Cosmopolitan City
-
కాలీ పీలీ దిమాఖ్ ఖరాబ్ జేయకురా బై!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటే ఆరామ్ సంస్కృతి, దక్కనీ భాష.. బిర్యానీ భోజనం! నిజాం పాలనలో తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రాంతాలూ ఉండడం, ఉర్దూ అధికార భాష కావడంతో ఇక్కడి తెలుగులో వీటన్నిటీ ప్రభావమూ కనిస్తుంది. ఒక్కప్పుడు నగరం నైజాం రాజధాని.. తర్వాత రెండు తెలుగురాష్ట్రాల రాజధానీ కావడంతో కాస్మోపాలిటన్ కల్చర్‌కు వేదికగా నిలిచింది. దీనివల్ల కూడా హైదరాబాద్ తెలుగు పలు భాషల పదాలతో కలిసి ఈ అర్బన్ లింగో మిగిలిన నగరాల్లోలా కాక హైదరాబాదీ లింగోగా తన ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ కూరగాయల బేరగాళ్లు, ఆటోవాలాలు, యువత.. పెద్దవాళ్లు.. ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో తెలుగు ఉంది ఇక్కడ. ‘అరే అమ్మా.. ఇయ్యాల తర్కారీ (కూరగాయలు) మస్తు సస్తా (చవక) ఉన్నయ్, కద్దూ (సొరకాయ), కరేలా (కాకరకాయ), కల్యామాక్ (కరివేపాకు), భేండీ (బెండకాయ) అన్నీ సస్తల్నే’’ అంటారు. ఉత్తర భారతీయులూ ఎక్కువగా ఉండడం వల్ల పాతబస్తీ నుంచి మొదలు వయా నాంపల్లి బేగంపేట్ వరకు కూరగాయల పేర్లు హిందీ లేదా ఉర్దూ భాషల్లోనే వినిపిస్తాయి మార్కెట్లలో. బేరగాళ్ల దగ్గర కూడా! గ్లోబలైజేషన్ నేపథ్యంలో సూపర్ మార్కెట్లు వచ్చినా అక్కడ ఇంగ్లిష్ జతకూర్చుకుంది కాని ఈ నేటివిటీ అయితే తాజాతనం కోల్పోలేదు. కాలీ పీలీ.. కిరాక్.. ఎక్కడున్నా యువత ఉనికే వేరు. వాళ్ల ఫ్యాషన్‌కే కాదు వాళ్ల కమ్యూనికేషనూ లేటెస్ట్ ట్రెండ్‌నే అనుసరిస్తుంటుంది. అందుకే ప్రతి తరంలో యూత్ కొత్త తెలుగును ఆవిష్కరిస్తుంటారు. ఇందులోనూ హైదరాబాద్ యువతరం ఫర్మాయిష్ ప్రత్యేకమే. పొట్టి, పాట్ట (అమ్మాయి, అబ్బాయి) నుంచి మొదలవుతుంది ఇది. ‘2 పొట్టి ఏముందిరా.. ఏక్దమ్ కిరాక్’ అంటూ ‘‘అబే.. కాలీ పీలీ (ఉట్టిగానే) దిమాఖ్ ఖరాబ్ జేయకురా బై’ అని ఎండ్ చేస్తారు. మధ్యలో ఇంకెన్ని..? నక్కో (వద్దు), లైట్ లేలే (పట్టించుకోకు), ‘యేం బైగన్ (వంకాయ) పనులు చేస్తున్నవ్రా’, ‘నన్ను బైగన్ చేసేసినవ్ కదా..’, ‘పోరడు చిక్నా (అమాయకుడు, సున్నితమనస్కుడు)రా.. పాపం’, ‘అరే హౌలే (పిచ్చోడు)..’, ‘కిరికిరి (గొడవ) షురూ జేయక్’’, ‘పటాయించు (ప్రేమలో పడేయ్)’’, ‘దబాకే (బాగా) ఆకలైతుంది’, ‘ఏంది.. సర్కాయిం చిందా? (పిచ్చి పట్టిందా)’’ వగైరా వగైరా తెలుగుగానే పలుకుతున్నాయ్. ఇక స్నేహితులను మామా, చిచ్చా.. అని పిలుచుకోవడం పరిపాటి. తరాలు మారుతున్నా ఇవన్నీ ఇప్పటికీ వాడకంలో ఉన్న మాటలే! ఎవర్ యంగ్ జర్గాన్! అంటే పాతతరమూ వీటి సరళి వీడలేదన్నమాట! ఇంటర్నెట్ స్లాంగ్ ఇది ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తున్న మాధ్యమం. దీనికి హైదరాబాదూ మినహాయింపు కాదు. డూడ్, లోల్, రఫోల్, ఓఎమ్‌జీ (ఓ మై గాడ్), యూ నో, హీ ఈజ్ బే (బీఈఏ.. అంటే బిఫోర్ ఎనీ వన్ ఎల్స్), ఫేస్‌పామ్(అయ్యో), త్రో బాక్ టు (పాతది గుర్తు చేసుకునే క్రమం), ఫట్టా.. పీస్ (అందమైన అమ్మాయిని ఉద్దేశించిన పదాలు, ఎఫ్‌వైఐ (ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్), కూల్, చిల్,ఈటీసీ (ఎట్సెట్రా), టీక్యూ (థాంక్యూ), టీకే (టేక్ కేర్) మొదలైనవన్నీ ఇంటర్నెట్ స్లాంగ్గా ఫేమస్ అయ్యాయి. