breaking news
Cyber towers
-
Hyderabad: హైటెక్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయమైన హైటె క్ సిటీ సైబర్ టవర్స్‌కు కూతవేటు దూరంలోని ఓ మార్కెటింగ్ కంపెనీలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న రోహిణి లేఅవుట్లోని ఓ భవనం మూడో అంతస్తులో మూవింగ్ నీడిల్ అనే మార్కెటింగ్ కంపెనీ ఉంది. ఆపైఅంతస్తులో ఇదే కంపెనీకి చెందిన క్యాంటీన్, కెఫెటేరియాను నిర్వహిస్తున్నారు. అయితే శనివారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్లో మంటలు చెలరేగాయి. అదిచూసిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. గంటసేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. క్యాంటీన్లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించిందని, ఫరీ్నచర్ పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం కావడంతో ఉద్యోగులెవరూ లేరని, ప్రాణనష్టం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!) -
Cyberabad Traffic Police: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి
-
సైబర్ టవర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: మందు బాబుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. మద్యం మత్తులో నడుపుతున్న కారు సిగ్నల్‌ను జంప్ చేసి... ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మాదాపూర్ సైబర్ టవర్ సిగ్నల్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతుల్లో గౌతమ్ దేవ్ (33) మృతి చెందగా, భార్య శ్వేతకు తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి బెంజ్ కారును నడుపుతున్నారు. ఆయనతో పాటు మిత్రుడు కౌశిక్ కూడా ఉన్నాడు. కాగా కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశీ విశ్వనాథ్‌ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (హైదరాబాద్: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం) -
సీఎంగా దిగిపోయేనాటికి హైటెక్ సిటీ మొదటిదశా పూర్తికాలేదు!
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే.. హైటెక్‌సిటీ కట్టింది నేనే.. ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానశ్రయమూ నా ఘనతే.. సైబరాబాద్ కట్టింది నేనే.. అసలు తెలంగాణకు ఐటీ తీసుకొచ్చిందీ నేనే.. – ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చేసే వ్యాఖ్యలివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తనకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ సైబరాబాద్ నిర్మాత తానే అంటారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకూ క్రెడిట్ తీసుకుంటారు. తెలంగాణలో కంప్యూటర్ విజ్ఞానాన్ని పరిచేయం చేసింది తానేనని తడుముకోకుండా చెప్పుకుంటారు. బెంగళూరు సిలికాన్ సిటీని అభివృద్ది చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ దానికి తానే కారణమని ఏనాడూ చెప్పలేదు. ముంబై దీన్ని వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే కాదు, అక్కడ చక్కెర రైతుల అభివృద్దికి తోడ్పడిన శరద్ పవార్ ఆ ఘనత తనదేనని ఎప్పుడూ గొప్పలు ప్రదర్శించలేదు. తమిళనాడు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుని తమిళనాడును ముందుకు తీసుకెళ్లిన దివంగత నేత జయలలిత దానికి తానే కారణమని ఏనాడు పొంగిపోలేదు. సాక్షి, హైదరాబాద్: గడిచిన 25 సంవత్సరాల పరిణామక్రమంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నం చేసినప్పుడు ‘ది బర్త్ అండ్ గ్రోత్ అఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ’ అనే గ్రంథం ఒకటి లభ్యమైంది. భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అభివృద్దికి తోడయ్యేలా, దానికి కృషి చేసిన మహనీయులను గుర్తుచేసే ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అదలా ఉంచితే, అసలు సైబరాబాద్‌ను చంద్రబాబే నిర్మించారా? ఆయన పదే పదే చెబుతున్నట్టు అక్కడ ఉన్న కట్టడాలన్నీ ఆయన హయాంలో పూర్తయి సైబరాబాద్‌గా రూపాంతరం చెందిందా? ఈ అనుమానం కూడా రావడంతో వాస్తవాలు కనిపెట్టేందుకు ‘సాక్షి’ గూగల్ ఎర్త్‌ను శోధించిననప్పుడు అవన్నీ బూటకమని, బాబు హయాంలో సైబర్ టవర్ మినహా ఎలాంటి కట్టడం లేదని నిర్ధారణ అయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చర్యల కారణంగా 2010 నాటికి సైబరాబాద్ పూర్తి స్థాయిలో నిర్మితమైంది. 