breaking news
Deveshwar
-
ఐటీసీని మలిచిన శిల్పి
సాధారణ ఉద్యోగిగా చేరిన ఓ వ్యక్తి తనకు ఉపాధినిచ్చిన కంపెనీకి కొత్త జీవాన్నిచ్చారు. చిన్న చెట్టును మర్రిమానును చేశారు. కేవలం సిగరెట్లను అమ్ముకునే ఓ కంపెనీని, ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, అగ్రి, తదితర ఉత్పత్తులతో ప్రతీ భారతీయ ఇంటికీ చేరువ చేశారు. భారత కార్పొరేట్ సామ్రాజ్యంలో ఓ చెక్కు చెదరని, బలమైన కంపెనీగా ఐటీసీని మలిచిన శిల్పి యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్). కేవలం వ్యాపార కోణంతో కాకుండా సామాజిక కోణాన్ని జోడించి, దేశానికి అవసరమైన సంస్థగా ఐటీసీని దేవేశ్వర్ నిలిపారనడం సరైనది. దేశంలో 60 లక్షల మందికి ఉపాధి కూడా చూపించారు. తాను పెంచి పెద్ద చేసిన కంపెనీని, కోట్లాది వినియోగదారుల్ని 72వ ఏట విడిచి మే 11న దిగంతాలకు వెళ్లిన గొప్ప దార్శనికుడు, పద్మభూషణ్ దేవేశ్వర్ గురించి. శాఖోపశాఖలుగా... కాలేజీ నుంచి బయటకు వచ్చి ఉద్యోగిగా చేరిన కంపెనీకే అధినేతగా ఎదగడమే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు అంటే 23 ఏళ్లు ఐటీసీకి చైర్మన్ గా పనిచేయడం దేవేశ్వర్కే సాధ్యమైంది. చిన్న వయసులోనే చైర్మన్ అయిన వ్యక్తిగానూ, ఓ కార్పొరేట్ సంస్థకు సుదీర్ఘకాలం పాటు అధినేతగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. 1968లో దేవేశ్వర్ ఐటీసీ ఉద్యోగిగా తన ప్రయాణం ఆరంభించారు. 1984లో కంపెనీ బోర్డులో చేరారు. 1996లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఐఐటీ ఢిల్లీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి ఆయన. దేవేశ్వర్ కంపెనీ సారధ్య బాధ్యతలు చేపట్టే నాటికే కోల్కతా కేంద్రంగా నడిచే ఐటీసీ కంపెనీ నాన్ టొబాకో వ్యాపారాల్లోకీ ప్రవేశించింది. కానీ, వాటి పరిధి చాలా తక్కువ. రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు పొగాకును ఆరోగ్యాన్ని కబళించే ఉత్పత్తిగా చూసే పరిస్థితులను దేవేశ్వర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఐటీసీని ఇతర వ్యాపారాల్లో బలమైన కంపెనీగా నిలిపే ప్రణాళికలను అమల్లో పెట్టారు. ఫలితమే ఎఫ్ఎంసీజీ, హోటల్స్, పేపర్ బోర్డు పరిశ్రమల్లోనూ ఐటీసీ బ్రాండ్ అగ్రగామిగా ఎదిగింది. పాలు, పాల ఉత్పత్తులు, పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అగర్బత్తీలు, సబ్బులు, స్టేషనరీ, వస్త్రాలు, ప్యాకేజింగ్, లగ్జరీ, హోటళ్లు, అగ్రి ఇలా ఎన్నో వ్యాపార విభాగాలు ఐటీసీ కింద ఉన్నాయి. ఎన్ని వ్యాపారాల్లోకి ప్రవేశించినా వాటన్నింటినీ ఐటీసీ కొమ్మలుగా, ఒకే కంపెనీగా దేవేశ్వర్ కొనసాగించారు. ఇప్పుడు ఐటీసీకి సిగరెట్లు ఒక్కటే ప్రధాన వ్యాపారం కాదన్నట్టుగా మార్చారు. 2018 మార్చి నాటికి ఐటీసీ స్థూల ఆదాయం రూ.67,081 కోట్లు కాగా, నికర లాభం రూ.11,223 కోట్లు. 