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ చాటింగ్ క్రియేట్ చేసిన మాటలివి. వీటిలో చాలా టీక్యూ, టీకే, రఫోల్, లోల్ వంటివన్నీ కూడా చాటింగ్‌లోనే కాదు.. మాట్లాడుతున్నప్పుడు కూడా వాడుకలో సర్వసాధారణమైపోయాయి. ఏ జోక్ అయినా నవ్వు తెప్పిస్తే లోల్ అని, పగలబడేలా నవ్వు తెప్పిస్తే నవ్వకుండా రఫోల్ అని చెప్పేసి ఊరుకుంటున్నారు అంతే. పరభాషా పదాలు చేరితేనే మాతృభాష విస్త్రతమవుతుంది. అభివ్యక్తీకరణకు కొత్త మాటలు పుడితేనే భాష వికాసం చెందుతుంది. అయితే.. పరాయి పదాలు మన భాషలో ఇమిడిపోవాలి. పరాయి పదాల్లో మన భాష కుంచించుకుపోవద్దు. ఆ జాగ్రత్త పాటిస్తే చాలు! రోకో.. హల్లు సైకిల్ రిక్షాలున్నప్పుడు వినిపించిన ఈ పదాలు ఆటోరిక్షాల్లోనూ ధ్వనిస్తూ క్యాబ్ డ్రైవర్లకూ కామన్ అయ్యాయి. ‘భయ్యా.. చార్మినార్ ఛల్తే’’ దగ్గర బేరం మొదలై రిక్షా ఎక్కాక హైదరాబాద్ ఎగుడు దిగుడు రోడ్లకు తన రిక్షాను బ్యాలెన్స్ చేసుకుంటున్న సందర్భంలో సవారీ.. (సారీ ఈ మాట చెప్పడం కూడా మర్చాం. సవారీ అంటే రిక్షాలో ప్రయాణించే ప్రయాణికుడు) ‘భయ్యా.. హల్లూ ఛలో (నెమ్మదిగా నడుపు అన్నా)’, గమ్యం వచ్చేశాక.. ‘రోకో భయ్యా.. రోకో (ఆపు అన్నా ఆపు) అనే ఉర్దూ పదాలు మొత్తం రవాణా సౌకర్య వ్యవస్థ జార్గాన్గా.. ఆ డిక్షనరీలో స్థిరపడిపోయాయి. డ్రామెటిక్‌గా భావిస్తున్నారు.. సాఫ్ట్వేర్ జాబ్స్, చాటింగ్ వల్లే వాక్యాలు పదాల్లా మారిపోతున్నాయని నా అభిప్రాయం. హైదరాబాద్‌లాంటి చోట్ల తెలుగుతో సమానంగా హిందీ, ఉర్దూ ఉంటాయి. ఈ పది పదిహేనేళ్లలో ఇంగ్లిష్ కూడా అంతే కామన్ అయింది. అచ్చంగా తెలుగులో మాట్లాడితే డ్రామెటిక్‌గా మాట్లాడినట్టు ఉంటోంది. విన్నవాళ్లూ అలాగే భావిస్తున్నారు. – స్వప్నపేరి, అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్ సీక్రెట్‌గా ఉండడం కోసం సాధారణంగా యూత్ లింగో ఎందుకుంటుంది అంటే.. వాళ్ల స్వేచ్ఛను కోపాడుకోవడం కోసం. తల్లిదండ్రులతో, లెక్చరర్స్‌తో ఓపెన్‌గానే ఉంటాం. కాని కొన్ని విషయాల్లో సీక్రెట్స్ తప్పవు కదా! సపోజ్ నా ఫ్రెండ్ పర్సనల్ విషయాలు మా పేరెంట్స్‌తో మాట్లాడలేను కదా. అలా పేరెంట్స్ ముందు ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చనప్పుడో, లేక పరాయి వాళ్లముందు, కొత్త ప్లేసెస్‌లో వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ లింగోను యూజ్ చేస్తాం. – కె.ప్రత్యూష, గ్రాఫిక్ డిజైనర్ ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైయిల్ మాది ఒడిశా. కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నా. మనం ఉండే ప్రాంతం, వాతావరణాన్ని బట్టి స్లాంగ్స్, యాక్సెంట్స్ ఉంటాయి. అర్బన్ లింగో నుంచి మాలాంటి యూత్ సపరేట్గా కొన్ని పదాలను తయారు చేసుకుంటుంటుంది. ఇవన్నీ భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన భిన్న భాషల నుంచీ పుట్టుకొస్తాయి. – భరత్ బెహెరా, ఫన్‌బకెట్ ఆర్టిస్ట్ -
కేటీఆర్.. బ్రాండ్ బాజా!
-
కేటీఆర్.. బ్రాండ్ బాజా!