1987లోనే హైదరాబాద్‌లో ‘ఇంటర్‌గ్రాఫ్’ సంస్థ... హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటు 1987లోనే ప్రారంభమైంది. పీవీ నరసింహారావు 1991లో ప్రధానమంత్రి అయ్యాక దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఐటీ పాలసీని తీసుకొచ్చి అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఐటీ కంపెనీలకు స్థలం కేటాయించారు. మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది కూడా మైత్రీవనంలోనే. కంప్యూటర్లు అనగానే గుర్తుకువచ్చే కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ) రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడే ఏర్పాటైంది. అంతకంటే ఐదేళ్ల ముందు 1987 ఆగస్టులో హైదరాబాద్‌లో ఇంటర్‌గ్రాఫ్ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటి. అదే సంవత్సరం రామలింగరాజు తన సమీప బంధువులతో కలిసి సికింద్రాబాద్‌లో ‘సత్యం’ కంప్యూటర్స్‌ను ప్రారంభించారు. అది దినదినాభివృద్ది చెంది 1992లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. తర్వాత దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్భవించింది. ఈ తరుణంలోనే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు పలువురు ముందుకు రావడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌తోపాటు అక్కడ ఐటీ పరిశ్రమకు అవసరమైన మేరకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకీ ఉత్తుత్తి గొప్పలు? కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ రంగంలో వాయువేగంతో దూసుకుపోవడానికి తన వంతు సాయపడ్డ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అందుకు తానే కారణమని ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి తమ వంతు ఐటీ వృద్దికి ఊతమిచ్చినా ఎవరూ చంద్రబాబు మాదిరి గొప్పలు చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రమే పదేపదే ఈ దేశంలో తాను లేకపోతే ఐటీ లేదన్న రీతిలో ఎందుకు మాట్లాడుతున్నారు? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలో 8వ స్థానంలో ఉంది. తెలుగు ప్రజలకు కంప్యూటర్ విజ్ఞానాన్ని తానే నేర్పానని కూడా బాబు పదేపదే చెబుతుంటారు. కానీ అది కూడా ఒట్టిదే అని తేలిపోయింది. దేశాభివృద్దికి సాఫ్ట్వేర్ ఊతమిస్తుందని భావించచడంతో పాటు నిరుద్యోగ నిర్మూలనకు తోడ్పడుతుందన్న భావనతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మొదటి దశలోనే 1992లో హైదరాబాద్‌కు ఆరు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు మంజూరు చేశారు. కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖకు అనుబంధంగా ఏర్పడ్డ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వ శాఖ తొలుత అమీర్‌పేటలోనే ఎస్టీపీఐని ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది మొదటిసారి. ఇంత ముందుచూపుతో పీవీ వ్యవహరించినా ఆ తర్వాత మూడేళ్లకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దానిని పట్టించుకోలేదు. వారిది దూరదృష్టి.. చంద్రబాబుది ‘రియల్’ దృష్టి 1995లో తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగుళూరు ఐటీ రంగంలో దూసుకుపోతున్నా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. పైగా దూరదృష్టితో భవనాలు నిర్మించాలని, భూములు కేటాయించాలని అంతకుముందు ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన చంద్రబాబు.. మొదట ఐటీ రంగాన్ని అభివృద్ది చేయాలనే విషయాన్ని పక్కనపెట్టి, ‘రియల్ ఎస్టేట్’ కోసం దానిని ఉపయోగించుకున్నారు. ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ స్టడీస్‌కు చెందిన రీసెర్చ్ స్కాలర్ దలేల్ బెన్బలాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఏడాది పొడవునా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబు తన కోసం, తన సొంత సామాజికవర్గానికి చెందినవారి కోసం భూములను ఏ విధంగా కొనిపించిందీ, ఆ తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణానికి ఎలా పూనుకున్నదీ పూసగుచ్చినట్లు వివరించారు. సైబర్ టవర్స్ శంకుస్థాపనకు ముందే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నల్లగండ్ల ప్రాంతాల్లో చంద్రబాబు భూములు కొనుగోలు చేయడంతోపాటు తన బినామీల ద్వారా కూడా భారీగా భూములు కొనుగోలు చేయించారు. అక్కడ ఐటీ పరిశ్రమ వస్తుందని తెలియని వందలాది మంది పేదలు తమ భూములను అత్తెసరు ధరకు అమ్ముకున్నారు. పేదల భూములు కాజేయడం ఒక ఎత్తయితే, దశాబ్దాల తరబడి ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు. అదే క్రమంలో తన, తన బినామీల భూముల ధరలు పెరిగేందుకు వీలుగా సైబర్ టవర్స్ నిర్మాణం చేపట్టారు. టెండర్లు లేకుండా దానిని ఎల్అండ్టీకి కేటాయించి, భారీగా నజరానాలు కూడా పొందారు. సైబరాబాద్ నిర్మాత బాబు కానే కాదు.. బాబు ఆపధర్మ సీఎంగా మారిపోయే నాటికి సైబరాబాద్ ప్రాంతంలో ఒక్క సైబర్ టవర్స్ తప్ప మరో నిర్మాణం లేదు. అలాంటప్పుడు ఆయన సైబరాబాద్ నిర్మాత ఎలా అవుతారు? సైబరాబాద్ ప్రాంతం ఒక నగరంగా రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. వాయువేగంతో ఆయన తీసుకున్న చర్యల కారణంగా హైటెక్ సిటీ నిర్మాణం 2008 నాటికి తుది దశకు చేరుకుని కంపెనీలు పని చేయడం మొదలుపెట్టాయి. చంద్రబాబు హయాంలో ఫైనాన్సియల్ జిల్లా ప్రతిపాదనేదీ లేదు. అలాంటప్పుడు తానే నిర్మించానని ఎందుకు చెబుతున్నారు? ఇంతకాలంహైదరాబాద్ను తానే కట్టానని చెప్పిన చంద్రబాబుకు అకస్మాత్తుగా తన దృష్టిని సైబరాబాద్ మీదకు ఎందుకు మళ్లించారు? దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన ఓ పంచ్ కారణం. చంద్రబాబు హైదరాబాద్ కడితే కులీఖుతుబ్షా ఏం కట్టారన్న ప్రశ్నకు చంద్రబాబు దిమ్మె తిరిగింది. ఆ వెంటనే సైబరాబాద్ తానే కట్టానన్న పల్లవి అందుకున్నారు. కానీ, చంద్రబాబు దిగిపోయే నాటికి హైటెక్ సిటీ మొదటి దశ కూడా ప్రారంభం కాలేదు. ఫైనాన్షియల్ జిల్లా ఊసే లేదు. దానికి మించి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా లేదు. ఇవన్నీ వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్నవే. 2003 నాటి గూగుల్ చిత్రాలు చూస్తే ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్న సైబరాబాద్.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన ఆరేళ్లకు గానీ నగరంగా రూపాంతరం చెందలేదు. - మరి చంద్రబాబు మాత్రమే ఎందుకు పదేపదే అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు? - తనకు సంబంధం లేని అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో తన ఘనతేనని ఎందుకు డప్పు వేసుకుంటున్నారు? - హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని,దానికి హైటెక్ సిటీయే నిదర్శనమని ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? - సైబరాబాద్‌ను తానే సృష్టించానని చెప్పుకోవడం, ఆ ఘనతను సొంతం చేసుకోవడానికి ఎందుకంత తాపత్రయం చెందుతున్నారు? ఇది 2004 మే నెలలో నానక్‌రామ్‌గూడ ప్రాంతపు గూగుల్ ఫొటో. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఇంకా మొదలే కాలేదని తెలుస్తోంది. -
స్కూలు ఫీజులను నియంత్రించాలి
- ప్రభుత్వానికి హెచ్ఎస్పీఏ డిమాండ్ - సైబర్ టవర్స్ వద్ద మానవహారం... - ప్లకార్డుల ప్రదర్శన హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో తమిళనాడు, మహారాష్ట్రల తరహా నిబంధనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్గిపెట్టె నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఎమ్మార్పీ ధరకు లభిస్తుంటే.. స్కూల్ ఫీజుల విషయంలో మాత్రం నిర్దిష్ట విధానాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చెబుతున్న చదువుకు.. అమెరికాలో మాదిరిగా ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ వద్ద హెచ్ఎస్పీఏ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ పేరెంట్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతిని ధులు మాట్లాడుతూ స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయించిన రూ. లక్షల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి విద్యా కోర్సుల మాదిరిగా స్కూల్ ఫీజులు నియంత్రించడానికి ఏఎఫ్ఆర్సీని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. గతేడాది హైదరాబాద్‌లో 12 స్కూళ్లలో తనిఖీలు చేసి అధికారులు రూపొం దించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జీఓ ఎంఎస్ నం 1 అమలయ్యే దాకా ఫీజులు పెంచకూడదన్నారు. ఈ కార్యక్రమంలో రీతేష్, అరవింద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మాతో కలసి రండి స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై 2008 నుంచి హెచ్ఎస్పీఏ ద్వారా పోరాడుతున్నాం. వేళ్లూనుకుపోయిన ఈ విధానానికి చరమగీతం పాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, సామాన్యులు కూడా మాతో కలసి రావాలి. - విక్రాంత్, హెచ్ఎస్పీఏ అధ్యక్షుడు విద్యతో వ్యాపారం.. ప్రతి ఏడాది ప్రైవేటు పాఠశాలల ఫీజులను విచ్చలవిడిగా యాజమాన్యాలు పెంచుతున్నాయి. సేవ పేరుతో పుట్టుకొస్తున్న పాఠశాలలు.. యథేచ్ఛగా విద్యను వ్యాపారం చేస్తున్నాయి. - శివ మకుటం, హెచ్ఎస్పీఏ అధికార ప్రతినిధి