2018–19 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి వుంది. గ్రామీణ రైతులతో అనుసంధానం ఈచౌపల్ ఐటీసీ ప్రారంభించిన ఓ వినూత్న విధానం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను ఇంటర్నెట్కు అనుసంధానించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. తద్వారా రైతుల నుంచి నేరుగా ఉత్పత్తుల సమీకరణకు ద్వారాలు తెరిచారు. ప్రారంభంలో ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ దీర్ఘకాల దృష్టితో దాన్ని కొనసాగించింది ఐటీసీ. దేవేశ్వర్ క్లిష్ట సందర్భాల్లోనూ దృఢంగానే వ్యవహరించారు. కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న బ్రిటిష్ అమెరికన్ టుబాకో (బీఏటీ) ఐటీసీని పూర్తిగా సొంతం చేసుకునే వ్యూహాలు పన్నగా, దాన్ని నిరోధించడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఐటీసీలో అత్యధిక వాటా దేశీ మ్యూచువల్ ఫండ్స్, భారత ప్రభుత్వం వద్ద వుంది. ఎయిర్ ఇండియా బాధ్యతలు భారత ప్రభుత్వం కోరిక మేరకు 1991–94 మధ్య కాలంలో ఐటీసీ నుంచి విరామం తీసుకుని ఎయిర్ ఇండియా చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను దేవేశ్వర్ చూశారు. ఆ సమయంలోనే బీఏటీ ఐటీసీని తన సొంతం చేసుకోవాలన్న ప్రయత్నాలను మొద లు పెట్టడం గమనార్హం. ఐటీసీకి తిరిగొచ్చిన తర్వాత వైస్ చైర్మన్ గా బాధ్యతల్లోకి చేరిపోయారు. ఎయిర్ ఇండియాలో పనిచేసిన కాలం ఆయనకు గొప్ప అనుభవాన్నిచ్చింది. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, వాటితో ఎలా మెలగాలో తెలుసుకోగలిగారు. ఉద్యోగులకు మార్గదర్శకుడు బహుముఖ వ్యాపారాలతో కూడిన ఐటీసీ అన్ని విభాగాల్లో రాణించడానికి కారణం... ఆయా విభాగాల్లోని యువ ఉద్యోగులపై నమ్మకం ఉంచడం. వారికి మార్గదర్శకులుగా వ్యవహరించడమే. అందుకే కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు వీడినప్పటికీ... 2022 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఐటీసీ బోర్డు ఆయన్ను నియమించుకుంది. ప్రస్తుతం ఐటీసీ ఎండీ బాధ్యతలను సంజయ్పురి నిర్వహిస్తున్నారు. దేవేశ్వర్కు కేన్సర్ ఉన్నట్టు కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఏడాది క్రితం ఢిల్లీకి ఆయన మకాం మార్చారు. అయినప్పటికీ ఐటీసీ సీనియర్ మేనేజ్మెంట్కు అందుబాటులోనే ఉన్నారు. ఇంటింటికీ ఐటీసీ బ్రాండ్లు ఇతర వ్యాపారాల్లోకి బహుముఖంగా ఐటీసీ చొచ్చుకుపోయినా గానీ, తొలుత ఆరంభించిన సిగరెట్ల వ్యాపారాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. దేశ సిగరెట్ల మార్కెట్లో 80 శాతానికి పైగా వాటా ఐటీసీ చేతుల్లోనే ఉంది. ఆశీర్వాద్, సన్ ఫీస్ట్, క్లాస్మేట్, బింగో, బీ నేచురల్, ఫియామో ఇలా 50 టాప్ బ్రాండ్లను ఐటీసీ సృష్టించింది. ఎనలేని సేవలు దేశ పారిశ్రామిక రంగానికి వైసీ దేవేశ్వర్ ఎన్నో సేవలు అందించారు. ఆయన కృషి వల్లే ఐటీసీ వృత్తి నైపుణ్యం కలిగిన కంపెనీగా అంతర్జాతీయంగా విస్తరించింది– ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని మైలురాళ్లు ♦ 1968లో ఐటీసీలో ఉద్యోగం. 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాధ్యతలు. ♦ 2017లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలకు ముగింపు. ఆ తర్వాత గౌరవ చైర్మన్ బాధ్యతల్లోకి. ♦ ఆర్బీఐ సెంట్రల్బోర్డు డైరెక్టర్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స సభ్యునిగానూ సేవలు అందించారు. ♦ 2011లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను గౌరవించింది. ♦ ప్రపంచంలోనే ఏడో అత్యుత్తమ పనితీరు చూపిన సీఈవోగా 2012లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గుర్తించింది. ♦ దేవేశ్వర్కు భార్య భారతి, కుమారుడు గౌరవ్, కుమార్తె గరిమ ఉన్నారు. -
ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ కన్నుమూత
ముంబై : దేశీయ కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవేశ్వర్ మృతిపట్ల ఐటీసీ కంపెనీ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. భారతీయ కార్పొరేట్ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక దిగ్గజ కంపెనీకి ఛైర్మన్గా కొనసాగిన అతికొద్ది మందిలో దేవేశ్వర్ ఒకరు. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్ అంచెలంచెలుగా ఎదుగుతూ 1996లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవిని అలంకరించారు. ఫిబ్రవరి 5, 2012న మరోసారి డైరెక్టర్గా, ఛైర్మన్గా దేవేశ్వర్ ఎన్నికై 2017 వరకు కొనసాగారు. 2017 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా దేవేశ్వర్ కొనసాగుతున్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. -
ఇక ఐటీసీ చాక్లెట్లు...
కోల్కతా: దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ.. కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. పండ్ల రసాలు, టీ, కాఫీ వంటి పానీయాల(బెవరేజెస్)తో పాటు చాక్లెట్లు, పాల ఉత్పత్తుల(డెయిరీ) రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ ప్రకటించారు. కొత్త విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఇదే అదునైన సమయమని, భవిష్యత్ వ్యాపారాభివృద్ధికి ఈ నిర్ణయాలు దోహదం చేయనున్నాయని బుధవారం ఇక్కడ జరిగిన కంపెనీ 103వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారం నుంచే కంపెనీకి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. ఆ తర్వాత అగ్రి బిజినెస్ నిలుస్తోంది. ఇంకా హోటళ్లు, పేపర్ తదితర విభాగాల్లో బహుముఖ వ్యాపారాలను ఐటీసీ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టిస్తాం... ‘1996లో కంపెనీ పొగాకు ఉత్పత్తుల నుంచి ఇతర రంగాల్లోకి విస్తరించడంపై వాటాదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా కంపెనీ ముందుకెళ్లడం సంతోషించదగ్గ విషయం. కంపెనీ వృద్ధిని విస్తృతం చేయడంలో ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్)యే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు భారత్లో ఐటీసీకి సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగం కూడా ఇదే. అయితే, దీన్ని ఇంకా బలోపేతం చేసేందుకు భారత్ నుంచి అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టించాలనేది కంపెనీ యోచన. బ్రాండ్ల నిర్మాణం సులువేమీ కాదు. మన బ్రాండ్లు ఇక్కడ పూర్తిస్తాయిలో ఆధిపత్యం చాటుకున్నాక.. ఇతర దేశాలకూ వీటిని విస్తరించడంపై దృష్టిపెడతాం’ అని వాటాదారులకు దేవేశ్వర్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ అమలు చేస్తున్న, ప్రణాళికల్లో ఉన్న ప్రాజెక్టులు 65కు పైగా ఉన్నాయని.. వీటిలో పెట్టుబడుల విలువ రూ.25,000 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఎంసీజీ వ్యాపారాల నుంచి 2030 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామని ఈ సందర్భంగా దేవేశ్వర్ చెప్పారు.