► ఒలింపిక్స్ నిర్వహించేలా హైదరాబాద్ అభివృద్ధి: కేటీఆర్ ► విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది ► జనాభా 10 కోట్లు దాటినా ► ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు ► నిరంతర విద్యుత్, మహిళా భద్రత, అందరికీ విద్య, వైద్యం ► నగరంలో అన్ని ప్రాంతాలను కలిపేలా మెట్రోరైల్ నిర్మాణం ► ‘బ్రాండ్ హైదరాబాద్’లో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. మంగళవారమిక్కడ ఎస్‌బ్రిక్స్ అనే ప్రైవేటు సంస్థ ‘బ్రాండ్ హైదరాబాద్’ పేరిట శిల్పారామంలో మంత్రి కేటీఆర్‌తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత హైదరాబాద్ మహానగర పరిధి ఐదు జిల్లాలకు విస్తరించిందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగర జనాభా 10 కోట్లకు చేరినా ఇబ్బందుల్లేని విధంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్డీపీ) కింద నగరమంతటా విశాలమైన రోడ్లు, మెరుగైన రవాణా సదుపాయాలు, నిరంతర విద్యుత్, మహిళలకు భద్రత, పరిశ్రమలకు ప్రోత్సాహం, అందరికీ ప్రభుత్వ విద్య, వైద్యం తదితర వసతులను కల్పిస్తామన్నారు. మూసీని ఆనుకొని ఉన్న 2 వేల ఎకరాల్లో, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సుందరీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. అన్ని కాలనీల్లో ఆడిటోరియంల నిర్మాణం చేపడతామని, గ్రంథాలయాలు, క్రీడామైదానాలను ఆధునీకరిస్తామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను కలిపేలా రెండోదశలో మెట్రోరైల్, ఎంఎంటీఎస్ రైలు మార్గాలను విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికల గురించి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ జవాబులిచ్చారు. నగరాభివృద్ధికోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కేటీఆర్ ఏమన్నారంటే.. - క్రీడలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తాం. ఏదో ఒకనాటికి ఇండియాలో ఒలింపిక్స్ వస్తే.. అది హైదరాబాద్‌లోనే జరిగేలా ఇప్పట్నుంచే వసతులను మెరుగు పరుస్తాం. - ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల రీజినల్ రింగురోడ్డుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ రెండింటి మధ్య శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేసి, అక్కడ నివసించే వారు అక్కడే పనిచేసే విధంగా చర్యలు చేపడతాం. మిలటరీ ప్రాంతాల్లో ఏర్పడుతున్న రహదారి సమస్యలపై రక్షణశాఖతో చర్చిస్తున్నాం.. వచ్చే మే నె లాఖరుకల్లా సమస్యలను పరిష్కరిస్తాం - టి-హబ్‌లో ఐటీ స్టార్టప్స్ మాదిరిగానే గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా తదితర రంగాల్లో స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు మరిన్ని ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేస్తాం. - విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పరంగా సేవలు మెరుగు పరుస్తాం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మరింత పటిష్టం చేస్తాం. ప్రభుత్వ సంస్థలతో బ్యాలెన్స్ చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తాం. టాస్క్ ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. వచ్చే మూడేళ్లలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. - తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎవరో చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల వారికి ఎలాంటి నష్టం జరగలేదు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం మెరుగైన విధానాన్ని