల్లింగ్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వంతో జతకట్టడం సంతోషకరం. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకారం నెలకొల్పేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది’ అన్నారు.ఈ సందర్భంగా ఏడీఎస్‌ఈఐ, ఫిడ్సీ సంస్థలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అభివృద్ధికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతామని ప్రకటించాయి. ఈ సమావేశంలో సామాజిక బాధ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతో పాటు, భవిష్యత్తులో డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగంపై చర్చించారు.ఇదీ చదవండి: మానవ వనరులను ఆకర్షించడంలో విఫలంరిటైల్ వ్యాపారులు, దళారులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీదారుల నుంచి ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే ‘డైరెక్ట్ సెల్లింగ్’. భవిష్యత్తులో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానంలో దళారులు లేకపోవడంతో తుది ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ విలువ ఏకంగా 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి ఈ పరిశ్రమ ఏటా 6.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా. -
మహిళలే మహారాణులు,డెరెక్ట్ సెల్లింగ్లోకి 53 లక్షల మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 మహమ్మారితో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో కొత్త అవకాశాలను వెతుక్కున్నారు. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ రంగం ఒకటి. 2020 ఏప్రిల్–సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలోకి ఏకంగా 53.18 లక్షల మంది ప్రవేశించారని ఐడీఎస్ఏ చెబుతోంది. డైరెక్ట్ సెల్లింగ్ విపణిలో 2019–20లో దేశవ్యాప్తంగా 74 లక్షల మంది చురుకైన విక్రేతలు ఉన్నారు. ఇది వార్షికంగా 30% పెరుగుదల. 2019–20 గణాంకాల ప్రకారం అమ్మకందార్లలో సగం మంది మహిళలు ఉండడం గమనార్హం. -
డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు త్వరలో మార్గదర్శకాలు
సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆరు నెలల్లో స్పష్టమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టనున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ తెలిపారు. ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ప్రోగ్రెస్ హార్మనీ డెవలప్మెంట్ చాంబర్ సంయుక్తంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో స్పష్టత లేకపోవడంతో ఈ రంగం ఆశించినంగా వృద్ధి చెందడం లేదన్నారు. వినియోగదార్ల ప్రయోజనాలకు తగిన నిబంధనలు అవసరమని నిపుణులు బిజోన్ మిశ్రా అభిప్రాయపడ్డారు. టాప్‌లో వెల్నెస్, హెల్త్‌కేర్: ఐడీఎస్ఏ-పీహెచ్డీ 2014-15 సంవత్సరానికిగాను వార్షిక నివేదికను ఈ సందర్భంగా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమ భారత్‌లో రూ.7,958 కోట్లు నమోదైందని ఐడీఎస్ఏ చైర్మన్ రజత్ బెనర్జీ తెలిపారు. ఇందులో 42 శాతం వాటా వెల్నెస్, హెల్త్‌కేర్ ఉత్పత్తులదని వివరించారు. నిబంధనల లోపంతో డెరైక్ట్ సెల్లర్ల సంఖ్య 43.83 లక్షల నుంచి 39.3 లక్షలకు పడిపోయిందన్నారు. అయినప్పటికీ పంపిణీ వ్యవస్థపట్ల కస్టమర్ల ఆసక్తి పెరగుతుండడంతో పరిశ్రమ 6.5% వృద్ధి చెందిందని వెల్లడించారు. టర్నోవర్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా 23 శాతంతో రూ.1,830 కోట్లుందని అసోసియేషన్ కోశాధికారి వివేక్ తెలిపారు.