breaking news
cow safety
-
గో సంరక్షణతో దేశం సుభిక్షం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుపతి/హైదరాబాద్: గో సంరక్షణతో దేశం సుభిక్షంగా ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గోవుకు పురాణాల్లో విశిష్ట స్థానం ఉందని.. గోవును పూజించి రక్షిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆయన తెలంగాణాలో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టీటీడీకి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని ఆయన కోరారు. హిందూ ధర్మం లో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారనీ అందుకే గోవును గోమాత అంటామన్నారు. (చదవండి: ‘గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే’) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7 వతేదీ విజయవాడ కనక దుర్గ ఆలయంలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. రెండవ విడతగా గురువారం తెలంగాణలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు. హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.(చదవండి: తిరుమల: శాస్త్రోక్తంగా బాలాలయ సంప్రోక్షణ) ఈ కార్యక్రమం అమలు కోసం ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశవాళీ ఆవుల దానాన్ని స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. మఠాలు, పీఠాలు, వంశపారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వేద పాఠశాలలకు ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అందజేస్తుందన్నారు. గోదానం పొందిన ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్వీ గో సంరక్షణశాల అనుమతితో భక్తులు ఈ కార్యక్రమానికి గోవులను దానం చేయాల్సి ఉంటుందని’’ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు గోవింద హరి, శివ కుమార్, డివి పాటిల్, స్థానిక సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. -
గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డలపై లేదేం?
భారతదేశం ఇక ఎంత మాత్రం పేద దేశం కాదు. కానీ దేశంలో పేదరికం ఉంది. ఏమిటి ఈ వైరుధ్యం? ప్రపంచంలోనే అతి పెద్ద కోటీ శ్వరుల్లో ఒకడైన ముకేష్ అంబానీ మన భారతీయుడే. చెత్తకుప్పల దగ్గర చిత్తుకాగితాలు ఏరుకునే బడి వయసు బాలలు లక్షల్లో ఉన్నారు మనదగ్గర. వారూ భారతీయులే. ఎందుకిలా? ఈ దేశ తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి జాతి యావత్తు సిగ్గుతో తలవంచుకునేట్లు చేస్తున్నది. దేశంలో సంవత్సరానికి 9 లక్షల మంది శిశువులు, అనగా నిమిషానికి ఒక బిడ్డ పురిటిమంచం లోనే చనిపోతున్నారని యునిసెఫ్ నివేదిక చెపుతోంది. మరణిస్తున్న పిల్లల్లో 54 శాతం పోషకాహారం లేక చనిపోతున్నారని ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. మన ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ ప్రభుత్వానికి గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డల రక్షణ మీద లేదు. బాలల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతే కానీ బీద పిల్లలపై ప్రభుత్వం చూపే జాలి, కరుణ లేదా భిక్ష కాదు. కనక ముందు, కన్న తరువాత కూడా తల్లి, బిడ్డల సంరక్షణ నేడు ఒక సమస్యగా మారింది. ఇంటి యజమానితోపాటు తల్లీ-పిల్లా అందరూ చాకిరీ చేస్తే గానీ ఇల్లు గడవని