అవలంబిస్తోంది. న్యూయార్క్, డాలస్ నగరాల్లో మాదిరిగా పోలీస్ వ్యవస్థకు అవసరమైన సదుపాయాలను కల్పించాం. - గతేడాది కాలంలో హైదరాబాద్‌లో కరెంట్ కోతల్లేవు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సరఫరాను అందిస్తాం. ప్రస్తుతం ఉన్న 4,760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 24 వేల మెగావాట్లకు పెంచేలా చర్యలు చేపట్టాం. కరెంటు ఆదా చేసేందుకు నగరంలో వీధిలైట్లకు ఎల్ఈడీ బల్బులను అమరుస్తున్నాం. - స్మార్ట్‌సిటీల విషయంలో, ఎఫ్ఆర్బీఎం (రుణ పరిమితి) పెంపు విషయంలోనూ కేంద్రం సహకరించడం లేదు. అయినా వివిధ అభివృద్ధి పనులకు ఆర్థిక సాయం అందించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. - రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటిని అందించేందుకు రూ.40 వేల కోట్లతో ప్రభుత్వం మిషన్ భగీరథ చేపట్టింది. హైదరాబాద్‌కు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మరో రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తాం. - ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. త్వరలో నూతన ఐటీ పాలసీ తెస్తాం. - నగరంలో తడి చెత్త ద్వారా ఎరువును, పొడి చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. - ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు.. తదిరత సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. -
వలస ప్రజలను ఆదరించే నగరమే రాజధాని...
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన విశాఖపట్నం ఎప్పటినుంచో కాస్మోపాలిటన్ సిటీగా విదేశీయులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కలిగి ఉన్న ప్రశాంత నగరం. రాష్ట్రానికి రాజధాని కాదగిన అనుకూలతలు దీనికి చాలానే ఉన్నాయి. రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేసే నగరం జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రాముఖ్యత కలిగిన నగరమై ఉండాలి. తద్వారా బహుళజాతి సంస్థలను సులభంగా ఆకర్షించడం సా ధ్యపడుతుంది. ప్రశాంతతకు చిహ్నంగా, నేర రహితంగా, కాస్మోపాలిటన్ కల్చర్ కలిగి, ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడం ప్రగతికి ఎంతగానో దోహదకారిగా మారుతుంది. ఏ రాష్ట్ర రాజధాని అయినప్పటికీ అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండాలనేది ఒక సాధారణ అభిప్రాయం. దీంతోపాటు పరిపాలనా విభాగానికి కేంద్రంగా నిలుస్తూ, అ న్ని ప్రాంతాలను అనుసంధానించాలి, లేని పక్షంలో ఆయా ప్రాంతాలు నిస్తేజమైపోతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో రాజధానికి కనెక్టివిటీ, యాక్టివిటీ అనేది ఉండాలి. అసమతుల్యత ఏర్పడితే సమ్మిళిత అభివృద్ధి సాధ్యం కాదు. రాజధాని నిర్మాణం జరిపే సమయంలో అనువైన ప్రాంత ఎంపికలో కొన్ని అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలి. భౌతిక అనుసంధానం, ఈ-అనుసంధానం కలిగి ఉండాలి. భౌతిక అనుసంధానంలో రోడ్డు, వాయు, నీటి, రైలు ద్వారా రాజధానికి సులభంగా చేరుకోగలగాలి. ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో ఏ ప్రాంతంతో అయినా సులభంగా సంప్రదించే విధంగా సాంకేతికంగా అనుసంధానం కలిగి ఉండాలి. లొకేషన్ బ్రాండ్... రాష్ట్ర గుర్తింపును తీసుకువచ్చేది కేవలం రాజధాని మాత్రమే. లొకేషన్ పరంగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న ప్రాంతాలలో మాత్ర మే రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనుకూలంగా ఉం టుంది. తద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత సాధించడం సాధ్యపడుతుంది. నగరం కాస్మోపాలిటన్ సిటీగా ఉంటూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వారిని స్వీకరించే మనస్తత్వం కలిగి ఉం డాలి. పరిశ్రమలు, పర్యాటకం, వ్యాపారం విస్తరణకు అనువైనదిగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు సౌకర్యవంతంగా జీవనం సాగించే విధంగా రాజధాని నిర్మితం కావాలి. రాజధాని నగరానికి నేర, ఉగ్రవాద చరిత్ర ఉండరాదు. బల మైన సాంప్రదాయ పునాదులపై నిర్మితమైనది కాకుండా అన్ని వర్గాలను ఆహ్వానించేదిగా ఉండాలి. భౌగోళికంగా ప్రజల విద్యా, వైద్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల అవసరాలు తీర్చగలిగే భూభాగం కలిగి ఉండాలి. విశాలమైన రోడ్డు, పారిశుధ్య వ్యవస్థ, పాలనా వ్యవస్థ, వ్యాపారం, పరిశ్రమలు ఏర్పాటు కావాలి. అంతర్జాతీయ విమానాశ్రయం, తగినంత నీటి వనరులు ఉండాలి. కనీసం రానున్న 50 సంవత్సరాల అభివృద్ధికి సరిపోయేటంతగా ఇవి ఉండాలి. ప్రస్తుతం భౌగోళికంగా రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న విజయవాడ నగరం కాస్మోపాలిటన్ సిటీకాదు. ఇది నేర చరిత్ర కలిగి, బలమైన సాంప్రదాయ మూలాలు కలిగిన ప్రజలు నివసించే నగరం. అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు లేవు. ప్రధానంగా తగినంత భూములు, పుష్కలంగా నీటి వనరులు కలిగి ఉన్న నగరంగా మాత్రమే ఇది ప్రాచుర్యం కలిగి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ స్థానం అంతంత మాత్రమే. విజయవాడతో పోలిస్తే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెంది న విశాఖ ఎప్పటినుంచో కాస్మోపాలిటన్ సిటీగా ఇతర రాష్ట్రా ల ప్రజలనే కాకుండా, విదేశీయులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. పారిశ్రామిక, వ్యాపార, విద్యా రంగాలకు ఎంతో పేరు గాంచింది. ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కలి గి ఉన్న ప్రశాంత నగరం. అయితే ఇక్కడ భవిష్యత్ అవసరాలకు సరిపడినన్ని నీటి వనరుల లభ్యత అనేది ప్రశ్నార్థకం. రాష్ట్రానికి మరో మూలన ఉన్న కర్నూలు ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకోలేకపోయింది. శాంతిభద్రతలు, కనెక్టివిటీ లేవు. ఇక్కడి ప్రతి రంగాన్ని నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. నీటి వనరుల లభ్యత చాలా కష్టతరం. రాష్ట్ర రాజధానిలో కేవలం పరిపాలనా వ్యవస్థ, రెవెన్యూ, శాంతి భద్రతలు, పన్నులు, శాసనసభ, మండలి, సాధారణంగా నిరంతరం పర్యవేక్షించాల్సిన ప్రధాన అంగాలు ఉం డాలి. వ్యవసాయ, విద్య, పారిశ్రామిక, గనుల శాఖ, న్యాయస్థానాలు, సముద్ర, మత్స్య పరిశ్రమలు తదితర అంగాలను ఆయా ప్రాంతాల భౌగోళిక వసతులు, వనరుల లభ్యత తదితర అంశాల ఆధారంగా విభజించి సమ ప్రాధాన్యం అందిస్తూ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల మధ్య సమతూకం, అభివృద్ధి సిద్ధిస్తుంది. సహజ వనరుల లభ్యత ఆధారంగా వీటిని కేటాయించడం ఎంతో మేలుచేస్తుంది. (వ్యాసకర్త ఆంధ్ర విశ్వవిద్యాలయం వాణిజ్య నిర్వహణ శాస్త్ర విభాగం ఆచార్యులు)