breaking news
Democratic Front
-
వేటుకు... మాటు!
కొత్తగా 40 అనుబంధ సంస్థలతో డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు - చత్తీస్‌గఢ్ నుంచి 80 మంది ఏవోబీలోకి చొచ్చుకు వచ్చిన వైనం - చురుగ్గా నూతన ఆర్మ్డ్ దళాల ఏర్పాటు సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన మావోయిస్టులు తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను కొనసాగించడానికి వ్యూహ రచన చేశారా? చాపకింద నీరులా కొత్త దళాలను ఏర్పాటు చేస్తున్నారా? అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్నారా? ఏఓబీలో తిష్ట వేశారా? పోలీసుస్టేషన్లు, భద్రత దళాలను లక్ష్యంగా ఎంచుకున్నారా..? ఈ ప్రశ్నలకు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు అవుననే అంటున్నారు. సుమారు 40 మావోయిస్టు అనుంబంధ సంస్థలతో కలిసి కొత్తగా ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏపీడీఎఫ్) ఏర్పాటు చేశారని, అన్ని విధాలా బలోపేతమయ్యారని చెబుతున్నారు. రాష్ట్ర పోలీసు, ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నం రూరల్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మావోయిస్టులు క్రియాశీలకంగా మారారు. తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఏపీడీఎఫ్ ఏర్పాటు చేశారు. ఇటీవలే చత్తీస్గడ్ క్యాడర్ నుంచి 80 మంది మావోయిస్టులు ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దులో (ఏవోబీ)కి చొచ్చుకువచ్చారు. కొత్తగా ఆర్మ్డ్ దళాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసు ఇన్ఫార్మర్లపై దృష్టి కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్ ద్వారా రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్వహించాలని మావోయిస్టులు నిర్ణయించారని, పోలీసులకు అందిన ఓ డాక్యుమెంట్ ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా తొలుత పోలీసు ఇన్ఫార్మర్లను హతమార్చాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మావోయిస్టులు చత్తీస్‌గడ్‌లోని బెజ్జి, బర్కాపాల్లో మిలటరీ బెటాలియన్‌పై దాడి చేసి 45 మంది భద్రతా సిబ్బందిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పెద్ద ఎత్తున అత్యాధునిక యుబిజిఎల్, మొర్టార్స్ తదితర వెపన్స్ మావోయిస్టుల పరమయ్యాయి. ఎకె–47, ఎస్ఎల్ఆర్లు, లైట్ మిషన్ గన్స్, బారెల్ గ్రనేడ్ లాంచర్లు, 51 ఎంఎం మోర్టార్స్ కూడా లూటీకి గురైన వాటిలో ఉన్నాయి. బారెల్ గ్రనేడ్ లాంచర్లు (200 – 250 మీటర్ల రేంజ్), కిలోమీటర్ రేంజ్ కలిగిన మోర్టార్లు తదితర ఆయుధాలు సమకూరడం వారికి అదనపు బలాన్ని చేకూరుస్తోందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూప్ వాహనం తప్ప అన్ని అత్యాధునిక ఆయుధాలను మావోయిస్టులు కలిగి ఉన్నారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. ఇందువల్ల మావోయిస్టుల్లో నైతిక స్థైర్యం కూడా పెరిగిందని ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. దాడులతో బెంబేలెత్తించాలని వ్యూహం రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు, ఆర్మ్డ్ ఔట్ పోస్టులపైన రాకెట్ లాంచర్లతో దాడులు చేయాలనేది మావోయిస్టుల వ్యూహంలో ప్రధానం. గడిచిన రెండేళ్లలో విశాఖపట్నం ప్రాంతంలో భద్రతా దళాలపై మావోయిస్టులు దాదాపు 20 సార్లు దాడులకు యత్నించడం ఇందుకు తార్కాణం. ఈ వివరాలతో పాటు కింద పేర్కొన్న అంశాలు డీజీపీ నివేదికలో ఉన్నాయి. ► విశాఖపట్నంలోని అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రాళ్లగెడ్డ పర్చూరు ఆర్మ్డ్ ఔట్ పోస్టుపై దాడి చేసేందుకు మావోయిస్టులు మాటు వేశారు. ► వీఐపీలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులను కిడ్నాప్ చేసేందుకు వ్యూహ రచన చేశారు. ► పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం గిరిజనుల పక్షాన నిలబడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాంతంలో న్యూ డెమొక్రసీకి చెందిన చంద్రన్న గ్రూప్‌తో బుట్టాయగూడెం, పోలవరం గ్రామాలు కేంద్రంగా పని చేయాలని నిర్ణయించారు. ► తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో కొత్త దళాల ఏర్పాటు చురుగ్గా జరుగుతోంది. ► వ్యాపారులను హతమార్చడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. -
డిసెంబర్ నుంచి ‘ఆహార భద్రత’
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టదలచిన ‘ఆహార భద్రత’ పథకాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్టు ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్న ఈ పథకాన్ని ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించారు. పేదల ఆకలిని తీర్చి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకే ఈ ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్రంలోని డీఎఫ్ కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 76 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారని అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రతి వ్యక్తికీ అయిదు కిలోల ధాన్యాన్ని అందించనున్నారు. గర్భిణులకు ఉచితంగా ఆహారం సరఫరా చేయనున్నారు. ప్రతి నెలా 388 టన్నుల ధాన్యం సరఫరా... ఆహారభద్రత పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు ప్రతి నెలా సుమారు 388 టన్నుల ధాన్యం అవసరం కానుంది. దీనికిగాను ప్రతి నెలా సుమారు రూ. 800 కోట్లు అవసరమవుతాయి. ఈ పథకం అమలుచేసేందుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుందని, దీంతో రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా కేవలం ధాన్యం నిలువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సుమారు రూ. రెండు వేల కోట్ల వ్యయంతో గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలోని రేషన్‌షాపుల కంప్యూటరీకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. కాగా రాష్ట్రంలో తెలుపు, కేసరీ (ఆరెంజ్), పసుపు రంగు ఇలా మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలో తొలగించి ఉన్నత, మధ్యతరగతి (ప్రాధాన్యం, ప్రాధాన్యంలేని) ఇలా రెండు రకాల కార్డులు మాత్రమే జారీ చేయనున్నారు. ముఖ్యంగా బార్కోడ్లతో ఉండే రేషనింగ్ కార్డు రూపొందిస్తారు. అదే విధంగా కొత్త నియమాల ప్రకారం కుటుంబ పెద్దగా గృహిణి పేరుతో రేషన్ కార్డు జారీ చేయనున్నారు. అనంతరం పాత రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేయనున్నట్టు తెలిపారు.