స్థితికి శ్రామిక కుటుంబాలను ఈ ప్రభుత్వాలు నెట్టేశాయి. మెజారిటీ ఆడవాళ్లు ఇంటా బయటా చాకిరీ చేస్తూ కుటుంబ పోషకులుగా ఉన్నవారే. అటువంటి చాకిరీలో మగ్గిపోయే తల్లుల పిల్లల్ని ఎవరు చూడాలి? ఏ అవ్వనో, అమ్మమ్మనో బ్రతిమాలుకోవాలి. లేకుంటే ఆ దేవుడే దిక్కు అని ఇంట్లో పెట్టి బయట తలుపు గడిపెట్టి పోవాలి. లేదా తల్లి పని మానుకోవాలి. గత కాలంలో కనీసం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోనైనా అవ్వలు, అమ్మమ్మల సంరక్షణలో పిల్లలు పెరిగేవారు. కానీ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పు అవ్వలు, అమ్మమ్మల్ని కూడా వదల్లేదు. వారు కూడా ఏదో ఒక వృత్తి, ఉపాధిని వెతుక్కుంటున్నారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధితోపాటు, ఆటపాటలతో పిల్లల కు చదువుచెప్పడం మొదలుపెట్టి, క్రమంగా ‘బడి-బెత్తం మాస్టారు’ అంటే ఉండే భయం పోగొట్టి పిల్లల్ని బడికి, బడిలో చదువుకు అల వాటు చేసే కేంద్రమే అంగన్వాడీ, ఇంకా చెప్పాలంటే అది అమ్మమ్మ, పెద్దమ్మల ఒడి. ఆ ఒడికి, బడికి మరింత సత్తువనిచ్చి, పసిబిడ్డలు ఉండ టానికి, ఆడుకోవడానికి, నిద్ర వస్తే పడుకోవడానికి, మలమూత్రాలకు పోవడానికి మరుగుదొడ్డి, దానికి అవసరమైన నీటి వసతి, ఎదిగే పిల్లల పోషణకు కావాల్సిన తిండి- వీటన్నిటినీ ప్రభుత్వమే సమకూర్చాలి. నేడు నర్సరీలు కూడా వ్యాపార కేంద్రాలయ్యాయి. నర్సరీ కార్పొ రేట్ కంపెనీలు నిర్వహిస్తున్న నర్సరీ స్కూళ్లతో పోల్చుకుంటే అంగన్ వాడీ కేంద్రాలు ఎన్నో రెట్లు సేవలు అందిస్తున్నట్లు లెక్క. అంగన్వాడీ కేంద్రం పిల్లల సంరక్షణతోపాటు గర్భవతుల, బాలింతల సంరక్షణకు కూడా బాధ్యత పడుతుంది. వైద్య సౌకర్యం కాదు కదా కనీసం మాట సహాయం కూడా అందని గ్రామీణ, గిరిజన స్త్రీలకు ఒక అక్కగానో, ఒక పెద్దమ్మ, పిన్నమ్మగానో వారికి తలలో నాలుకలాగా ఉంటుంది. వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రశంసలతోపాటు సుప్రీంకోర్టు కూ డా ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించింది. ప్రతి ఊరు, వాడల్లో ప్రతి నివాస ప్రాంతంలో అంగన్వాడీ బడులు ఏర్పాటు చేయాలని 2001లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ 2014- 15లో 16 వేల కోట్లు ఖర్చు పెట్టిన కేంద్రం 2015-16లో సగానికి సగం తగ్గించి రూ.8 వేల కోట్లు కేటాయించింది. కోట్లాది మంది పేద పిల్లలకు తిండి పెట్టేందుకు సిద్ధం కాని ప్రభుత్వం వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన కార్పొరే ట్ సంస్థలకు ఏడాదికి 5లక్షల 30 వేల కోట్లు రాయితీలు ఇస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరులుగా వారిని తయారు చేస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలను ‘మిషన్ మోడ్’ పేరుతో ‘వేదాంత’ వంటి పెద్ద పెద్ద కంపెనీలకు, ‘ఇస్కాన్’ వంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పి చేతులు కడుక్కోవాలని చూస్తోంది. పసిబిడ్డల ప్రయోజనాలను మించిన జాతి ప్రయోజనం మరొకటి ఉం డదు. ఐసీడీఎస్ స్కీమును, అంగన్వాడీ కేంద్రాలను పరిరక్షించుకో వడం, తద్వారా మన బిడ్డల భవిష్యత్తును, జాతి భవిష్యత్తును కాపాడు కోవడం మనందరి కర్తవ్యం. ఎస్.పుణ్యవతి (వ్యాసకర్త అధ్యక్షురాలు) సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ కమిటీ, ఫోన్ : 0866-2442988